logo

నామినేషన్ల వరకు.. నమోదుకు గడువు

సాధారణ ఎన్నికల ప్రకటన (షెడ్యూల్‌) విడుదల చేసే వరకు ఓటర్ల జాబితాలో వచ్చిన అభ్యంతరాలను పరిశీలన చేసి తప్పులను సరిదిద్దుతామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు వెల్లడించారు.

Published : 23 Feb 2024 05:40 IST

ప్రకటన వచ్చేదాకా ఓటరు జాబితాల్లో సవరణ
‘ఈనాడు’తో జిల్లా కలెక్టరు డిల్లీరావు

ఈనాడు, అమరావతి: సాధారణ ఎన్నికల ప్రకటన (షెడ్యూల్‌) విడుదల చేసే వరకు ఓటర్ల జాబితాలో వచ్చిన అభ్యంతరాలను పరిశీలన చేసి తప్పులను సరిదిద్దుతామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో మానవ తప్పిదాలు దొర్లితే సంబంధిత అధికారులను బాధ్యులుగా చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర పొరపాట్లను సరిదిద్దేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా జవాబుదారి తనంతో రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. జాబితా సవరణపై ఆయన గురువారం ‘ఈనాడు’కు ఇచ్చిన ముఖాముఖిలో పలు అంశాలను వెల్లడించారు. సాధారణ ఎన్నికల నిర్వహణ అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందని ప్రకటించారు. వివరాలు కలెక్టర్‌ మాటల్లోనే..!  

మార్పులు చేర్పులు..!

జిల్లాలో గత నెల ప్రకటించిన ఓటర్ల జాబితాను అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాం. ప్రతి వారం జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో రాజకీయ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి నివృత్తి చేసుకుంటున్నాం. తప్పులను గుర్తించి సరిదిద్దాలని పౌరులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఫారం 6తో పాటు ఫారం7, ఫారం 8 స్వీకరిస్తున్నాం. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. నియోజకవర్గాల్లో తప్పులు కనిపిస్తున్నాయి. జిల్లాలో గత నెల ప్రకటించిన తుది జాబితాలో 16.75లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అంతకుముందు జాబితాతో పోల్చితే 2.19 శాతం ఓటర్లు పెరిగారు. కొన్ని నియోజకవర్గాల్లో అచ్చుతప్పులు, మృతుల పేర్లు తొలగించకపోవడం లాంటివి కనిపిస్తున్నాయి. దీనికి మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడం, ఇంటికి వచ్చిన బీఎల్వోలకు ఇరుగుపొరుగు వారు సమాచారం ఇవ్వకపోవడం కారణాలు కావచ్చు. షెడ్యూలు వచ్చేవరకు ఫారం 7 స్వీకరించి వాటిని పరిష్కరిస్తాం. కొత్త ఓటర్లకు ఫారం 6 అవకాశం నామినేషన్ల వరకు ఉంటుంది. మార్పుల ఫారం 8 కూడా నామినేషన్‌ల వరకు తీసుకుని పరిష్కరిస్తాం.


ప్రత్యేక విభాగం..

ఓటర్ల జాబితాపై అందిన ఫిర్యాదులు, దరఖాస్తులపై ప్రత్యేక విభాగాన్ని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేశాం. వాటిని నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులకు పంపించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపించి పరిష్కరిస్తున్నాం. ప్రతివారం నిర్వహించే రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశాల్లో వచ్చే ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటున్నాం. పొరపాట్లు జరిగిన ప్రాంతాల్లో బీఎల్వోలను జవాబుదారీగా గుర్తించి చర్యలు తీసుకుంటాం. ఒక నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున ఓటర్లు మరో నియోజకవర్గంలోకి వలస వస్తున్నారన్న విషయంలో వాస్తవం లేదు.


కొత్త ఓటర్లపై దృష్టి..

అర్హుత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇంటింటికీ బీఎల్‌ఓలు తిరిగి ఓటు లేని వారి వివరాలు సేకరించారు. ఫారం 6 ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేందుకు ఆయా కళాశాలలకు బీఎల్వోలను పంపించి దరఖాస్తులు చేయించాం. వీరులపాడు మండలంలో కొందరికి సరిహద్దుగా ఉన్న తెలంగాణలోనూ ఓటు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో గుర్తించి వాటిని తొలగించాం. స్థానికంగా నివాసం ఉన్నవారికే ఓటు ఉంచాం. షెడ్యూల్‌ విడుదలైన తర్వాత వెబ్‌సైట్‌లో సరిదిద్దిన జాబితా ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారి వివరాలు అనుబంధ జాబితాలో ఉంటాయి.


ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం చర్యలు

జాబితాలో కావాలని నిర్లక్ష్యంగా వ్యవహరించి తప్పులకు కారణమైన వారిపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. నియోజకవర్గ ఎన్నికల అధికారులు, సహాయ అధికారులు దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌ పూర్తయింది. వీలైనంతవరకు సమీపంలోనే ఉండేలా ఏర్పాట్లు చేశాం. పాఠశాలల అందుబాటు, వసతులు పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాం. ఎన్నికల సామగ్రి సిద్ధం చేస్తున్నాం. ఈవీఎంలను గోదాముల్లో భద్రపరిచాం. పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం నింపేందుకు ర్యాలీలు, కళాశాలల్లో సదస్సులు నిర్వహిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని