logo

ప్రజల సమస్యలు పట్టని ప్రభుత్వం: మండలి

ఎదురుమొండి దీవుల ప్రజలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు.

Published : 08 Dec 2023 03:44 IST

గొల్లమంద వద్ద కోతకు గురైన రహదారిని పరిశీలిస్తున్న బుద్ధప్రసాద్‌

ఎదురుమొండి(నాగాయలంక), న్యూస్‌టుడే: ఎదురుమొండి దీవుల ప్రజలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. గురువారం ఆయన తెదేపా శ్రేణులతో కలిసి ఎదురుమొండి దీవుల్లోని నాచుగుంట, ఈలచెట్లదిబ్బ, జింకపాలెం, ఎదురుమొండి, తదితర గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసి తుపాను కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఈలచెట్లదిబ్బ రైతుల ప్రయోజనార్ధం కాలిబాట వంతెన నిర్మించాలని, ఎదురుమొండి - నాచుగుంట రోడ్డు నిర్మించాలని, జింకపాలెంలో ఎస్టీలకు చెందిన ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని, తుపాను కారణంగా పడవలు, వలలు దెబ్బతిన్నాయని ప్రజలు బుద్ధప్రసాద్‌ వద్ద మొరపెట్టుకున్నారు. బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ కృష్ణానది ఆటుపోట్లకు కోతకు గురైన బ్రహ్మయ్యగారిమూల-గొల్లమంద రహదారిని తుపాను నిధులతో పటిష్ఠపరచకుంటే ఎదురుమొండికి ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్న సింహాద్రి రమేష్‌బాబు ఈ సమస్యపై దృష్టిపెట్టకపోవటం బాధాకరమన్నారు. అవనిగడ్డ మండలం ఎడ్లంకలో కూడా కరకట్ట కోతకుగురవుతోందన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో తుపానుల సందర్భంగా నిత్యావసర సరకులు అందజేశామని, పడవలు, వలలు దెబ్బతిన్న వెంటనే మత్స్యకారులకు నష్టపరహారం ఇచ్చామని.. వైకాపా ప్రభుత్వం కనీసం వారిని పరామర్శించలేదన్నారు. తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు మండలి వెంకట్రామ్‌, మండల అధ్యక్షుడు మెండు లక్ష్మణరావు, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ మండవ బాలవర్ధిరావు, లకనం నాగాంజనేయులు, నాయుడు బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని