logo

యువతా మేలుకో.. ఓటు విలువ తెలుసుకో..

యువత ఓటు విలువ తెలుసుకుని సార్వత్రిక ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో కొత్తా మాధవి సూచించారు.

Updated : 23 Feb 2024 05:56 IST

ఓటు నమోదు, చైతన్య సదస్సులో ఆర్డీవో మాధవి సూచన

విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తున్న ఆర్డీవో మాధవి. వేదికపై ప్రిన్సిపల్‌ శ్రీనివాసరావు, అధ్యాపకుడు రాంబాబు

తిరువూరు, న్యూస్‌టుడే: యువత ఓటు విలువ తెలుసుకుని సార్వత్రిక ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో కొత్తా మాధవి సూచించారు. స్థానిక ఎస్‌ఎల్‌ఆర్‌ ప్రతిభ మోడల్‌ డిగ్రీ కళాశాలలో ‘ఈనాడు, ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు నమోదు, చైతన్య సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇంకా ఎవరైనా ఓటరుగా నమోదు చేసుకోకపోతే బీఎల్‌వోను సంప్రదించాలని, లేనిపక్షంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. సమర్థులను ఎన్నుకోవడంలో యువత కీలకపాత్ర పోషించాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటాలని తెలిపారు. ప్రిన్సిపల్‌ ఎల్‌.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించే వజ్రాయుధంలాంటి ఓటు ప్రజల చేతుల్లో ఉందని తెలిపారు. ఓటు వేయడమే బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. అధ్యాపకుడు రాంబాబు మాట్లాడుతూ ఓటు హక్కును వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్ర భవిష్యత్తుకు విఘాతం కలుగుతుందన్నారు.


విలువ తెలిసింది..
- బి.సైలు

18 ఏళ్లు నిండిన వారు ఎలా ఓటు నమోదు చేసుకోవాలనే విషయంపై సదస్సు ద్వారా అవగాహన కలిగింది. ఓటు విలువ ఏమిటో ఆర్డీవోగారు, అధ్యాపకులు చక్కగా వివరించారు.


అందరినీ చైతన్యపరుస్తా..
- డి.కోటేశ్వరరావు

మా ఊరిలో ప్రతి  ఒక్కరికి ఓటు విలువ తెలియజేస్తా. ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఐదేళ్ల ప్రజల భవితవ్యం తేల్చే ఎన్నికల్లో ఓటు కీలకం. ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటు వేస్తా.


వాగ్దానాలు నెరవేర్చిన వారికే..
- సీహెచ్‌ చెన్నకేశవ

వాగ్దానాలు నెరవేర్చిన వారికే ఓటు వేస్తా. ఉద్యోగావకాశాలు కల్పించే ప్రభుత్వం అధికారంలోకి రావాలి. సంక్షేమం, అభివృద్ధి సమర్థవంతంగా అమలు చేసే వారినే ఎన్నుకునేలా చైతన్యం తీసుకువస్తా.


మంచి వ్యక్తులకే ప్రాధాన్యం
- టి.కల్కిసాహితి

ఓటు హక్కును సమర్థంగా వినియోగించడంలో యువత ముందుండాలి. కుల, మతాలు, రాజకీయాలకు అతీతంగా మంచి వ్యక్తులను చట్టసభలకు పంపించాల్సిన అవసరం ఉంది. నేను నా ఓటు హక్కును వినియోగించుకుంటాను.


ప్రలోభాలకు లొంగకూడదు
- సీహెచ్‌ దివ్య

ఎన్నికలప్పుడు ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు ప్రలోభాలకు గురిచేయడం, తాయిలాలు పంచడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి వాటికి ఓటర్లు దూరంగా ఉండాలి. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే యువత అడ్డుకోవాలి.


ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదం
- వైవీవీఎస్‌ కృష్ణప్రసాద్‌

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే ఆయుధమనే విషయం ఈ సదస్సు ద్వారా తెలుసుకున్నాను. ఓటుతోనే సుస్థిర పాలన, శాశ్వత అభివృద్ధి సాధ్యపడుతుంది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని