logo

చోడవరంలో అర్ధరాత్రి ఇసుక అక్రమ తవ్వకాలు

చోడవరం ఇసుక క్వారీలో శనివారం అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ గత నాలుగు రోజులుగా భారీ ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయంటూ ఆరోపిస్తున్న పెనమలూరు మాజీ శాసన సభ్యుడు బోడే ప్రసాద్‌, తెదేపా కార్యకర్తలు శనివారం అర్ధరాత్రి క్వారీలోకి చేరుకొని ఆందోళనకు దిగారు

Published : 25 Feb 2024 05:40 IST

అడ్డుకున్న బోడే ప్రసాద్‌, తెదేపా నాయకులు

 క్వారీలో ఇసుక తవ్వుతున్న పొక్లెయిన్‌ను చూపుతున్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌

 పెనమలూరు, న్యూస్‌టుడే: చోడవరం ఇసుక క్వారీలో శనివారం అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ గత నాలుగు రోజులుగా భారీ ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయంటూ ఆరోపిస్తున్న పెనమలూరు మాజీ శాసన సభ్యుడు బోడే ప్రసాద్‌, తెదేపా కార్యకర్తలు శనివారం అర్ధరాత్రి క్వారీలోకి చేరుకొని ఆందోళనకు దిగారు. దీంతో తవ్వకాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మాజీ ఎమ్మెల్యేతో పాటు దాదాపు 100 మంది తెదేపా కార్యకర్తలు ఉన్నట్టుండి క్వారీకి వెళ్లి అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న పొక్లెయిన్‌లను అడ్డుకోగా.. డ్రైవర్లు, సిబ్బంది పరారయ్యారు. లారీలు కరకట్టపై నిలిచిపోయాయి. తవ్వకాలపై  ఆర్డీవో రాజు, పోలీస్‌ అధికారులకు బోడే ప్రసాద్‌ అక్కడ నుంచే ఫిర్యాదు చేయగా తమ శాఖ పరిధిలోది కాదంటే.. తమ శాఖది కాదని తప్పించుకోవడంతో బోడే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి జోగి రమేష్‌ అండతో ఆయన అనుచరులు క్వారీపై పడి అడ్డంగా దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు. దోపిడీలో మంత్రితో పాటు మైనింగ్‌ ఉన్నతాధికారి వెంకటరెడ్డికి ప్రమేయం ఉందని ఆరోపించారు. ఇసుక తవ్వకాలకు పూర్తి స్థాయి అనుమతులు రాకుండానే అక్రమ తవ్వకాలతో రూ.కోట్ల విలువైన ఇసుకను తరలించేస్తున్నారంటూ వెంకటరెడ్డికి పలుసార్లు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోదంటూ ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోను క్వారీ నుంచి ఇసుక అక్రమంగా తవ్వి తరలిస్తే సహించేది లేదంటూ మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యంపై తమవద్ద ఉన్న సాక్ష్యాలతో న్యాయస్థానానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని