logo

తెలుగు భాషాభ్యున్నతికి పాటుపడతాం

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో ప్రజా చైతన్య సభ శనివారం రాత్రి విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించారు.

Published : 25 Feb 2024 05:33 IST

మాట్లాడుతున్న సామల రమేష్‌బాబు, వేదికపై బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాస్‌, రాజేంద్రప్రసాద్‌ తదితరులు
మొగల్రాజపురం(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో ప్రజా చైతన్య సభ శనివారం రాత్రి విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మాతృ భాషాభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ప్రాథమిక స్థాయిలోనే మాతృభాషలో చదివే వారి సంఖ్య తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య గౌరవాధ్యక్షుడు సామల రమేష్‌బాబు, అధ్యక్షుడు గారపాటి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.... దేశ, విదేశాల్లో వివిధ రంగాల్లో స్థిర పడిన వారందరూ తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారేనని తెలియజేశారు.  తెలుగు భాషాభ్యున్నతికి పాలకులు తీసుకోవాల్సిన చర్యలను భాషా ఉద్యమనేత డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ వివరించారు. అఖిల భారత న్యాయవాదుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ... రాజ్యాంగం 22 జాతీయ భాషలను గుర్తిస్తే.. కేవలం హిందీకే ప్రాధాన్యం ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగు భాషాతోనే వికాసమని జనసేన నాయకుడు పోతిన మహేష్‌, కాంగ్రెస్‌ నాయకుడు కొలనుకొండ శివాజీ తెలిపారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి మొవ్వ శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టిన ఐదు తీర్మానాలను ఏకగీవ్రంగా ఆమోదించారు. తెలుగు అభివృద్ధి, ప్రాధికార సంస్థను స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పాటు చేయాలి. తెలుగును అధికార భాషగా అన్ని సంస్థల్లో అమలు చేయాలి. తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగులో పనిచేసే కంప్యూటర్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. తెలుగు ప్రజలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందేందుకు అవసరమైన రాజ్యాంగ హక్కులకు రాజకీయ పార్టీలన్ని మద్దతు ప్రకటించాలి అని తీర్మానించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు