logo

‘పేర్ని నాని ఆత్మవిమర్శ చేసుకోవాలి’

ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అక్రమంగా కుమారుడికి కట్టబెట్టి అక్రమాలకు ఆజ్యం పోసిన ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ తెదేపా నాయకులు హితవు పలికారు.

Published : 25 Feb 2024 05:53 IST

మాట్లాడుతున్న తెదేపా నాయకులు
మచిలీపట్నం(కోనేరు సెంటరు), న్యూస్‌టుడే: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అక్రమంగా కుమారుడికి కట్టబెట్టి అక్రమాలకు ఆజ్యం పోసిన ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ తెదేపా నాయకులు హితవు పలికారు. శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో గోపు సత్యనారాయణ, కుంచె నాని, లంకె నారాయణ ప్రసాద్‌లు మాట్లాడుతూ రెండేళ్లకే మంత్రి పదవి పోగొట్టుకున్న పేర్ని ఇక ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోతుండటాన్ని జీర్ణించుకోలేక ఇంకా అబద్ధాలతోనే ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం అవివేకమన్నారు. కొల్లు రవీంద్ర వేసిన శిలాఫలకాలను అపహాస్యం చేసేలా చూపిస్తున్న పేర్ని తాను అక్రమ సంపాదనతో నిర్మించిన గోదామును చూపిస్తే బాగుంటుందన్నారు. దొంగ పట్టాలతో అమాయకులైన పేద వర్గాలను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. గతంలో గోగిలేరుకు పోర్టును తాకట్టు పెట్టి, ఇప్పడేదో మాయ పనులతో పోర్టు కట్టేస్తున్నామంటూ ప్రగల్భాలు పలకడం హేయమన్నారు. కేవలం అక్రమాల కోసమే పోర్టు పనులు చేస్తున్నారని, దాన్ని వినియోగంలోకి తీసుకువచ్చే చిత్తశుద్ధి వైకాపా ప్రభుత్వానికి లేదన్న విషయం జరుగుతున్న పనులను చూస్తే ఎవరికైనా అర్ధమవుతుందన్నారు. ‘మీ కొడుకు ముడ నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నాడంటూ చెప్పుకోవడం కన్నా గతిమాలిన పని మరోటి లేదని’ అన్నారు. గతంలో పోర్టు పనులను నవయుగ సంస్థకు అప్పగించి మళ్లీ ఆ సంస్థ పనిచేయకుండా పనులు రద్దు చేయించింది తమరే అన్న విషయం అందరికీ తెలుసన్నారు. సమన్వయ కమిటీ నాయకులు వాలిశెట్టి తిరుమలరావు, మైనార్టీసెల్‌ జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ఖాజాలు మాట్లాడుతూ నాని అబద్ధాలతో కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం బాటలు వేసుకోవాలనే కుతంత్రాలు మానుకుంటే మేలన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని