logo

నిందితుడితో పరిహారం పంపిణీ

తుపాను పునరావాస కేంద్రంలోని బాధితులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నిందితుడితో ప్రభుత్వ పరిహారం పంపిణీ చేయించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Updated : 07 Dec 2023 06:40 IST

అవమానించారని దళిత సర్పంచి, కోఆప్షన్‌ సభ్యుడి వాకౌట్‌

నిరసన తెలుపుతున్న రంగారావు, మాధవి

కె.కొత్తపాలెం (మోపిదేవి), న్యూస్‌టుడే: తుపాను పునరావాస కేంద్రంలోని బాధితులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నిందితుడితో ప్రభుత్వ పరిహారం పంపిణీ చేయించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దీంతో కార్యక్రమానికి తమను పిలిచి అవమానించారని కె.కొత్తపాలెం దళిత సర్పంచి కొక్కిలిగడ్డ మాధవి నిరసన తెలిపారు. శిబిరం ముగింపు సందర్భంగా బాధితులకు బుధవారం పరిహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచితోపాటు మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు చందన రంగారావును కూడా ఆహ్వానించారు. శిబిరంలోని 40మంది బాధితులకు పరిహారం పంపిణీని తహసీల్దార్‌ నవీన్‌కుమార్‌ పర్యవేక్షించారు. పంపిణీకి వచ్చిన తనను కాదని, ఓ కేసులో నిందితుడిగా ఉన్న అనిశెట్టి బాబూరావు చేతుల మీదుగా పంపిణీ ప్రారంభించారు. కొద్దిసేపు వేచిచూసిన తర్వాత నన్నెందుకు రమ్మన్నారంటూ సర్పంచి మాధవి ప్రశ్నించారు. సమాధానం లేకపోవడంతో తమను అవమానించారని కో-ఆప్షన్‌ సభ్యుడితోపాటు తాను కూడా వెళ్లిపోయానని సర్పంచి తెలిపారు. గత నెలలో గ్రామంలో ఎస్టీ బాలిక, ఆమె బంధువులపై జరిగిన దాడి కేసులో నిందితులుగా ఉన్న మత్తిరాజాచంద్‌ పర్యవేక్షణలో అనిశెట్టి బాబూరావుతో పంపిణీ చేయించారు. అంబేడ్కర్‌ వర్ధంతి రోజున దళిత సర్పంచికి సంబంధించి ప్రొటోకాల్‌ పాటించకపోగా నిందితులతో పంపిణీ చేయించడంపై సర్పంచి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు తనకు క్షమాపణ చెప్పకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై తహసీల్దార్‌ నవీన్‌కుమార్‌ వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా కార్యక్రమాన్ని మండల రెవెన్యూ అధికారి పర్యవేక్షించారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని