logo

చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు

రోటరీ అంతర్జాతీయ సంస్థ సమకూర్చిన నిధులతో 76 మంది పేద పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేస్తున్నామని ఆంధ్రా ఆసుపత్రి చీఫ్‌ ఆఫ్‌ చిల్డ్రన్స్‌ సర్వీసెస్‌ డాక్టర్‌ పి.వి.రామారావు, రోటరీ జిల్లా 3020 గవర్నర్‌ రావూరి సుబ్బారావులు తెలిపారు.

Published : 23 Feb 2024 05:15 IST

పి.వి.రామారావుకు చెక్కు ఇస్తున్న రావూరి సుబ్బారావు, జి.వి.మోహన్‌ప్రసాద్‌, కంచెల రవికుమార్‌

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : రోటరీ అంతర్జాతీయ సంస్థ సమకూర్చిన నిధులతో 76 మంది పేద పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేస్తున్నామని ఆంధ్రా ఆసుపత్రి చీఫ్‌ ఆఫ్‌ చిల్డ్రన్స్‌ సర్వీసెస్‌ డాక్టర్‌ పి.వి.రామారావు, రోటరీ జిల్లా 3020 గవర్నర్‌ రావూరి సుబ్బారావులు తెలిపారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ, ఆంధ్రా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గురువారం ఆంధ్రా ఆసుపత్రి హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌లో.. శస్త్రచికిత్సల ప్రాజెక్టును ప్రారంభించారు. డాక్టర్‌ పి.వి.రామారావు మాట్లాడుతూ.. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ గత 80 సంవత్సరాలుగా సేవలు అందిస్తోందని తెలిపారు. వైద్యం, విద్య, వృత్తి, ఆర్థిక రంగాల్లో పేద, బడుగు, బలహీన వర్గాలకు సాయం అందిస్తోందని తెలిపారు. రావూరి సుబ్బారావు మాట్లాడుతూ.. రోటరీ అంతర్జాతీయ సంస్థ వైద్య సేవలకు సంబంధించి నిధులు సమకూర్చడంలో ముందుంటుందని తెలిపారు. సంస్థ ద్వారా పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా విస్తృతమైన ప్రచారం చేశామని గుర్తుచేశారు. ఇప్పుడు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. ప్రధానంగా యువతలో ఆత్మహత్య ఆలోచనలు తొలగించడమే తమ ప్రధాన కార్యక్రమం అని వివరించారు. రోటరీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన విజయవాడ సభ్యుడు దివంగత కరిణి చంటిరాజు సేవలను స్మరించుకున్నారు. రోటరీ సభ్యులు 76 మంది పిల్లల శస్త్రచికిత్సలకు అవసరమైన రూ.65.22 లక్షల చెక్కును డాక్టర్‌ పి.వి.రామారావు తదితరులకు అందించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు దిలీప్‌, విక్రం, జె.శ్రీమన్నారాయణ, రోటరీ ప్రాజెక్టు ఛైర్మన్‌ డాక్టర్‌ జి.వి.మోహన్‌ప్రసాద్‌, కంచెల రవికుమార్‌, కరిణి హేలి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని