logo

టిడ్కో ఇళ్ల మంజూరులో నకి‘లీలలు’

గుడివాడ టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో కొత్త బాగోతం వెలుగుచూసింది. విద్యుత్తు కనెక్షన్లున్నవారికి మంజూరు రద్దు చేయడంతో వారంతా వక్రమార్గం పట్టారు.

Published : 25 Feb 2024 05:59 IST

విద్యుత్తు శాఖ అధికారుల సంతకాలు ఫోర్జరీ

దొంగ స్టాంపులతో ధ్రువపత్రాల సృష్టి

 ఓ లబ్ధిదారుని పేరుతో సృష్టించిన నకిలీ ధ్రువపత్రం

న్యూస్‌టుడే, గుడివాడ (నెహ్రూచౌక్‌): గుడివాడ టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో కొత్త బాగోతం వెలుగుచూసింది. విద్యుత్తు కనెక్షన్లున్నవారికి మంజూరు రద్దు చేయడంతో వారంతా వక్రమార్గం పట్టారు. అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి, నకిలీ స్టాంపులతో నిరభ్యంతర పత్రాలు సృష్టించి ఇళ్ల కేటాయింపులు పొందుతున్నారు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో సచివాలయాల సిబ్బంది జోక్యంతో ఈ దందా కొనసాగుతోందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఇళ్లు లేని పేదల కోసం గుడివాడ పట్టణానికి సమీపంలోని మల్లాయపాలెంలో టిడ్కో ఇళ్ల సముదాయం నిర్మించారు. ఇందులో ఇల్లు మంజూరు కావాలంటే దరఖాస్తుదారుడి పేరుతో విద్యుత్తు కనెక్షన్‌ ఉండకూడదు. ఈ నిబంధన కింద కొంతమంది అర్జీల్ని తిరస్కరించారు. ఇలాంటి వారంతా అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. తమ పేరుతో విద్యుత్తు కనెక్షన్లు లేవని సంబంధిత ఏఈల వద్ద నుంచి నో సర్వీస్‌ ధ్రువపత్రాన్ని సచివాలయాల్లో సమర్పించాలి. కొంతమంది మోసగాళ్లు అలాంటి వారికి ఇళ్లు వచ్చేలా చేస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. తమ పేరుతో విద్యుత్తు కనెక్షన్‌ లేదని.. విద్యుత్తు శాఖ ఏఈల సంతకాల్ని ఫోర్జరీ చేసి దొంగ స్టాంపులతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తున్నారు. స్థానిక నాయకుల కనుసన్నల్లో సచివాలయాల సిబ్బంది వాటిని అప్‌లోడ్‌ చేస్తుండడంతో ఇళ్లు మంజూరవుతున్నాయి.

 పోలీసులకు ఏఈల ఫిర్యాదు

తమ సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్నారని విద్యుత్తు శాఖ ఏఈలు శుక్రవారం రాత్రి ఒకటో పట్టణ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. పట్టణంలోని పెద్దవీధి, ధనియాలపేటలో ఈ నకిలీ పత్రాలు ఎక్కువగా సృష్టించినట్లు ఫిర్యాదులో పేర్కొనట్లు సమాచారం. ఈ అక్రమాల్లో సచివాలయ సిబ్బంది ప్రమేయం కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇలాంటి అక్రమార్కుల వల్ల అర్హులు నష్టపోవాల్సి వస్తోందని, ఇప్పటికైనా పురపాలక సంఘం అధికారులు తక్షణం విచారణ చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.


విచారణ చేపడతాం

ఈ విషయం ఇంతవరకూ మా దృష్టికి రాలేదు. దీనిపై సమగ్ర విచారణ చేయించి రుజువైతే దోషులపై చర్యలు తీసుకుంటాం.
- కృష్ణారావు, పురపాలక సంఘం సహాయ కమిషనర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని