logo

ఎప్పటికప్పుడు ఎదురుచూపులే

సమగ్రశిక్షలో ఎప్పుడు జీతాలు ఇస్తారో... ఎన్ని నెలలకు ఇస్తారో తెలియక వివిధ విభాగాల్లో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Published : 08 Dec 2023 03:47 IST

వేతనాలు అందక ఉద్యోగుల అవస్థలు

జీతాలతోపాటు ఇతర సమస్యలపై ధర్నాచేస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగులు(పాతచిత్రం)

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: సమగ్రశిక్షలో ఎప్పుడు జీతాలు ఇస్తారో... ఎన్ని నెలలకు ఇస్తారో తెలియక వివిధ విభాగాల్లో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు వివిద పథకాలు అమల్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల పాత్ర కీలకం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు అందరూ కలిపి 1200 మందికి పైగా ఉంటారు. వీరిలో ఎక్కువశాతం చిన్నపాటి ఉద్యోగులే. మెసెంజర్స్‌, ఆయాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సీఆర్పీలు ఇలా రూ.6వేల నుంచి రూ.22వేల వరకు వేతనం పొందే వారు ఉన్నారు. తరచూ వేతనాల విడుదలలో జాప్యం కావడంతో ఇంటి అవసరాలకు కూడా అప్పులు చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరితోపాటు శాశ్వత ఉద్యోగులకు కూడా జీతాలు విడుదల కావడం లేదు. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు మూడు నెలల జీతాలు రావాల్సి ఉంది. ఉన్నతాధికారులను అడిగినా నోరు మెదపకపోవడంతో ఏంచేయాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి ప్రభుత్వం కేటాయించే బడ్జెట్‌ను బట్టి వేతనాలు విడుదల చేస్తారు.  కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం చొప్పున వేతనాలు చెల్లిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వక పోగా కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులను కూడా వాడేసుకోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఎన్నినెలలు ఎదురు చూడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గోపాల మిత్రల గోడు పట్టదా

పశుసంవర్థకశాఖలో గోపాలమిత్రలకు కూడా వేతనాలు ఎన్ని నెలలకు విడుదల చేస్తారో తెలియని దుస్థితి దాపురించింది. పదోతరగతి ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేసి నాలుగునెలల పాటు శిక్షణ ఇచ్చి వారి సొంత గ్రామాల్లో విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించారు. మొదట నెలకు రూ.1200ల చొప్పున వేతనం ఇచ్చేవారు. ఆ తరువాత రూ.2వేలు చేశారు. కొద్దిరోజులకు రూ.3,500 చేశారు. అంతంత మాత్రపు వేతనాలతో ఇబ్బందులు పడుతున్న వీరి సమస్యలను గుర్తించి గత తెదేపా ప్రభుత్వం హయాంలో రూ.6,500లకు పెంచారు. అప్పటినుంచి తమ గురించి పట్టించుకునే వారే కనిపించడంలేదని వాపోతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 600 మంది వరకు విధులు నిర్వహిస్తున్నట్లు సంఘ నాయకులు చెబుతున్నారు. వీరందరికీ వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తరువాత సచివాలయం పరిధిలోని రైతుభరోసా కేంద్రాల్లో ఇన్‌ఛార్జి పశు సంవర్థక సహాయకులుగా బాధ్యతలు కేటాయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహిస్తున్నా తగిన గుర్తింపు మాత్రం రావడం లేదని వాపోతున్నారు. 20 ఏళ్లకుపైగా విధులు నిర్వహిస్తున్న వీరిని పశుసంవర్థ్ధకశాఖ సహాయకులుగా నియమించాలని కోరినా పాలకులు స్పందించలేదు. కనీసం వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని వాపోతున్నారు. గత రెండు నెలలుగా వేతనాలు విడుదల కావడం లేదని,  ఎప్పుడూ ఇలాగే మూడు, నాలుగు నెలలకోసారి వేతనాలు ఇస్తున్నారని తమ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

అధికారులకు తెలిపినా..

సమగ్రశిక్షాలో మూడు నెలలుగా వేతనాలు లేవు. వివిధ శాఖల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మూడు, నాలుగు నెలలకు ఓసారి జీతాలు ఇస్తే ఉద్యోగులు కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని విడనాడి విభాగాల వారీగా జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఈ సమస్యను ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. స్పందించకపోతే సంఘ నాయకులతో సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం.

పి.రాము, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు

హామీలకే పరిమితం..

సమగ్రశిక్షాలో కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామన్నారు.ఇప్పటివరకు అమలు కాలేదు. నిబంధనల ప్రకారం జీతాలు పెంచాల్సి ఉండగా అదీ లేదు. ఇచ్చేదే అరకొర వేతనాలు అవి కూడా నెలలు తరబడి బకాయిలు ఉంచడంతో ఆర్థికంగా అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ సమస్యలపై అనేకసార్లు వినతిపత్రాలు అందించాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్వరితగతిన వేతనాలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.

సీహెచ్‌ఎన్‌ దేవేంద్రరావు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సు ఉద్యోగ సంఘ నాయకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు