logo

మిగ్‌జాం... బీభత్సం

కుండపోత వర్షం.. వణికించిన ఈదురుగాలులు.. నేలకూలిన చెట్లు.. ధ్వంసమైన దారులు.. కూలిన గుడిసెలు.. ఎడతెరిపి లేని ముసురుతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు పంటలకు అపార నష్టం సంభవించింది.

Published : 06 Dec 2023 04:33 IST

ఉమ్మడి జిల్లాపై తీవ్ర ప్రభావం

ఈనాడు - అమరావతి: కుండపోత వర్షం.. వణికించిన ఈదురుగాలులు.. నేలకూలిన చెట్లు.. ధ్వంసమైన దారులు.. కూలిన గుడిసెలు.. ఎడతెరిపి లేని ముసురుతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు పంటలకు అపార నష్టం సంభవించింది. మిగ్‌జాం సృష్టించిన బీభత్సం ఇది. విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసింది. తుపాను వాయుగుండంగా మారిన తర్వాత విజయవాడ నగరంలో గాలి దుమారం కలకలం రేపింది. కొంత ఆస్తి నష్టం సంభవించింది. ప్రాణ నష్టం లేకపోయినా.. ఆస్తి నష్టం బాగానే జరిగింది. మచిలీపట్నం, విజయవాడ నగరంలో జనజీవనం అస్తవ్యస్తంగా మరింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరింది. రహదారులపై ప్రయాణాలు నిలిచాయి. దుకాణాలను మూసేశారు. వ్యాపారాలు బోసి పోయాయి. పాఠశాలలు, కళాశాలలూ తెరుచుకోలేదు.

మిగ్‌జాం తుపాను ప్రభావం కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలపై ఆదివారం రాత్రి నుంచే కనిపించింది. ఆదివారం రాత్రి ఒక మోస్తరు జల్లులు కురిశాయి. సోమవారం ఉదయం నుంచి ముసురు పట్టింది. కృష్ణాలో తీరం వెంట ఈదురుగాలులు, జోరు వర్షంతో పలుగ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. నాగాయలంక, అవనిగడ్డ, కోడూరు, బందరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పల్లెకారులను పునరావాసానికి తరలించారు. దాదాపు జిల్లాలో 5 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరిలించారు. సోమవారం జల్లులుగా కురిసిన వర్షం రాత్రి నుంచి కుండపోతగా కురిసింది. దీంతో నగరాలు, పల్లెలు, పట్టణాలు తడిసిముద్దయ్యాయి. పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లమీద పడ్డాయి. విద్యుత్తు స్తంభాలు విరిగి ఆటోలమీద పడ్డాయి. విజయవాడలో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంటు ఇనుప పరంజా కూలి ఇంటిమీద పడటంతో నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి.వన్‌టౌన్‌లో చెట్లు నేలకొరి రోడ్లకు అడ్డంగా పడ్డాయి. మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, పెనమలూరు, కంకిపాడు మండలాల్లో రహదారి వెంట చెట్లు నేలకొరిగాయి.  

విజయవాడ మీదుగా..

మంగళవారం మధ్యాహ్నం బాపట్ల వద్ద తీరం దాటిన మిగ్‌జాం వాయుగుండంగా మారి సాయంత్రం 6.30 - రాత్రి 7.30 గంటల మధ్య విజయవాడ మీదుగా పయనించింది. ఆ సమయంలో ఈదురుగాలులు వీచాయి. వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. కృష్ణా జిల్లాలో సాయంత్రం నుంచి కొంత శాంతించింది. వర్షం కురిసినా గాలులు లేవు. విజయవాడ నగర జనజీవనం అతలాకుతలమైంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి.  మచిలీపట్నం రహదారులు అన్నీ నీట మునిగాయి. కోనేరు సెంటర్‌, బస్టాండు ప్రాంతం మోకాలిలోతు నీటిలో మునిగింది. రైళ్లు రద్దు చేశారు. కొన్ని బస్సు సర్వీసులు రద్దు చేశారు. బుధవారానికి పరిస్థితి కొంతమెరుగు పడనుందని అధికారులు చెబుతున్నారు.  కృష్ణాలో మూడు ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలను ఉంచినా వారి సహాయక చర్యలు అవసరం రాలేదు. ప్రాణ నష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని కృష్ణా కలెక్టర్‌ రాజబాబు స్పష్టం చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని