logo

వైకాపా గుండెలు జారిపోయాయి

జనసేన, తెదేపా కూటమి తొలి జాబితా ప్రకటనకే వైకాపా  గుండెలు జారిపోయాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన మొఘల్రాజపురంలో విలేకరులతో మాట్లాడారు

Updated : 25 Feb 2024 07:00 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా

 మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు. పక్కన వంశీకృష్ణ, సాంబశివరావు, సాయిరామ్‌గౌడ్‌ తదితరులు

 మొఘల్రాజపురం (చుట్టుగుంట), న్యూస్‌టుడే : జనసేన, తెదేపా కూటమి తొలి జాబితా ప్రకటనకే వైకాపా  గుండెలు జారిపోయాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన మొఘల్రాజపురంలో విలేకరులతో మాట్లాడారు. మధ్య నియోజకవర్గ అభ్యర్థిగా ఉమా పేరును ప్రకటించడంపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. వైకాపాకు ఓటమి భయం పట్టుకుందన్నారు. వై నాట్‌ 175 అన్న జగన్‌.. అభ్యర్థుల పేర్లు చెప్పలేని స్థితిలో ఉన్నారన్నారు. పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నారా? అని ప్రశ్నించారు. సొంత మనుషులే జగన్‌ను నమ్మే పరిస్థితి లేదన్నారు. నీ టికెట్‌ వద్దు.. నీ పార్టీ వద్దు.. అని చాలా మంది నాయకులు వెళ్లిపోతున్నారన్నారు. 2014లో తెదేపా, భాజపా, జనసేన కలిసి పోటీ చేశామన్నారు. 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో తెదేపా పలు మార్లు పొత్తులు పెట్టుకుందన్నారు. జగన్‌లా చీకటి పొత్తులు పెట్టుకోలేదన్నారు. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యం అని పవన్‌ ఎప్పుడో చెప్పారన్నారు. మేం పొత్తు పెట్టుకుంటే.. వైకాపా నాయకులకు వచ్చిన నొప్పి ఏమిటని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్‌ గజగజ వణికిపోతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధి తల్లకిందులైందన్నారు. పశ్చిమలో అవినీతి చేసిన మాజీ మంత్రి వెలంపల్లిని సెంట్రల్‌కి బదిలీ చేశారన్నారు. టికెట్‌ ప్రకటించక ముందే చందాలు ప్రారంభించారని ఆరోపించారు. చందాల శ్రీను సెంట్రల్‌లో దందాలు మొదలుపెట్టారని, ఇప్పటి వరకు ఇలాంటి వ్యక్తిని చూడలేదని ప్రజలు వాపోతున్నారన్నారు. రైతు బజారులో ఒక్కో దుకాణం నుంచి రూ.2లక్షలు డిమాండ్‌ చేస్తున్నారని, లేకుంటే పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని పలువురు వ్యాపారులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. అధికారులు అనవసరంగా అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగవద్దని, భవిష్యత్తులో ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. చట్ట ఉల్లంఘనలకు పాల్పడకుండా విధులు నిర్వర్తించాలని కోరారు. సమావేశంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరామ్‌ గౌడ్‌, జనసేన నియోజకర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని