logo

కృష్ణా పాలసమితి సేవలు అమూల్యం

పశు పోషణ, పాల వృద్ధికి కృషి చేస్తున్న కృష్ణా పాలసమితి(విజయ డెయిరీ), కృష్ణా నదీ పరివాహక ప్రాంతమంతా వ్యాప్తి చెందాలని చినజీయర్‌ స్వామి ఆకాంక్షించారు.

Published : 08 Dec 2023 03:39 IST

యూనిట్‌లో ప్రధాన యంత్రాన్ని ఆరంభిస్తున్న చినజీయర్‌స్వామి

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే : పశు పోషణ, పాల వృద్ధికి కృషి చేస్తున్న కృష్ణా పాలసమితి(విజయ డెయిరీ), కృష్ణా నదీ పరివాహక ప్రాంతమంతా వ్యాప్తి చెందాలని చినజీయర్‌ స్వామి ఆకాంక్షించారు. ఆ తర్వాత గోదావరి, కావేరి నదుల వెంబడి దానంతట అదే వ్యాపిస్తుందన్నారు. విజయ డెయిరీ ఆధ్వర్యంలో బాపులపాడు మండలం వీరవల్లిలో ‘ప్రాజెక్టు కామధేను’ పేరుతో నిర్మించిన అధునాతన యూనిట్‌ను గురువారం ఆయన ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై  ప్రారంభించారు. దాదాపు రూ.160 కోట్ల వ్యయంతో, 20 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. సభలో ఆయన మాట్లాడుతూ.. 1.50 లక్షల మంది పాడిరైతుల భాగస్వామ్యంతో విజయ డెయిరీని నిర్వహిస్తున్నారని చెప్పారు. అధిక ధర చెల్లించడం, ఏడాదికి మూడు సార్లు బోనస్‌ అందజేయడం, పాడిరైతుల సంక్షేమానికి డెయిరీ కృషిచేస్తోందని చెప్పారు. సంస్థ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు కృషితో ఈ పురోగతి సాధ్యమైందన్నారు. పశుపోషణ పవిత్రమైన వృత్తి అని, పాలు తల్లికి ప్రత్యామ్నాయం వంటివని చినజీయర్‌ వ్యాఖ్యానించారు. చలసాని మాట్లాడుతూ.. ఆరు లక్షల లీటర్ల సామర్థ్యంతో నూతన యూనిట్‌ని నిర్మించినట్లు చెప్పారు. ప్రతికూల పరిస్థితుల నడుమ.. రెండేళ్ల వ్యవధిలో అనుకున్న బడ్జెట్‌ కంటే తక్కువ ఖర్చుతోనే నిర్మాణం పూర్తయిందన్నారు. పశు పోషణను లాభసాటి ఉపాధి మార్గంగా తీర్చిదిద్దడం, సంస్థకు వచ్చే మొత్తంలో 80 శాతం పాడిరైతులకే తిరిగి ఖర్చు పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. నూతన యూనిట్‌ని ఒక దేవాలయంగా భావిస్తున్నామన్నారు. ఈ ఏడాది రెండో విడతగా రైతులకు ఇచ్చే బోనస్‌ (రూ.12,26,43,687) నమూనా చెక్కుని చినజీయర్‌ ద్వారా పంపిణీ చేశారు. పాలకవర్గాన్ని, ఉద్యోగులను చినజీయర్‌ సత్కరించి ఆశీస్సులు అందజేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. రైతు నాయకులు ఆళ్ల గోపాలకృష్ణ, గుండపనేని ఉమాప్రసాద్‌, వేములపల్లి శ్రీనివాసరావు, లంక సురేంద్రబెనర్జీ, చలసాని ఆంజనేయులను సన్మానం చేశారు. విజయ  డెయిరీ ఎండీ కొల్లి ఈశ్వర్‌బాబు, జీఎం అనిల్‌కుమార్‌, డైరెక్టర్లు దాసరి బాలవర్థనరావు, ఎర్నేని సీతాదేవి, అర్జా వెంకట నగేష్‌, వేమూరి సాయి, చలసాని చక్రపాణి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని