logo

ఓటరు దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కారం

ఓటరు జాబితాల సవరణల నేపథ్యంలో ఫారం-6, 7, 8ల కింద ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు.

Published : 07 Dec 2023 06:08 IST

రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ డిల్లీరావు

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ఓటరు జాబితాల సవరణల నేపథ్యంలో ఫారం-6, 7, 8ల కింద ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నగరంలోని కలెక్టరేట్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు పారం-6 కింద 1,13,092 దరఖాస్తులు రాగా, వీటిలో 92,590 పరిష్కరించామని, ఇంకా 20,502 పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. ఫారం-7 కింద 1,01,634 దరఖాస్తులు రాగా, వీటిలో 91,364 పరిష్కరించామనీ, ఇంకా 10,270 పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఫారం-8 కింద 2,08,513 అర్జీలు రాగా, వీటిలో 1,91,951 పరిష్కరించారు. మరో 16,562 పరిష్కరించాల్సి ఉందన్నారు. ఈ నెల 26వ తేదీ నాటికి అన్ని దరఖాస్తులను పరిష్కరించి, రానున్న జనవరి ఒకటి నాటికి తప్పులు లేని తుది ఓటర్ల జాబితాలను ఎన్నికల కమిషన్‌కు అందజేయనున్నట్టు వెల్లడించారు. 2024, జనవరి 5న తుది ఓటర్ల జాబితాలను ఎన్నికల కమిషన్‌ ప్రకటించనున్నట్టు ఆయన వివరించారు.

డిజిటల్‌ ఇంటి నంబర్లతో తంటా

సమావేశంలో పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ.. నగరపాలక సంస్థ పరిధిలోని ఓటర్ల జాబితాల్లో గృహాలకు సంబంధించిన డిజిటల్‌ నంబర్లు ఉన్నాయని, దీంతో ఓటర్ల గుర్తింపు కష్టతరమవుతున్నట్టు తెలిపారు. వాటిని తొలగించి, ఇంటి నంబర్లను కేటాయించాలని కోరారు. శాశ్వతంగా వలస వెళ్లిన, మరణించిన, డబుల్‌ ఎంట్రీ ఓటర్లను, ఫారం-7లో గుత్తగా వచ్చిన దరఖాస్తులపై విచారణ చేసి, జాబితాల నుంచి తొలగించాలని కలెక్టర్‌కు విన్నవించారు. సమావేశంలో డీఆర్వో ఎస్‌.వి.నాగేశ్వరరావు, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్‌ సి.హెచ్‌.దుర్గాప్రసాద్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రాజేశ్వరి, పార్టీల ప్రతినిధులు ఎల్‌.శివరామప్రసాద్‌ (తెదేపా), పి.వి.శ్రీహరి (భాజపా), కె.కల్యాణ్‌ కుమార్‌ (సీపీఎం), పి.ఏసుదాసు (కాంగ్రెస్‌), వై.ఆంజనేయరెడ్డి (వైకాపా), ఎం.వినోద్‌కుమార్‌ (బీఎస్పీ), కె.పరమేశ్వరరావు (ఏఏపీ) తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని