logo

పార్కులో వృద్ధురాలి హత్య

గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో లెనిన్‌ కూడలి పార్కులో బుధవారం తెల్లవారుజామున ఓ వృద్ధురాలిని హతమార్చాడో యువకుడు. పార్కులో పడుకునే ప్రదేశం గురించి ఏర్పడ్డ వివాదం హత్యకు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు.

Published : 23 Feb 2024 05:23 IST

పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఘటన

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో లెనిన్‌ కూడలి పార్కులో బుధవారం తెల్లవారుజామున ఓ వృద్ధురాలిని హతమార్చాడో యువకుడు. పార్కులో పడుకునే ప్రదేశం గురించి ఏర్పడ్డ వివాదం హత్యకు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా నగరవాసులను గంజాయి బ్యాచ్‌ వణికిస్తోంటే.. తాజాగా నగరం నడిబొడ్డున వృద్ధురాలి హత్య జరగడం పోలీస్‌ వర్గాల్లో కలకలం సృష్టించింది.  వివరాల్లోకి వెళితే.. చిట్టినగర్‌కు చెందిన ఓ వృద్ధురాలు (74) గత 20 సంవత్సరాలుగా గవర్నర్‌పేటలోనే ఉంటోంది. ఆమెకు ఒక కూతురు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. అయినా.. గవర్నర్‌పేట పరిసర ప్రాంతాల్లో ఉంటూ రాత్రి వేళ లెనిన్‌కూడలిలోని పార్కులో నిద్రపోతూ ఉంటుంది. కడపకు చెందిన ఆర్ల విజయశంకర్‌ (35) కూడా అదే పార్కులో పడుకుంటున్నాడు. తన భార్య, పిల్లలను వదిలేసి కొద్ది సంవత్సరాలుగా విజయవాడలోనే ఉంటున్నాడు. రోజూ మాదిరిగానే వృద్ధురాలు మంగళవారం రాత్రి వాకింగ్‌ ట్రాక్‌పై నిద్రపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత విజయశంకర్‌ వచ్చి తాను పడుకునే స్థలంలో నువ్వు పడుకున్నావేంటీ? అని ఆమెతో గొడవపడ్డాడు. చిన్న గొడవ కాస్త... పెద్దదిగా మారింది. ఈ క్రమంలో ఆమె గుండెలపై గట్టిగా గుద్దాడని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న మరికొందరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

అత్యాచారం జరిగిందా?

పోలీసులు ఘటనాస్థలం పరిసరాలు చూశారు. ఆమెపై అత్యాచారం జరిగిందా? అనే కోణంలో పరిశీలించారు. అలాంటి ఆనవాళ్లు ఏవీ లేకపోవటం, పోస్ట్‌మార్టం నివేదికలోనూ అత్యాచారం జరిగినట్లు ఏమీ లేదని పోలీసులు చెబుతున్నారు. గంజాయి బ్యాచ్‌ అత్యాచారం చేసి హత్య చేశారంటూ పలువురు ఆరోపిస్తున్నారని పోలీసులను ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, పడుకునే ప్రదేశం గురించి ఏర్పడ్డ వివాదమే హత్యకు దారి తీసిందని చెప్పారు. నిందితుడు విజయశంకర్‌ను గురువారం సాయంత్రంఅరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని