logo

‘నిఘా’ నిద్దరోతోంది...!

ప్రతిపక్షాల నిరసనలు, శాంతియుత ఆందోళనల అణచివేతపై పోలీసులకు ఉన్న శ్రద్ధ.. అసాంఘిక శక్తులపై నిఘా ఉంచడంలో కరవైంది. ఈ ఉదాసీనత అంతిమంగా ఘర్షణలు, హత్యలకు దారి తీస్తోంది.

Updated : 23 Feb 2024 05:54 IST

గ్యాంగ్‌ వార్‌లకు దారితీస్తున్న చిన్న వివాదాలు
ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, పటమట

ప్రతిపక్షాల నిరసనలు, శాంతియుత ఆందోళనల అణచివేతపై పోలీసులకు ఉన్న శ్రద్ధ.. అసాంఘిక శక్తులపై నిఘా ఉంచడంలో కరవైంది. ఈ ఉదాసీనత అంతిమంగా ఘర్షణలు, హత్యలకు దారి తీస్తోంది. తొలి దశలోనే వీటిని నివారించడంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కీలక ప్రాంతాల్లో గస్తీ లేకపోవడం, పటిష్ట నిఘా కొరవడడమే ఇందుకు ప్రధాన కారణం. ఏదైనా ఘటనలు జరిగినపుడే హడావుడి చేయడం.. పరిపాటిగా మారింది. తాజాగా హైటెన్షన్‌ రోడ్డులో బుధవారం సాయంత్రం జరిగిన రెండు వర్గాల యువకుల గొడవే ఇందుకు నిదర్శనం. కానూరులోని ఓ కాలేజీకి చెందిన జూనియర్లు, సీనియర్ల మధ్య జరిగిన చిన్న వాగ్వాదం రాడ్లు, కర్రలతో నడిరోడ్డుపై బాహాబాహీకి దిగే వరకు వెళ్లింది.


శాంతి, భద్రతల పరంగా విజయవాడ నగరం చాలా సున్నితమైంది. ఇక్కడ పలు రకాల నేరాలు జరుగుతుంటాయి. ఇంతటి కీలకమైన చోట శాంతి, భద్రతలు పూర్తి స్థాయిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను రూపుమాపాలంటే పటిష్ట నిఘా అవసరం. నగర పరిధిలోని స్టేషన్లలో ఎస్సైలకు వాహనాలు లేకపోవడం వల్ల గస్తీ తగ్గుతోంది. రక్షక్‌లను ప్రధానంగా రాత్రి పూట గస్తీకి వాడుతున్నారు. ప్రతి స్టేషన్‌కు అదనంగా కనీసం రెండు జీపులు అయినా ఇస్తేనే క్షేత్రస్థాయిలో వారు పట్టు సంపాదించేందుకు వీలు కలుగుతుంది. స్టేషనుకు ఇచ్చిన ఒక్క రక్షక్‌ వాహనాన్ని అందరు ఎస్సైలు వినియోగించుకోలేని పరిస్థితి. ద్విచక్ర వాహనాలపై తమ ప్రాంతాల్లో తూతూమంత్రంగా తిరుగుతున్నారు. దీని వల్ల అంతిమంగా పోలీసుల సమాచార వ్యవస్థ దెబ్బతింటోంది. ఫలితంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల పలు కేసుల్లో సరైన సమయంలో సమాచారం రాకపోవడం వల్ల పెద్దవయ్యాయి. వివాదాన్ని ప్రారంభంలోనే గుర్తించకపోవడంతో అవి చివరకు ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెట్టడం, ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థను మెరుగుపర్చుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు.

ఏడాదిన్నర కిందట.. సింగ్‌నగర్‌కు చెందిన టోనీ అనే రౌడీషీటర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చూసేందుకు అతని అనుచరులు ప్రభ, ఆకాశ్‌, తదితరులు వచ్చారు. అనంతరం పటమట స్టేషన్‌ పరిధిలోని ఓ బార్‌లో అందరూ కలిసి మద్యం తాగారు.  తాగిన మైకంలో ఫుట్‌బాల్‌ ఆటగాడు అయిన ఆకాశ్‌, ప్రభ మధ్య గొడవ జరిగింది. ఇది పెరిగి పెద్దది అయింది. మద్యం సీసా పగులగొట్టి ప్రభపై ఆకాశ్‌ దాడి చేయగా చేతికి గాయాలయ్యాయి. ఇది జరిగిన అనంతరం అదే రోజు రాత్రి ఆకాశ్‌ ఉన్న గదికి ప్రభ తన అనుచరులతో వెళ్లి హత్య చేశాడు.


చినికి చినికి గాలివానగా..

రెండేళ్ల కిందట పటమట స్టేషన్‌ పరిధిలో జరిగిన గ్యాంగ్‌ వార్‌ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందులో రెండు వర్గాలు పట్టపగలే పరస్పరం ఘర్షణకు దిగాయి. దాదాపు 60 మంది పాల్గొని ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. జనావాసాల మధ్యన ఇది జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. గాయపడిన వారు కేసు పెట్టిన తర్వాతే పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఘర్షణ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసిన తర్వాతే పోలీసులు అప్రమత్తమయ్యారు. అదే రోజు ఉదయం చిన్న వంతెన ప్రాంతంలో ఓ వర్గం సమావేశమైంది. అటుగా పోలీసులు వాహనం వెళ్తుండడంతో వారు చెల్లాచెదురయ్యారు. ఆ సమయంలో పసిగట్టకపోవడంతో రెండు వర్గాలు దాడి చేసుకుని, ఒకరి ప్రాణం పోయేంత వరకు వెళ్లింది.


పరిధి పెరిగి.. పర్యవేక్షణ కొరవడి

నగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్లు స్టేషన్లు లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఉన్న వాటిపై కేసుల భారం అధికమవుతోంది. ఫలితంగా పర్యవేక్షణ కొరవడుతోంది. కీలకమైన పటమట పోలీస్‌స్టేషన్‌ పరిధి కూడా నలువైపులా ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. బెంజిసర్కిల్‌ నుంచి అశోక్‌నగర్‌ వరకు, జాతీయ రహదారి వెంబడి స్క్యూ బ్రిడ్జి నుంచి గూడవల్లి వరకు విస్తరించింది. ఈ ప్రాంతంలో ఆవాస ప్రాంతాలు, కాలనీలు ఎక్కువ. దీనికి తోడు వైట్‌కాలర్‌, ఆర్థిక నేరాలు అధికంగా నమోదు అవుతుంటాయి. దీన్ని విభజించాలన్న ప్రతిపాదన చాలా ఏళ్ల నుంచి ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు. రామవరప్పాడు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, నిడమానూరు, గూడవల్లి ప్రాంతాలు స్టేషన్‌ నుంచి చాలా దూరంలో ఉంటాయి. పెద్ద స్టేషన్లను విభజించాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నా ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని