logo

మితి మీరిన వేగం... తీసింది ప్రాణం

అజిత్‌సింగ్‌నగర్‌ పైవంతెనపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కటారి నాగరాజు (40) అనే వ్యక్తి మృతిచెందాడు. ధనుంజయ్‌రావు, మురళీకృష్ణలు గాయపడ్డారు.

Updated : 25 Feb 2024 06:59 IST

ధ్వంసమైన ద్విచక్రవాహనాలు
అజిత్‌సింగ్‌నగర్‌ (మధురానగర్‌), న్యూస్‌టుడే : అజిత్‌సింగ్‌నగర్‌ పైవంతెనపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కటారి నాగరాజు (40) అనే వ్యక్తి మృతిచెందాడు. ధనుంజయ్‌రావు, మురళీకృష్ణలు గాయపడ్డారు. రెండు ద్విచక్రవాహనాలు మితిమీరిన వేగంతో వస్తూ ఎదురెదురుగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాద తీవ్రతకు.. నాగరాజు ఎగిరి రోడ్డు మీద పడ్డాడు. తల పగిలి రక్తం మడుగు కట్టింది. ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వివరాలు ఇలా ఉన్నాయి...

అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన నల్లమోతు ధనుంజయ్‌రావు (48), మురళీనగర్‌కు చెందిన మండపాటి మురళీకృష్ణలు హోమ్‌లోన్స్‌ ఇప్పిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు వీరిద్దరూ పని మీద గుంటూరు వెళ్లి రాత్రి 10.30 గంటల సమయంలో విజయవాడకు వచ్చారు. ధనుంజయ్‌రావును అజిత్‌సింగ్‌నగర్‌లోని ఇంటి వద్ద దింపేందుకు పైవంతెన మీదుగా బయలుదేరారు. పై వంతెన దాదాపు దిగి, రోడ్డు మీదకు వస్తుండగా.. ఎదురుగా మరో ద్విచక్రవాహనం వచ్చింది. వాహనాలను అదుపు చేయలేక ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ధనుంజయ్‌రావు, మురళీకృష్ణలు ఎగిరి రోడ్డు మీద పడ్డారు.

శిరస్త్రాణం లేకపోవడంతో... ప్రమాద సమయంలో.. ద్విచక్ర వాహన వేగానికి కటారి నాగరాజు వేగంగా నేలకు కొట్టుకోవడంతో తల పగిలింది. వెంటనే అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. శిరస్త్రాణం ధరించకపోవడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు చెబుతున్నారు. నాగరాజు శిరస్త్రాణం ధరించి ఉంటే.. ప్రాణాలు నిలిచేవని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. కాగా ఘటనాస్థలంలో మద్యం సీసాలు పగిలిపోయి ఉన్నాయి. అవి ఎవరివో చెప్పలేకపోతున్నారు. అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


తిరునాళ్లకు వచ్చి తిరిగి రాని లోకాలకు..

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటకు చెందిన దేసు ధనలక్ష్మి (60) ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లకు వచ్చి గుండెపోటుతో శనివారం మృతిచెందారు. శుక్రవారమే పెనుగంచిప్రోలు వచ్చిన ఆమె రాత్రి జరిగిన కల్యాణాన్ని వీక్షించి ఉదయాన్నే అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి పయనమయ్యారు. బస్సు కోసమని పోలీస్‌స్టేషన్‌ కూడలికి వచ్చి అక్కడే ఉన్న మిఠాయి దుకాణం మెట్లపై కూర్చున్నారు. కూర్చున్నట్లుగానే ఒక్కసారిగా మెట్లపై ఒరిగిపోయారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె వద్ద ఉన్న  సెల్‌ఫోన్‌, బ్యాంకు పాస్‌బుక్‌ ఆధారంగా చిరునామా గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బంధువులు వచ్చి మృతదేహాన్ని తీసుకు వెళ్లారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారని, ఆ క్రమంలోనే మృతి చెంది ఉంటారని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు లేనందున పోలీసులు కేసు నమోదు చేయలేదు.


అనారోగ్య సమస్యలతో బలవన్మరణం

వత్సవాయి, న్యూస్‌టుడే: ఉదయాన్నే లేచి కుమారులిద్దరికీ సపర్యలు చేసింది. ఒకరిని అంగన్‌వాడీ కేంద్రానికి పంపించింది. చిన్న కుమారుడిని తీసుకొని సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన శనివారం ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి మండలం భీమవరంలో చోటు చేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు భీమవరానికి చెందిన షేక్‌ హద్రిమ్‌, బేగం దంపతుల కుమార్తె షేక్‌ ఫాతిమూన్‌(27). ఈమెకు ఏడేళ్ల కిందట సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం గ్రామానికి చెందిన షేక్‌ నాగుల్‌తో వివాహమైంది. వీరికి నజీమ్‌, హకీం కుమారులు. గత రెండు నెలలుగా ఫాతిమూన్‌ కుమారులతో కలిసి భీమవరం వచ్చి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. శనివారం ఎప్పటిలాగే తల్లిదండ్రులు పనులకు వెళ్లారు. అప్పటికే పెద్ద కుమారుడు నజీమ్‌ను అంగన్‌వాడీ కేంద్రానికి పంపారు. ఇంట్లో ఎవరూ లేని సుమారు 10 గంటల సమయంలో చిన్నకుమారుడు హకీం(2)ను ఎత్తుకొని ఇంటికి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకింది. గమనించిన స్థానికులు బయటకు తీసేలోగా తల్లీకుమారుడు మృతిచెందారు. కుమారుడిని చున్నీతో నడుముకు కట్టుకొని బావిలో దూకినట్లు స్థానికులు గుర్తించారు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు పరుగున వచ్చి బోరున విలపించారు. గంట కిందటే టిఫిన్‌ పెట్టి బడికి పంపిన అమ్మ, తనతో రోజూ ఆడుకునే తమ్ముడు విగతజీవులుగా పడి ఉండడాన్ని చూసిన చిన్నారి నజీమ్‌ బోరున విలపించాడు. తల్లీ, తమ్ముడు మృతదేహాల వద్ద ఏడుస్తున్న ఆ బాలుడిని బంధువులు, కుటుంబ సభ్యులు ఎత్తుకొని ఓదార్చారు. తమ కుమార్తె కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని, ఆ బాధతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటుందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై అభిమన్యు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు