logo

కష్టం చూడరు.. నష్టం అడగరు

ఉమ్మడి జిల్లాలోనే కేవలం ధాన్యం రైతులకు దాదాపు రూ.350 కోట్ల నష్టం వాటిల్లింది. తుపాను ప్రభావం తగ్గి రెండు రోజులు గడిచింది.

Updated : 08 Dec 2023 05:49 IST

మొలకలొస్తున్న ధాన్యం
పట్టించుకోని యంత్రాంగం

ఘంటసాల: చిట్టూర్పులో నీటిలో నానుతున్న వరి పనలు

ఈనాడు, అమరావతి: ఉమ్మడి జిల్లాలోనే కేవలం ధాన్యం రైతులకు దాదాపు రూ.350 కోట్ల నష్టం వాటిల్లింది. తుపాను ప్రభావం తగ్గి రెండు రోజులు గడిచింది. అయినా మడుల్లో నీరు మాత్రం పోవడం లేదు. అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నారు. డీజిల్‌ ఇంజిన్లు పెట్టి మరీ తోడుతున్నారు. ఇంత జరుగుతున్నా రైతుల కన్నీళ్లు తుడిచేవారు కరవయ్యారు. కనీసం నీరు పారేందుకు ఏర్పాట్లు చేసే దిక్కు లేదు. నీటిపారుదల శాఖ అధికారులు ఎక్కడా కనిపించడం లేదు. నేలవాలిన వరి కోతలు కోసేందుకు సైతం రైతులు వెనుకంజ వేస్తున్నారు. కొంత మంది రైతులు నేలవాలిన వరిపైరు ధ్వంసం చేస్తున్నారు. బీమా వస్తుందో రాదో కూడా తెలియని అయోమయ పరిస్థితి.

వరి పంట నష్టం ఎకరాల్లో...

కృష్ణా జిల్లా: 2,44,000

ఎన్టీఆర్‌:34,716

వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసిన పంట నష్టం ఇది. ధాన్యం రైతులకు రూ.కోట్లలో నష్టం వచ్చింది. మిగ్‌జాం తుపాను ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో రైతులు కుదేలయ్యారు. కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. కోసిన వరి పనలు తడిసి ధాన్యం కంకులు నాని మొలకలు వస్తున్నాయి. ఇక నిలువునా ఉన్న వరి పైరు నేల రాలింది. ఎంతగా అంటే కోసేందుకు వీలు కానంతగా ధ్వంసమైంది. నేడో రేపో కోద్దామని భావించిన రైతులకు తుపాను హెచ్చరికలు అశనిపాతంలా తగిలాయి. ఆగిన రైతులకు గుండెకోత మిగిలింది

బాపులపాడు: దంటగుంట్లలో చెరువులా మారిన పొలంలో నానుతున్న వరి కుప్ప

ధర కోత.. పెరిగిన వ్యయం

తుపాను ప్రభావం వల్ల అన్నదాతలకు అపార నష్టం వాటిల్లుతోంది. కళ్ల ముందు కనిపిస్తున్న పంటను వదిలేయలేక కోతలు కోసేందుకు చేతిలో చిల్లిగవ్వలేక సంఘర్షణకు గురవుతున్నారు. ఇప్పటికే కోసిన పనలు, ధాన్యం రాశులను ఆరబెట్టేందుకు అదనంగా వ్యయం అవుతోంది. కూలీల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు తేమ, ముక్కపాయ పేరుతో ధర తగ్గుతోంది. బస్తాకు సగానికి సగం ధర తగ్గుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతలు కోయాలా వదిలేయాలా..? అనే మీమాంసలో రైతులు ఉన్నారు. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. నేల వాలిన పైరును యంత్రాల ద్వారా కోయడం సాధ్యం కాదు. ఇలా చేయాలంటే పూర్తిగా మడి ఎండిపోవాలి. యంత్రం బురదలో దిగబడుతుంది. ఒకేవేళ యంత్రంతో వరి కోసినా సగం కంకులు అందే అవకాశం లేదు. దీంతో కూలీలను పెట్టి జాగ్రత్తగా కోయాలి. దీనికి ఎకరానికి సాధారణ పరిస్థితుల్లో రూ.4వేలు తీసుకునే కూలీలు ఇప్పుడు రెట్టింపు అడుగుతున్నారు. ఎకరానికి దిగుబడి 30 బస్తాలు వచ్చినా ధర రూ.వెయ్యి చొప్పున రూ.30వేలు వస్తుంది. దీనిలో కోత కూలీ రూ.10వేలు మినహాయిస్తే.. మిగిలినవి రూ.20 వేలే. రూ.15 వేలు యజమానికి కౌలు చెల్లించాలి. పెట్టుబడి ఎకరానికి రూ.25 వేలు అవుతోంది. దీంతో అసలుకే మోసం వస్తుందని చాలామంది వరిపైరును వదిలేస్తున్నారు. ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. ఇప్పటికే కోసిన పనల పరిస్థితి అదే విధంగా ఉంది. దీన్ని ఎండ బెట్టేందుకు కూలీలను వినియోగించాల్సి వస్తోంది. కొన్ని మడుల్లో మొలకలు వచ్చాయి. నీరు పోవడం లేదు. కల్లాల్లో ఉన్న ధాన్యం ఆరబోసేందుకు అదనపు కూలీలను వినియోగిస్తున్నారు. ఆర్బీకేలలో మాత్రం తేమ శాతం తగ్గిన తర్వాతే తీసుకురావాలని సూచిస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు మొలకలు రాకుండా ఉండాలంటే ఉప్పు నీటి ద్రావణం చల్లాలని సూచనలు చేస్తున్నారు.

అధికారులు రాలేదు...

పంట నష్టం వివరాలు అంచనా వేసేందుకు అధికారులు సైతం రాలేదని రైతులు చెబుతున్నారు. కార్యాలయాల్లో కూర్చొని పంట నష్టం అంచనా కాకిలెక్కలు వేశారు. వాస్తవంగా ఎంత నష్టం జరిగిందనేది లెక్కలు తీయలేదు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందలేదని, మడుల్లో నీరు తగ్గలేదని అందుకే బృందాలను పంపలేదని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు చెప్పారు. కేవలం నిలువుమీద ఉన్న పైరుకే బీమా వర్తిస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే కోసిన, నూర్పిడి వరిపైరుకు పరిహారం అందించే అవకాశం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.  

నీరు తీసేందుకు చర్యలు ఏవీ..?

కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక మడుల్లో నుంచి నీరు బయటకు పారడం లేదు. దీంతో నేలవాలిన వరి పైరు, కోసిన వరి పనలు నీట మునిగి ఉన్నాయి. ఇంత జరుగుతున్నా జలవనరుల శాఖ అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. అధికారులు ఎవ్వరూ రాలేదు. డ్రైనేజీలో పూడిక తీస్తే మడుల్లో నీరు తగ్గే అవకాశం ఉంది. కానీ ఇంతవరకు కృష్ణా జిల్లాలో అధికారులు ఆ పని చేయడం లేదు.

పెనమలూరు: వణుకూరులో నేలకొరిగిన తమలపాకు తోటలు

పెట్టుబడి వర్షార్పణం

మెట్ట ప్రాంతంలో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న, అరటి, తమలపాకు పంటలు సాగు చేస్తున్నా. ఎకరాకు రూ.లక్షన్నర వరకు పెట్టుబడిపెట్టా. పైసా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ తుపానుకు దాదాపు రూ.15 లక్షలు నష్టపోయా. విరిగిపడిన అరటి, తమలపాకు తోటలను పొలం లోంచి తొలగించడానికి మరో రూ.2 లక్షల వ్యయం అవుతుంది. నాలాంటి రైతులు పదుల సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలి.

పునుకొల్లు సాంబశివరావు, రైతు

రూ.10 లక్షలు నష్టపోయా

ఉప్పులూరి కేశవరావు, వణుకూరు

నేను 20 ఎకరాలు వరి సాగు చేశా. ఈ ఏడాది పంట బాగా పండి 45 నుంచి 50 బస్తాల దిగుబడి వస్తుందనుకున్నా. ఈలోగా ఊహించని రీతిలో తుపాన్‌ తీవ్రంగా దెబ్బతీసింది. మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల పంటలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. భారీ వర్షాలకు రూ.10 లక్షల పంట నష్టం వాటిల్లింది.

పెనమలూరు, హనుమాన్‌ జంక్షన్‌, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు