logo

ఎవరో... ఆ నలుగురు?!

ఉమ్మడి కృష్ణాలో మరో నాలుగు శాసనసభ నియోజకవర్గాలకు తెదేపా-జనసేన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 14 అసెంబ్లీ సీట్లకు.. పది మంది తెదేపా అభ్యర్థులను ప్రకటించారు.

Published : 25 Feb 2024 05:57 IST

ఈనాడు - అమరావతి: ఉమ్మడి కృష్ణాలో మరో నాలుగు శాసనసభ నియోజకవర్గాలకు తెదేపా-జనసేన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 14 అసెంబ్లీ సీట్లకు.. పది మంది తెదేపా అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన నాలుగింటిలో జనసేన ఎక్కడ పోటీ చేస్తుంది..? తెదేపా అభ్యర్థులు ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ నుంచి జనసేన పోటీ చేయనున్నట్లు తెలిసింది. మైలవరం, పెనమలూరు స్థానాలకు తెదేపా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా వివిధ సమీకరణల నేపథ్యంలో వీటిని పెండింగ్‌లో ఉంచారు.

విజయవాడ పశ్చిమ స్థానం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించనున్నారు. ఆ పార్టీ తరఫున పోతిన మహేష్‌ పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. తెదేపా నుంచి ఈ స్థానం పలువురు ఆశించారు. 2014లో పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించగా అప్పట్లో వెలంపల్లి పోటీ చేసి ఓడిపోయారు. వైకాపా నుంచి జలీల్‌ఖాన్‌ గెలుపొంది తెదేపాలో చేరారు. 2019లో ఆయన కుమార్తె షబానా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం వైకాపా నుంచి ఆసిఫ్‌ ఖరారయ్యారు. తెదేపా నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఆశించారు. ఇప్పటికే బలప్రదర్శన నిర్వహించి, తన రుధిరంతో బాబు చిత్రానికి రక్తాభిషేకం చేశారు. మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ తనకూ టికెట్‌్ కావాలని కోరారు. వైకాపా నేతలను సైతం కలిశారు. మరో మైనార్టీ నేత ఎంఎస్‌ బేగ్‌ ప్రయత్నాలు చేశారు. ఆయనకే టికెట్‌ ఇప్పిస్తానని కొందరు డబ్బు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దీనిని జనసేనకు ఇచ్చేందుకు నిర్ణయించారు.

 అవనిగడ్డ నుంచి జనసేన అభ్యర్థిని రంగంలోకి దించనుంది. ఈ స్థానం సీనియర్‌ నాయకుడు మండలి బుద్ధప్రసాద్‌ ఆశించారు. తనకు టికెట్‌ కేటాయించకపోవడాన్ని ఆయన తేలిగ్గా తీసుకున్నారు. చాలా స్వతంత్రుడిగా ఉన్నట్లు భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయాలు తన మనస్తత్వానికి సరిపోవనే భావన వెలిబుచ్చారు.

 పెనమలూరు కూడా పెండింగ్‌లో ఉంచారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. ఆయనే ఇన్‌ఛార్జిగా ఉన్నారు. 2014లో గెలిచి 2019లో ఓడిపోయారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి నూజివీడు తెదేపా టికెట్‌ కేటాయించారు. ఆయన 26న తెదేపాలో చేరుతున్నారు. పెనమలూరు వైకాపా అభ్యర్థిగా మంత్రి జోగి పోటీ చేయనున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా తెదేపా నుంచి ఎవరుంటారనేది ఇప్పుడు ఆసక్తికరం. బోడే ప్రసాద్‌, వసంత కృష్ణప్రసాద్‌, దేవినేని ఉమాలో ఒకరుంటారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈస్థానం సూపర్‌స్టార్‌ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆశిస్తున్నట్లు తెదేపా వర్గాలు చెబుతున్నాయి.


నరాలు తెగే ఉత్కంఠ... ఈసారి మైలవరం అభ్యర్థి

ఎవరనేది అత్యంత ఆసక్తిగా మారింది. ఎమ్మెల్యే వసంత తెదేపాలో చేరడం ఖాయమైంది. మైలవరం ఆయనకే ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెదేపా ఇన్‌ఛార్జిగా మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యవహరిస్తున్నారు. ఈసారి ఆయనకు టికెట్‌ ఉంటుందా లేక ఎమ్మెల్సీతో సరిపెడతారా అనే చర్చ నడుస్తోంది. ఈనెల 26 తర్వాత ఎమ్మెల్యే వసంత తెదేపాలో చేరనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని