logo

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం

సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నయీమ్‌అస్మి హెచ్చరించారు.

Published : 25 Feb 2024 05:49 IST

మాట్లాడుతున్న ఎస్పీ నయీమ్‌అస్మి

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నయీమ్‌అస్మి హెచ్చరించారు. శనివారం తపసిపూడి పోలీస్‌ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పలు సూచనలు చేశారు. వచ్చే మూడు నెలలు అత్యంత కీలకమని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. పోలింగ్‌బూత్‌ల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది ప్రిసైడింగ్‌ అధికారి అనుమతి లేకుండా బూత్‌ల్లోకి ప్రవేశించకూడదన్నారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసే నగదు, మద్యం, విలువైన వస్తువులు, అక్రమ రవాణా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గత ఎన్నిక అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తగిన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. విధి నిర్వహణలో ఎటువంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగకుండా నైతిక విలువలు విధిగా పాటించాలన్నారు. నేరచరిత్ర ఉన్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. గతంలో అల్లర్లలో ఉన్నవారిని ముందస్తుగా బైండోవర్‌ చేయాలని, లైసెన్స్‌ కలిగిన ఆయుధాలు ఉన్నవారితో మాట్లాడి వాటిని సంబంధిత పోలీస్‌ స్టేషన్లలో డిపాజిట్‌ చేయించాలన్నారు.ఎన్నికల సమాచార వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు విజయవంతంగా ముగిసేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న విషయం గుర్తించాలన్నారు. ఏఎస్పీ జి.వెంకటేశ్వరరావు, డీటీసీ డీఎస్పీ రమేష్‌ మాట్లాడుతూ సిబ్బందికి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ : జిల్లాలో ఆదివారం నిర్వహించే గ్రూప్‌-2 స్క్రీనింగ్‌ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ఎస్పీ తెలిపారు. మొత్తం 51 కేంద్రాల్లో 17,241 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. ఆయా కేంద్రాల వద్ద జిరాక్స్‌, నెట్‌ సెంటర్లు, ఇతర దుకాణాలు ఉండకూడదన్నారు.

ప్రతి నియోజకవర్గానికి అదనపు ఈవీఎంలు

 కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: భారత ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు ఈవీఎంల ర్యాండమైజేషన్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని ఈవీఎంల నోడల్‌ అధికారి నాగేశ్వర్‌నాయక్‌ తెలిపారు. కలెక్టరేట్‌ స్పందన సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన ఈవీఎంల మొదటి, రెండో స్థాయి ర్యాండమైజేషన్‌ ప్రక్రియ ట్రయల్‌ రన్‌ను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. మొదటి స్థాయిలో వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్‌ ఆయా శాసనసభా నియోజకవర్గాలకు అవసరమైన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను కేటాయిస్తారన్నారు. రెండో స్థాయిలో నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులకు కేటాయించిన ఈవీఎంలను వారి పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల వారీ కేటాయించాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి రిజర్వ్‌లో ఉంచుకునేలా అదనంగా ఈవీఎంలు కేటాయిస్తారన్నారు. తొలుత పార్లమెంట్‌ నియోజకవర్గం, తర్వాత శాసనసభా నియోజకవర్గాల వారీ ఈవీఎంలు కేటాయించాలన్నారు. రిజర్వ్‌లో ఉంచే వాటిని ప్రత్యేకంగా స్ట్రాంగ్‌రూంలో భద్రపర్చాలన్నారు. జేసీ గీతాంజలిశర్మ, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, ఏఆర్వోలు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని