logo

రైతుల గుండెలు పగిలాయి

మిగ్‌జాం తుపాను బీభత్సానికి వాటిల్లిన తీవ్ర నష్టంతో అన్నదాతల గుండెలు పగిలాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 07 Dec 2023 06:09 IST

తుపాను నష్టంపై మాజీ మంత్రి వేదన

మొర్సుమిల్లిలో రైతులతో కలిసి నష్టపరిహారం ఇవ్వాలని నినాదాలు చేస్తున్న దేవినేని ఉమామహేశ్వరరావు

మైలవరం, న్యూస్‌టుడే: మిగ్‌జాం తుపాను బీభత్సానికి వాటిల్లిన తీవ్ర నష్టంతో అన్నదాతల గుండెలు పగిలాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలం మొర్సుమిల్లిలో వర్షాలకు దెబ్బతిన్న వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలను పరిశీలించి, రైతులతో నష్టాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి మొద్దునిద్ర వీడి ఇకనైనా బయటకు వచ్చి నష్టాన్ని పరిశీలించాలని డిమాండు చేశారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు భారీ నష్టం వాటిల్లిందని, ఆదుకోవడానికి తమ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రకటించిన పరిహారాన్ని ప్రతి రైతుకు అందించాలన్నారు. మిర్చికి ఎకరానికి రూ.1.5 లక్షలు, పత్తికి రూ.30 వేలు, వరికి రూ.30 వేల వరకు కర్షకులు పెట్టుబడులు పెట్టారని, కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. నేలవాలిన పంటను కోయాలంటే ఎకరానికి రూ.15 వేల వరకు ఖర్చవుతుందని, దిగుబడులు బాగా తగ్గిపోతాయన్నారు. చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోయారని, కూలీలకు పనులు లేవన్నారు. పట్టెడన్నం పెట్టే రైతు విలవిల్లాడుతున్నారని వాపోయారు. తమ ప్రభుత్వ హయాంలో వచ్చిన హుద్‌హుద్‌, తిత్లీ తుపానుల సమయంలో అన్నదాతలను బాగా ఆదుకున్నట్లు గుర్తుచేశారు. ఇంట్లో కూర్చుంటే ఏం తెలియదని, ముఖ్యమంత్రి బయటకు రావాలని నినదించారు. రైతుల డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చేసి, నష్ట పరిహారం అంచనాలు సిద్ధం చేయాలని కోరారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో రైతులను ఆదుకోవాలని తమ అధినేత పార్టీని ఆదేశించారన్నారు. గ్రామాల్లోకి అధికారులు వెంటనే రావాలన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసే సాయాన్ని చంద్రబాబు చెబుతున్నారని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు