logo

దిశ మారలేదు.. ఘోరాలు ఆగలేదు..

‘దిశ యాప్‌ తోడుంటే.. అన్నయ్య మీ వెంట ఉన్నట్లే..’ అంటూ తరచూ సభల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెబుతుంటారు.

Updated : 08 Dec 2023 05:52 IST

అతివలపై నేరాల్లో జిల్లాకు ప్రథమ స్థానం
జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక వెల్లడి

ఈనాడు, అమరావతి: ‘దిశ యాప్‌ తోడుంటే.. అన్నయ్య మీ వెంట ఉన్నట్లే..’ అంటూ తరచూ సభల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెబుతుంటారు. రికార్డు స్థాయిలో మొబైళ్లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించామని జబ్బలు చరచుకునే ప్రభుత్వ పెద్దల మాటల డొల్లతనాన్ని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు బయటపెట్టాయి. ఇటీవల జాతీయ నేర గణాంక సంస్థ వార్షిక నేర నివేదిక - 2022ను విడుదల చేసింది. ఎన్టీఆర్‌ జిల్లాలో మహిళలపై దాడులు పెరిగిన వైనాన్ని ఈ గణాంకాలు కళ్లకు కట్టాయి. వారానికో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. చిన్నారులపై నేర ఘటనలకు సంబంధించిన కేసుల్లోనూ ఇదే తీరు. రాష్ట్రంలోనే అత్యధికంగా 554 కేసులు ఎన్టీఆర్‌ జిల్లాలోనే నమోదయ్యాయి. హత్యల్లో జిల్లా రాష్ట్రంలోనే ఆరో స్థానంలో నిలిచింది. గత ఏడాది మొత్తం 48 హత్యలు జరిగాయి. దాడి ఘటనలు కూడా ఎక్కువగా నమోదు అయ్యాయి. ఇందులోనూ ఆయుధాలతో దాడి చేసినవే 975 ఉండడం గమనార్హం. గంజాయి, మత్తు పదార్థాల రవాణా, వినియోగం పెరగడంతో ఈ కేసుల సంఖ్య 89కు ఎగబాకింది. జిల్లాలో దళితులపై దాడులు ఆగడం లేదు. ఎస్సీలపై గత ఏడాది 81 నేరాలు జరిగాయి. 13 మంది ఎస్సీ మహిళలపై అత్యాచారాలు జరిగాయి. వీరిలో ఎనిమిది మంది బాధితులు బాలికలే కావడం గమనార్హం. ఎస్టీలపై నేర ఘటనలు 15 చోటుచేసుకున్నాయి. ఇందులో రెండు అత్యాచార ఘటనలు ఉన్నాయి.

ఆడవారిపై రోజుకు...6

ఎన్టీఆర్‌ కమిషనరేట్‌ పరిధిలో అతివలపై నేర ఘటనలు అధికంగా నమోదు అయ్యాయి. రాష్ట్ర్రంలోనే అన్ని జిల్లాల కంటే ఎక్కువగా 2,366 ఘటనలు జరిగాయి. రోజుకు ఆరు పైగా చోటుచేసుకోవడం మహిళలకు రక్షణ, భద్రత లోపించిన అంశాన్ని తేటతెల్లం చేస్తోంది. ఇంటా, బయటా అతివలకు రక్షణ లేకుండా పోయింది. భర్త, బంధువుల చేతిలో హింసకు గురైన ఘటనలు 1,204 నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. సొంత మనుషులే దాడికి పాల్పడుతున్నారు. వివిధ కారణాలతో కిడ్నాప్‌ చేసిన కేసులు 60 ఉన్నాయి. అత్యాచార ఘటనలు 51 జరిగాయి. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన ఘటనలు 17 చోటుచేసుకున్నాయి. బాలికలపై లైంగిక దాడుల ఘటనల సంఖ్య కూడా అమాంతం పెరిగింది. 152 మంది బాలికలు అత్యాచారానికి గురి కాగా 198 మంది లైంగిక వేధింపులకు గురయ్యారు.

కనిపించకుండా పోతున్నారు

ఇంట్లో విభేదాలు, ప్రేమ వ్యవహారం, వివాహేతర సంబంధం తదితర కారణాలతో కనిపించకుండా పోతున్న వారి సంఖ్య పెరిగింది. ఇందులో మహిళలతో పాటు పురుషులు కూడా ఉండడం గమనార్హం. కమిషనరేట్‌లో గత ఏడాది మొత్తం 1,347 మంది కనిపించకుండా పోయారు. వీరిలో పురుషులు 486 కాగా, అత్యధికంగా మహిళలు 861 మంది ఉండడం ఆందోళన కలిగించే అంశం. ఈ తరహా కేసులపై అనుశీలన సరిగా ఉండకపోవడమే సంఖ్య పెరగడానికి కారణమవుతోంది. తప్పిపోతున్న వారిలో ఎక్కువ మంది మహిళలు, బాలికలే ఉంటున్నారు. ఇందులో ప్రధానంగా కుటుంబ కలహాలే కారణం. తల్లిదండ్రుల మధ్య సఖ్యత సరిగా లేకపోవడం, పిల్లలపై ఆలనాపాలనా కొరవడడం, దురలవాట్లకు గురై ఇంటి నుంచి పారిపోతున్నారు. ఇది యుక్త వయస్కుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రేమ వ్యవహారం కూడా కారణమవుతోంది. ఇది యువతుల్లో ఎక్కువగా ఉంటోంది. ఇంట్లో వారు తమ ప్రేమను తిరస్కరించడంతో బయటకు వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు కూడా గణనీయ సంఖ్యలోనే కారణాలుగా ఉంటున్నాయి. పలువురి మోసగాళ్ల బారిన పడి గృహిణులు ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. ఇటువంటి వారి జాబితాలో పురుషులు కూడా ఉంటున్నారు.

గత ఏడాది మహిళలపై నేరాల తీరిది..

మొత్తం ఘటనలు: 2,366

భర్త, బంధువుల దాడి: 1,204

ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా దాడి: 408

కించపర్చడం : 167

పోక్సో కేసులు: 412

అత్యాచారాలు: 51

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని