logo

తీపి పంచేనా?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏకైక ఉయ్యూరు కేసీపీ చక్కెర కర్మాగారంలో 2023-24 క్రషింగ్‌ సీజన్‌ ఈ నెల 6వ తేదీన ప్రారంభం కానుంది. గత నాలుగైదేళ్లుగా సాగు పెంచేందుకు కేసీపీ వ్యవసాయ విభాగం, యాజమాన్యం ఎంత ప్రయత్నించినా ఆశించిన ఫలితం కనపడలేదు

Published : 06 Dec 2023 04:21 IST

6న కేసీపీలో క్రషింగ్‌ ప్రారంభం
ఉయ్యూరు, న్యూస్‌టుడే

మ్మడి కృష్ణా జిల్లాలో ఏకైక ఉయ్యూరు కేసీపీ చక్కెర కర్మాగారంలో 2023-24 క్రషింగ్‌ సీజన్‌ ఈ నెల 6వ తేదీన ప్రారంభం కానుంది. గత నాలుగైదేళ్లుగా సాగు పెంచేందుకు కేసీపీ వ్యవసాయ విభాగం, యాజమాన్యం ఎంత ప్రయత్నించినా ఆశించిన ఫలితం కనపడలేదు. దీంతో ఈసారి కూడా తక్కువ విస్తీర్ణంతోనే గానుగాడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో 12 లక్షల టన్నులు గానుగాడిన ఈ కర్మాగారం నేడు నాలుగు లక్షలకు పరిమితమైంది. ఒకానొక దశలో ఉయ్యూరు కర్మాగారం పరిధిలో 16 వేల మంది రైతులు చెరకు సాగు చేయగా.. నేడు ఈ సంఖ్య(మూడు కర్మాగారాల పరిధి) ఆరు వేలకు పడిపోయింది. గతంలో కేసీపీ పరిధిలో 36 వేల ఎకరాల్లో సాగవగా.. నేడు ఉమ్మడి జిల్లా పరిధిలో 11,500 ఎకరాలకు తగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయా వర్గాలు భావిస్తున్నాయి.

నరుకుడు, రవాణా భారం: యాంత్రీకరణ అభివృద్ధి లేనందున చెరకు నరుకుడు, రవాణా రైతుకు తలకుమించిన భారంగా మారింది. ప్రధానంగా నరుకుడుకు స్థానిక కూలీలు ఒక శాతం కూడా పనిచేయరు. 99 శాతం వలస కూలీల పైనే కర్షకులు ఆధారపడాల్సి ఉంది. ప్రస్తుత సీజన్‌కు ఏడు వేల మంది కూలీల అవసరం ఉంది. తూర్పు గోదావరి, ప్రకాశం, నల్గొండ జిల్లాల నుంచే వారు వస్తుంటారు. కూలి రేటు కూడా ఏటా పెంచేస్తుండటంతో ఆర్థికభారం పడుతోందని, రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని రైతులు వాపోతున్నారు.  ప్రస్తుతం సీజన్‌లో పంటకు వాతావరణం ప్రతికూల ప్రభావం ఎక్కువగానే ఉంది. దీనికితోడు తెల్లనల్లి, కాండం తొలిచే, లద్దె, దూదేకుల పురుగుల బెడదతో దిగుబడి తగ్గే అవకాశం కనపడుతోంది.

యాజమాన్య రాయితీ, అదనపు ధరతో కలిపి టన్నుకు రూ.3464.75గా ప్రకటించారు. యూనిట్‌ హెడ్‌ సీతారామదాస్‌ మాట్లాడుతూ  కొన్నేళ్లుగా చెరకు సాగు విస్తీర్ణం తగ్గుతుండడం ఆందోళనకర పరిణామమన్నారు. యాజమాన్య పరంగా రైతులకు నూటికి నూరు శాతం ప్రయోజనం అందిస్తున్నామని తెలిపారు. ఈ సాగు విస్తీర్ణం పెంచేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు