logo

నాడు నయం.. నేడు దయనీయం!

‘విజయవాడ నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 200కు పైగా అదనపు తరగతి గదులు అవసరం. గత రెండేళ్లుగా విద్యార్థులకు సరిపడా గదులు లేవు.

Published : 08 Dec 2023 03:48 IST

తరగతి గదుల నిర్మాణమంటూ హడావుడి
ఏడాదిన్నరగా సాగుతున్న రెండో దశ పనులు

విజయవాడలోని ఓ పాఠశాలలో చెట్ల కిందే విద్యార్థులకు బోధన

ఈనాడు, అమరావతి: ‘విజయవాడ నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 200కు పైగా అదనపు తరగతి గదులు అవసరం. గత రెండేళ్లుగా విద్యార్థులకు సరిపడా గదులు లేవు. నాడు నేడులో భాగంగా అదనపు గదుల నిర్మాణం చేపడుతున్నామంటూ గత రెండేళ్లుగా చెబుతున్నారు. చాలా పాఠశాలల్లో ఇసుక, సిమెంట్‌ బస్తాలు, ఇటుకలు సహా సామగ్రి వచ్చినా ఏడాదిన్నరకు పైగా నిర్మాణాలు సాగదీస్తున్నారు. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేని దయనీయమైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నగరంలో వేలాది మంది విద్యార్థులు చదువుతున్న ప్రతి పాఠశాలలోనూ తరగతి గదుల కొరత వేధిస్తోంది. ఉన్న గదుల్లోనే విద్యార్థులను ఇరికించి కూర్చోబెడుతున్నారు. పరీక్షల సమయంలో ఆరుబయట చెట్ల కింద, వరండాల్లో కూర్చోబెట్టాల్సి వస్తోంది.’

కృష్ణా, ఎన్టీఆర్‌ రెండు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. రెండు జిల్లాల్లోని 600కు పైగా పాఠశాలల్లో రెండో దశ నాడు నేడులో భాగంగా మరుగుదొడ్లు-నీటి సౌకర్యం, పాఠశాలలో విద్యుత్తు ఉపకరణాలు, ఇంగ్లీష్‌ ల్యాబ్‌, వంట గది షెడ్డు, ప్రహరీ, తాగునీరు, ఫర్నీచర్‌, భవనాలకు రంగులు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, చిన్న మరమ్మతుల పనులు ఆరంభమయ్యాయి. వీటిలో 168 పాఠశాలల్లో 1088 అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని రెండో దశలో భాగంగా ఏడాదిన్నర కిందట ఆరంభించారు. ఇప్పటికీ నత్తనడకన తరగతి గదుల నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం జరగడమే దీనికి కారణం. ఇసుక, సిమెంట్‌ లాంటి నిర్మాణ సామగ్రిని ఆలస్యంగా పంపించడం, సమయానికి నిధులు ఇవ్వకపోవడంతో.. ఒక నెల పని జరిగితే.. నాలుగు నెలలు ఆగిపోవడం, మళ్లీ కొద్దిగా చేపట్టడం.. ఇలా సాగదీస్తూ వస్తున్నారు.

ప్రస్తుతం పూర్తిగా ఆపేశారు..

గత రెండేళ్లుగా తరగతి గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. ఈ ఏడాది ఆరంభం నుంచి నిధులు విడుదల చేయలేదు. ఎప్పుడో ఒకసారి రివాల్వింగ్‌ ఫండ్‌ను ఖాతాల్లో వేయడం.. పనులు త్వరగా చేయించాలంటూ ప్రధానోపాధ్యాయులను ఉరుకులు పరుగులు పెట్టించడం.. ఆ తర్వాత మళ్లీ చాలా నెలలు ఆపేయడం జరుగుతోంది. రెండో దశలో రూ.72 కోట్లతో 1088 తరగతి గదులను ఉమ్మడి కృష్ణాలో చేపడతామంటూ రెండేళ్ల కిందట ప్రకటించారు. వీటిలో కృష్ణాలో రూ.28 కోట్లతో.. 67 పాఠశాలల్లో 298 గదులు, ఎన్టీఆర్‌ జిల్లాలో రూ.44 కోట్లతో 790 అదనపు గదులు నిర్మిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఈ గదులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం చాలా పాఠశాలల్లో భవనాల నిర్మాణం పూర్తయినా వాటికి తుది దశ మెరుగులు దిద్ది ఆరంభించడానికి కూడా నిధులు లేక వదిలేశారు.

రెండు జిల్లాల్లోనూ ఇబ్బందే..

కృష్ణా జిల్లాలో రెండో దశలో భాగంగా రూ.100 కోట్లతో 287 పాఠశాలల్లో పనులు చేపడతామన్నారు. ఆరంభంలో రూ.10కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ను పాఠశాలల ఖాతాల్లో వేశారు. వాటితోనే ఆరంభంలో పనులు జోరుగా సాగాయి. తర్వాత నుంచి నిధుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చేశారు. ఎన్టీఆర్‌ జిల్లాలోనూ రూ.156 కోట్లతో 372 పాఠశాలల్లో రెండో దశ పనులు ఆరంభించారు. రూ.20 కోట్లు రివాల్వింగ్‌ ఫండ్‌ను ఆరంభంలో పాఠశాలల ఖాతాల్లో వేశారు. ఆ తర్వాత నుంచి నిధుల కొరత, ఇసుక, సిమెంట్‌, ఇతర నిర్మాణ సామగ్రి రావడానికి ఆలస్యం అవ్వడంతో.. పనులు నత్తనడకన సాగుతూ వచ్చాయి. ప్రస్తుతం చాలా పాఠశాలల్లో నిధులు లేక పనులు పూర్తిగా ఆపేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని