logo

పదేళ్లకే నూరేళ్లు నిండాయా తల్లీ..!

గొంతులో టాన్సిల్స్‌ నివారణకు చేసిన వైద్యం వికటించి బాలిక మృతిచెందిన ఘటన శనివారం మంగొల్లులో చోటుచేసుకుంది

Updated : 25 Feb 2024 06:55 IST

మృతదేహం వద్ద విలపిస్తున్న బంధువులు
వత్సవాయి, న్యూస్‌టుడే: గొంతులో టాన్సిల్స్‌ నివారణకు చేసిన వైద్యం వికటించి బాలిక మృతిచెందిన ఘటన శనివారం మంగొల్లులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామానికి చెందిన ముప్పసాని వీరబ్రహ్మం, కృష్ణవేణి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె దివ్యశ్రీ(10) ఉన్నారు. దివ్యశ్రీ టాన్సిల్స్‌తో ఇబ్బంది పడుతోంది. వైద్యం కోసమని శనివారం వారు వత్సవాయి మండలం మంగొల్లులోని ఆర్‌ఎంపీ వైద్యుడు జి.నెమలయ్యను సంప్రదించారు. వైద్యం చేస్తానని నెమలయ్య రూ.6 వేలకు ఒప్పందం చేసుకున్నాడు. వైద్యం మొదలు పెట్టి బాలిక చేతికి ఇంజెక్షన్లు ఇచ్చారు. అనంతరం గొంతులో చికిత్స చేశారు. కొద్దిసేపటికే వైద్యం వికటించి బాలిక అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ వెంటనే ప్రాణాలు విడిచింది. కళ్లముందే దివ్యశ్రీ మృతి చెందడంతో కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా ఆర్‌ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న బాలిక అమ్మమ్మ ఊరైన వత్సవాయి మండలం భీమవరం నుంచి పెద్దఎత్తున బంధువులు వచ్చి ఆందోళనకు దిగారు. జగ్గయ్యపేట సీఐ జానకీరామ్‌, ఎస్సై అభిమన్యు అక్కడకు చేరుకొని వారితో చర్చించి సముదాయించారు. జరిగిన ఘటనపై బాలిక తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకొని వైద్యుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దివ్యశ్రీని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నామని తల్లిదండ్రులు బోరున విలపించడం చూపరులను కన్నీరు పెట్టించింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని