logo

వైకాపా నాయకుల ఇసుక దోపిడీ

అడిగేవారు, అడ్డుకునేవారు లేరని.. అధికారం ఉందని ఇసుకాసురులు కృష్ణా నదిని చెరపట్టారు. అధికారులు కూడా చోద్యం చూస్తుండడంతో నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా ఇసుక తరలిస్తున్నారు

Published : 25 Feb 2024 05:51 IST

అక్రమ రవాణా అడ్డుకున్న గ్రామస్థులు

లారీలు అడ్డుకున్న రొయ్యూరువాసులు

 తోట్లవల్లూరు, న్యూస్‌టుడే: అడిగేవారు, అడ్డుకునేవారు లేరని.. అధికారం ఉందని ఇసుకాసురులు కృష్ణా నదిని చెరపట్టారు. అధికారులు కూడా చోద్యం చూస్తుండడంతో నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా ఇసుక తరలిస్తున్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలను సైతం ధిక్కరించి నదీగర్భంలోని ఇసుక తోడేస్తున్నారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు గ్రామం వద్ద కృష్ణా నదిలో పలుచోట్ల ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. గనులు, పర్యావరణ, రెవెన్యూ, పోలీసు, నిఘా విభాగాల కళ్లెదుటే అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నా అధికార పార్టీ నేతల ప్రమేయం ఉన్నందున చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

 రైతు పేరుతో అనుమతులు తిరస్కరించినా..

తోట్లవల్లూరు మండలం రొయ్యూరు క్వారీలో ఓ రైతు పేరుతో సుమారు 4.9 ఎకరాల్లో ఇసుక తవ్వకాల కోసం దరఖాస్తు చేయగా అనుమతులిచ్చేందుకు అధికారులు తిరస్కరించారు. అయినా దీన్ని అడ్డం పెట్టుకొని మంత్రి, నియోజకవర్గ నేత సహకారంతో ప్రభుత్వ క్వారీలో తవ్వకాలు చేపట్టి రాత్రింబవళ్లు రవాణా చేస్తున్నారు. తను చెప్పిందే చట్టం అన్నట్లుగా చెలరేగిపోతున్నారు. భారీ పొక్లెయిన్లతో నిత్యం వందలాది లారీలతో ఇసుక తరలిస్తూ అక్రమార్జనకు తెగబడుతున్నారు. స్థానికంగా ఉన్న వైకాపా నాయకుల అనుచరులు వారికి అన్ని విధాలా సహకరిస్తున్నారు. వారి అరాచకాలు శ్రుతిమించి భారీ లారీల రాకపోకలకు రహదారులు ధ్వంసం కావడంతో గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో లారీలను అడ్డుకున్నారు.

స్పందించని యంత్రాంగం

రొయ్యూరు గ్రామానికి చెందిన ఎం.రాంబాబు, నాగరాజు తదితరులు శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి లారీలను అడ్డుకున్నారు. గ్రామస్థులు శనివారం మధ్యాహ్నం వరకు అడ్డుకున్నాగానీ అధికారులు రాలేదు. రెవెన్యూ అధికారులు తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. 45 రోజుల నుంచి అడ్డగోలుగా ఇసుక తవ్వుకుపోతున్నారన్నారు. రొయ్యూరు క్వారీకి ఎటువంటి అనుమతులు లేవని తహసీల్దార్‌ ఎం.కుసుమకుమారి చెప్పారు. అక్రమ తవ్వకాలపై ప్రస్తావించగా పరిశీలించి చర్యలు తీసుకుంటానని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని