logo

అడ్డదారిలో కొన్నారు.. అడ్డొచ్చిందని కూల్చారు

చిన్నపాటి స్థలమో, పొలమో కొనుక్కుంటేనే సరైన దారి ఉందా, లేదా అని కొనుగోలుకు తరచి చూసుకుంటారు ఎవరైనా. అలాంటిది మార్కెట్‌ ధర ఎకరం రూ.50 లక్షలు కూడా లేని పొలాన్ని ఏకంగా రూ.90 లక్షలు వెచ్చించి, 21 ఎకరాలు కొంటే..

Updated : 23 Feb 2024 05:55 IST

మూడేళ్ల కిందట లేఔట్‌
ఇప్పుడు దారి ఏర్పాటు
హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే

కట్టిన ఇంటిని కూల్చేసిన దృశ్యం

చిన్నపాటి స్థలమో, పొలమో కొనుక్కుంటేనే సరైన దారి ఉందా, లేదా అని కొనుగోలుకు తరచి చూసుకుంటారు ఎవరైనా. అలాంటిది మార్కెట్‌ ధర ఎకరం రూ.50 లక్షలు కూడా లేని పొలాన్ని ఏకంగా రూ.90 లక్షలు వెచ్చించి, 21 ఎకరాలు కొంటే.. పూర్తి స్థాయిలో రాకపోకలకు వీలుగా రోడ్డు మార్గం ఉందా? లేదా? అని చూడకుండా ఉంటారా? కానీ ఘనమైన రెవెన్యూ అధికారులు మాత్రం తమ ‘దారి’ తమదేనని పొలం దారి సంగతి పెద్ద విషయమేమీ కాదన్నట్లుగా దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేసి 21 ఎకరాలు కొనేశారు.

సాధారణంగా ఏ లేఔట్‌లో అయినా ముందుగా రహదారులు ఏర్పాటు చేసి, ప్లాట్లు విడగొడతారు. ఆ తర్వాతే ప్రైవేటు అయితే అమ్మకానికి పెడతారు, ప్రభుత్వానిదైతే పంపిణీ చేస్తారు. కానీ బాపులపాడు జగనన్న లేఔట్‌-1లో మాత్రం ప్లాట్లన్నీ అందరికీ మంజూరు చేసి, పట్టాలు పంపిణీ చేసిన తర్వాత మూడేళ్లకు ప్రధాన రోడ్డు సరిగా లేదన్న సంగతి గుర్తించారు. ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా.. వెంటనే పేదలకు ఇచ్చిన స్థలాల్లోంచి రోడ్డు నిర్మించే ప్రతిపాదన సిద్ధం చేశారు. దీనికి అనుగుణంగా అప్పటికే కట్టిన ఓ ఇంటిని కూల్చివేయించారు. మరో ఇంటి నిర్మాణాన్ని నిలిపివేయించారు. ఇల్లు కడితే ఊరుకోమంటూ ఇంకో ఆరుగురిని హెచ్చరించేశారు.
బాపులపాడు జగనన్న కాలనీ నిర్మాణం కోసం కేటాయించిన లేఔట్‌ వ్యవహారంలో రెవెన్యూ యంత్రాంగం అక్రమాల్లో కొత్త పుంతలు తొక్కుతోంది. మొదట్నుంచి గందరగోళంగా మారిన ఈ లేఔట్‌.. ప్రధాన గ్రామానికి సుదూరంగా, రైల్వే ట్రాక్‌కు సమీపంలో మారుమూల ఉండటంతో అంతా వ్యతిరేకించారు. కానీ అప్పటికే ‘బేరాలు’ కుదుర్చుకున్న అధికారులు, ఆఖరికి వైకాపా నాయకుల మాటల్ని కూడా బేఖాతరు చేస్తూ.. 20.95 ఎకరాల భూమిని రికార్డు స్థాయిలో ఎకరాకు రూ.88.50 లక్షల ధర చెల్లించి కొనేశారు. మొత్తం 810 ప్లాట్లతో లేఔట్‌ వేసి, పట్టాలు మంజూరు చేశారు. ఇప్పటికే 200 మంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. లేఔట్‌కు వెళ్లేందుకు సరైన దారి లేకపోవడం, ఉన్నదారిలో కొంత వివాదాస్పదంగా మారింది. నిర్మాణ సామగ్రి తరలించడం ఇళ్లు కట్టుకునే లబ్ధిదారులకు మొన్నటివరకు ఇబ్బందిగా ఉండేది.

ఈ రోడ్డు చూపించే ఎకరం రూ.90 లక్షలకు కొనుగోలు చేశారు

వద్దన్నా వినలేదు

లేఔట్‌కు చేరుకోవడానికి నూజివీడు రోడ్డులో రైల్వే పైవంతెన దిగి సర్వీసు రహదారి మీదుగా జడ్పీ స్థలంలో ఏర్పాటు చేసిన డంపింగ్‌ యార్డు వెంబడి కి.మీకు పైగా ప్రయాణించాల్సి ఉంది. ఈ కి.మీ దూరం కూడా అనేక మలుపులతో, మట్టి రోడ్డుగా ఉంది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమైనా.. ప్రత్యామ్నాయం లేదని సరిపెట్టుకోవాలని అధికారులు తేల్చిచెప్పారు. తీరా రాకపోకలు ప్రారంభించగానే పలువురు అడ్డుచెప్పారు. 40 మీటర్ల మేర, సుమారు 65 సెంట్ల స్థలం ముగ్గురు రైతులు హక్కు రాసిస్తేనే లేఔట్‌కు మార్గం సుగమమవుతుందనే విషయం అప్పుడు బయటపడింది. లేఔట్‌కు భూమి అమ్మిన వ్యక్తులే దీనికి బాధ్యత వహించాల్సి ఉండగా, తమకేం సంబంధం లేదంటూ చేతులు దులుపుకోవడం గమనార్హం. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమైంది.


మరో అక్రమానికి తెర

బాపులపాడు జగనన్న లేఔట్‌-1తో పాటు రెండో లేఔట్‌కు ఎంపిక చేసిన పొలం ఎంతమ్రాతం అనువుగా లేదని సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైనా, రహస్య ఒప్పందాలు చేసుకున్న రెవెన్యూ అధికారులు, భారీ ధర చెల్లించి సొమ్ము చేసుకున్నారు. తాజాగా లేఔట్‌-1కు ప్రధాన మార్గంతో పాటు, రెండు లేఔట్లను అనుసంధానం చేస్తున్నామనే ముసుగులో మరో అక్రమానికి తెరలేపారు. సమీపాన ఉన్న కొందరు భూ యజమానులతో లోపాయకారీ అవగాహన కుదుర్చుకుని, దారి కోసమంటూ మరో ఎకరం భూసేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీని కోసం రెండు ఇళ్లను, తాత్కాలిక వాటర్‌ ట్యాంకుని నేలమట్టం చేస్తూ, ఆరుగురి స్థలాలు మూడేళ్ల తర్వాత వెనక్కి తీసుకునే కుట్రకు తెరలేపారు. గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో దీనికి సంబంధించిన దస్త్రం చకచకా ముందుకు కదిలిపోయింది. ప్రస్తుతం కలెక్టరేట్‌లో పెండింగ్‌లో ఉన్నా, ఎన్నికల కోడ్‌కు ముందే పని పూర్తి కానిచ్చేలా చక్రం తిప్పుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని