logo

Vijayawada: కూల్చాల్సినోళ్లే కట్టుకోమన్నారు.. రూ.కోట్ల స్థలం ఆక్రమించిన వైకాపా నేత

ఈ చిత్రం చూశారా.. ఇదీ ఏలూరు కాలువ గట్టు. విజయవాడ మధ్య నియోజకవర్గం పూర్ణానందపేట వద్ద ఉంది. వీఎంసీ వాహన డిపో పక్కనే రైల్వేస్టేషన్‌కు వెళ్లే మార్గం. ఈ రహదారి వెంట నిత్యం ఉన్నతాధికారులు సైతం పర్యటిస్తుంటారు.

Updated : 13 Feb 2024 08:18 IST

అనుమతిచ్చి మరీ అధికారుల సహకారం
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అనుచరుడినని హల్‌చల్‌

ఏలూరు కాలువ కట్టను ఆక్రమించి మరీ నిర్మాణం

ఈనాడు - అమరావతి: ఈ చిత్రం చూశారా.. ఇదీ ఏలూరు కాలువ గట్టు. విజయవాడ మధ్య నియోజకవర్గం పూర్ణానందపేట వద్ద ఉంది. వీఎంసీ వాహన డిపో పక్కనే రైల్వేస్టేషన్‌కు వెళ్లే మార్గం. ఈ రహదారి వెంట నిత్యం ఉన్నతాధికారులు సైతం పర్యటిస్తుంటారు. ఇక్కడ ఓ వ్యక్తి కాలువగట్టును ఆక్రమించి పట్టపగలే శాశ్వత నిర్మాణం చేసేశారు. ఆయన వైకాపా ఎమ్మెల్సీ ముఖ్య అనుచరుడు. దాదాపు 200 గజాల స్థలం ఆక్రమించి భవనం నిర్మించారు. పైన ట్యాంకు కూడా కట్టేశారు. ఇటు నగరపాలక అధికారులు కానీ.. అటు జల వనరుల శాఖ అధికారులు కానీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కారణం.. ఆయన ఎమ్మెల్సీ అనుచరుడు. అంతేకాదు.. సెంట్రల్‌ వైకాపా ఇన్‌ఛార్జిగా పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ను ప్రకటించిన వెంటనే ఈ ఆక్రమణకు, అక్రమ కట్టడానికి శ్రీకారం చుట్టారు.
ఏలూరు కాలువ కట్ట మీద ఆక్రమించి భవనం నిర్మిస్తుంటే.. కొందరు జలవనరుల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు పలుగు పారతో తొలగించేందుకు వచ్చారు. అంతే కమిషనర్‌కు ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి వచ్చింది. ‘ఆయన మా కార్యకర్త. అక్కడ నుంచి వెళ్లండి.. అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. ఆయన అడిగిన కుళాయి కనెక్షను ఇవ్వండని’ ఆదేశాలు. మాజీ మంత్రి, వీఎంసీ ముఖ్య ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్సీ ఒత్తిడి చేస్తే వీఎంసీ అధికారులు తోకముడిచారు. జలవనరుల శాఖ అధికారులు అసలు నోరు విప్పలేదు.

రూ.లక్షలు చేతులు మారాయి...

విజయవాడ నగరంలో ఆక్రమణలు తొలగించి వారికి వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ఇళ్ల స్థలాలు కేటాయించారు. కాలువల సుందరీకరణకు వీఎంసీ చర్యలు తీసుకుంటోంది. అలాంటిది.. నగరం నడిబొడ్డున వాణిజ్య ప్రాంతమైన పూర్ణానందపేటలో ఏలూరు కాలువను యథేచ్ఛగా ఆక్రమించేశారు. అక్కడ ఫెన్సింగ్‌ ఉన్నా.. ఆక్రమణదారులను అడ్డుకోలేక పోయింది. ఫెన్సింగ్‌ దాటి గ్రీన్‌ మ్యాట్‌లు కట్టి మరీ నిర్మాణం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే.. అడ్డుకోకపోగా.. నీటి కుళాయి ఇచ్చి మరీ సహకరించారు. దీని వెనుక చాలా తతంగం నడిచింది. రూ.లక్షల్లో చేతులు మారాయని తెలిసింది. జలవనరుల శాఖకు చెందిన గత ఎస్‌ఈ నరసింహమూర్తి ఆక్రమణలపై పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందించారు. ఆక్రమించి అద్దెలకు ఇస్తున్న నేతల జాబితాను పంపారు. ఈ నివేదిక పక్కన పెట్టారు. జలవనరుల శాఖ స్థలాలు ఆక్రమించి కల్యాణ మండపాలు కట్టేశారు. సామాజిక భవనాల పేరుతో నిర్మాణాలు చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. తాజాగా ఓ ముఖ్య నాయకుడి అండతో ఆక్రమించడం చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్సీ స్టిక్కర్‌ వాహనంతో ఆక్రమణ ప్రదేశంలో ఇలా..


రమారమి.. రూ.2 కోట్లు!

ఈ వైకాపా నేత ఆక్రమించి నిర్మించిన చోట.. గజం మార్కెట్‌ విలువ రూ.లక్ష వరకు ఉంది. మొత్తం 200 గజాల స్థలం.. కనీసం రూ.2 కోట్లు ఉంటుంది. దీనికి భవన నిర్మాణ అనుమతి లేదు. విద్యుత్తు కనెక్షను ఇచ్చారు. ఏకంగా నగరపాలక అధికారులు కుళాయి కనెక్షన్‌ దగ్గరుండి ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ఆక్రమణ, అక్రమ భవన నిర్మాణం చేసిన వ్యక్తి గతంలో ఎమ్మెల్సీ వాహనంతో రోడ్డు ప్రమాదానికి కారణమై ఓ యువకుడి ప్రాణం బలిగొన్నాడు. నాడు ఎమ్మెల్సీ వాహనం కాదని తప్పించారు. కేసులను మసిపూసి మారేడు కాయ చేశారు. అదే వ్యక్తి ఇప్పుడు తాను కొనుగోలు చేసిన కొత్త వాహనానికి ఎమ్మెల్సీ స్టిక్కర్‌ అంటించి మరీ తిరుగుతున్నారు. ఈవాహనంలోనే నిర్మాణ భవనం వద్ద పర్యవేక్షిస్తూ.. తను ఎమ్మెల్సీ మనిషిని అని బెదిరిస్తున్నారు. సెంట్రల్‌ ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాట చెల్లుబాటు కావడం లేదు. గతంలో ఆయన ఆక్రమణ నివారించినట్లు తెలిసింది. వెలంపల్లి సెంట్రల్‌ ఇన్‌ఛార్జి కాగానే అక్రమ భవన నిర్మాణం పూర్తయింది. వెలంపల్లితో సెంట్రల్‌లో ప్రచారంలో పాల్గొంటుండగా ఆయనకు గజమాలలు వేసి ఈయన తన కృతజ్ఞత చాటుకొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని