logo

ప్రాణం తీసిన ఓపెన్‌ డ్రెయిన్‌

రోజూ రాత్రి 9 గంటల కల్లా ఇంటికి వచ్చే కుటుంబ యజమాని రాకపోవడంతో ఇంటిల్లిపాది ఆందోళనకు గురయ్యారు. తెల్లారిన తర్వాత..

Published : 23 Feb 2024 05:35 IST

మురుగు కాలువలో పడి ఆటోడ్రైవర్‌ మృతి

కదిరి అప్పన్న (పాతచిత్రం): మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు

అజిత్‌సింగ్‌నగర్‌ (మధురానగర్‌), న్యూస్‌టుడే : రోజూ రాత్రి 9 గంటల కల్లా ఇంటికి వచ్చే కుటుంబ యజమాని రాకపోవడంతో ఇంటిల్లిపాది ఆందోళనకు గురయ్యారు. తెల్లారిన తర్వాత.. ఇంటికి కిలోమీటరు దూరంలోనే విగతజీవిగా కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. చూపరులను సైతం కంటతడి పెట్టించిన ఈ ఘటన.. వాంబేకాలనీలో గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. వాంబేకాలనీ సి బ్లాక్‌, 10 నంబరు ఫ్లాట్‌లో కదిరి అప్పన్న (47) నివసిస్తున్నారు. ఆయన ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.  అప్పన్నకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఒక అమ్మాయికి వివాహం చేశారు. ప్రతి రోజూ కిరాయికు వెళ్లి, రాత్రి 9 గంటల కల్లా ఇంట్లో ఉంటారు. బుధవారం రాత్రి 11 గంటలైనా రాలేదు. కుటుంబ సభ్యులు ఆందోళనచెందారు. ఆయనకి ఫోన్‌ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. గురువారం ఉదయం వాంబేకాలనీ రోడ్డులోని ఓపెన్‌ డ్రెయిన్‌లో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి ఉన్నాడని సమాచారం రావడంతో అక్కడకు వెళ్లారు. చనిపోయింది తన భర్తే అని గుర్తించిన భార్య కాంతమ్మ రోధించింది. ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి ఆటోడ్రైవర్లు తరలివచ్చారు. నున్న పోలీసులు వచ్చి విచారించారు. కాలువలో జారిపడిపోయి ఉండొచ్చని, రాత్రి వేళ ఎవరూ గమనించలేదని స్థానికులు పేర్కొంటున్నారు.

నగరపాలక సంస్థ వైఫల్యం

నగరపాలక సంస్థ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సి.హెచ్‌.బాబూరావు, సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, ఇతర నాయకులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి కుటుంబానికి రూ.10లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లోతైన డ్రెయిన్ల వద్ద రక్షణ చర్యలు లేవని, సిమెంటు దిమ్మెలు వేయాలని పేర్కొన్నారు. గతంలో ఇదే డ్రెయిన్‌లో పడి పలువురు మృతి చెందారని.. 15 రోజుల క్రితం ఓ వృద్ధుడు మరణించారని స్థానికులు చెబుతున్నారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా నగరపాలకసంస్థ రక్షణ చర్యలు చేపట్టకపోవటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్మశానవాటిక వద్ద వామపక్ష నాయకులు ధర్నా చేశారు. ఘటనపై నున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు