logo

జోగి తాయిలాలకు.. అడ్డేలేదు

పెనమలూరులో మంత్రి జోగి తాయిలాల పంపిణీకి అడ్డే లేకుండాపోతోంది. మొన్న పాస్టర్లతో ఆత్మీయ సమావేశం.. ఆపై వారి చేతిలో రూ.2 వేలు, ప్లాస్కులు, కుక్కర్లు పెట్టారు. దానిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు అందాయి. అధికారులు కూడా దృష్టిపెట్టామన్నారు.

Published : 29 Feb 2024 05:17 IST

తాజాగా రిసోర్స్‌ పర్సన్‌లకు కుక్కర్లు, చీరలు
పెనమలూరువైపు కన్నెత్తి చూడని అధికారులు

కానూరులో ఆర్పీలకు ఇచ్చిన కుక్కరు, చీర

ఈనాడు -అమరావతి, న్యూస్‌టుడే - కానూరు: పెనమలూరులో మంత్రి జోగి తాయిలాల పంపిణీకి అడ్డే లేకుండాపోతోంది. మొన్న పాస్టర్లతో ఆత్మీయ సమావేశం.. ఆపై వారి చేతిలో రూ.2 వేలు, ప్లాస్కులు, కుక్కర్లు పెట్టారు. దానిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు అందాయి. అధికారులు కూడా దృష్టిపెట్టామన్నారు. కానీ.. జోగి పంథా మారలేదు. పెనమలూరు పరిధిలో వాలంటీర్లు అందరితో సమావేశాలు పెట్టి.. సత్కారం పేరుతో గృహోపకరణాలు, డబ్బు పంచారు. దీనిపైనా తీవ్ర విమర్శలే. అయినా.. మరింత బహిరంగంగా జోగి తాయిలాల పర్వం కొనసాగుతోందే తప్ప ఆగడం లేదు. తాజాగా బుధవారం డ్వాక్రా గ్రూపులను పర్యవేక్షించే రిసోర్స్‌ పర్సన్‌(ఆర్‌పీ)లకు తాయిలాలను పంచారు. కానూరులోని మన గార్డెన్స్‌లో ఆత్మీయ సమ్మేళనం ఉందని అందరినీ పిలిచి.. తనకు ఓట్లను వేయించాలని సూచించి, వారికి చికెన్‌ భోజనాలు పెట్టి మరీ.. కుక్కర్లు, చీరలను పంచారు. అయినా.. అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు.

పెనమలూరు పరిధిలో ఏ వర్గాన్నీ మంత్రివదలడం లేదు. సామాజిక వర్గాల వారీగా సమావేశమై తాయిలాలను పంచుతున్నారు. వాలంటీర్లతో మొదలు.. సచివాలయాల సిబ్బంది, డీఆర్‌డీఏ, డ్వాక్రా గ్రూపుల ఆర్పీల వరకు సమ్మేళనం పేరుతో పిలిచి.. భోజనాలు పెడుతున్నారు. తనకు ఓట్లు వేయించాలనీ, వైకాపా తరఫున పెనమలూరు అసెంబ్లీలో తనకు, మచిలీపట్నం ఎంపీ బరిలో నిలిచే అభ్యర్థికి.. ఓట్లు వేయాలని చెబుతూ.. కుక్కర్లు, ఫ్లాస్కులు, హాట్‌బాక్సులు, చీరలు.. ఇస్తున్నారు. ఇప్పటికే పెద్దఎత్తున గృహోపకరణాలను కొని కొన్ని ప్రాంతాల్లో దాచినట్టు తెలుస్తోంది. తాయిలాల పంపిణీపై తీవ్ర విమర్శలు వస్తే.. గ్రామస్థాయి నేతలకు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆసరా పేరుతో..

ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ సభలను ప్రభుత్వ డబ్బులతో ఏర్పాటు చేసి.. వైకాపా ప్రచారానికి వాడుకున్నారు. గతంలో మండలస్థాయి ప్రజాప్రతినిధులే ఎక్కడికక్కడ ఈ నమూనా చెక్కులను మహిళలకు ఇచ్చేవాళ్లు. కానీ.. దీనిని కూడా వేల మందితో కూడిన సభలుగా జోగి మార్చేశారు. వేల మంది మహిళలను సభలకు రప్పించి, వారికి చికెన్‌, బిర్యానీతో భోజనాలు పెట్టి.. దర్జాగా ప్రచారం చేసుకున్నారు. పేరుకు మాత్రమే ఇవి అధికారిక సభలు.. ఏర్పాట్లు మొత్తం అధికారులే చేసేవాళ్లు.. ప్రజాధనం వెచ్చించేవాళ్లు.. కానీ.. ప్రచారం మాత్రం వైకాపాకు చేసుకున్నారు. ఈ సభలకు కూడా డ్వాక్రా గ్రూపులకు చెందిన ప్రతి మహిళా తప్పనిసరిగా రావాల్సిందేనని నిబంధనలు పెట్టి మరీ.. రప్పించారు. మూడు, నాలుగు ఊళ్లకు ఒక సభ చొప్పున పెట్టి.. మూడు నాలుగు వేల మందిని ఒకచోటకు రప్పించి, డ్వాక్రా మహిళలందరికీ.. తాము చేర్చాల్సిన మెసేజ్‌ వెళ్లిపోయిందని భావించాకే.. ముగింపు పలికారు. ఆ తర్వాత.. పాస్టర్లు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, రిసోర్స్‌పర్సన్‌లకు సమ్మేళనాల పేరుతో తాయిలాలు పంచడం ఆరంభించారు.

అందరూ రావాల్సిందే..

ఆత్మీయ సమ్మేళనాలు, సత్కారాలు, సభలకు.. జోగి రమేష్‌ ఎవరిని పిలిస్తే వాళ్లంతా రావాల్సిందే. కానూరులోని మన గార్డెన్స్‌లో ఆర్‌పీల కోసం బుధవారం నిర్వహించిన సమ్మేళనానికి వారిని బలవంతంగా రప్పించారు. ‘ఈ సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందేననీ... సెలవులు, అనుమతులు వంటివి ఎవరికీ ఉండవని కంకిపాడుకు చెందిన డీఆర్‌డీఏ అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్‌(ఏపీఎం) పేరుతో సామాజిక మాధ్యమాల్లో సోమవారం నుంచి మెసేజ్‌లు పెట్టి మరీ రప్పించారు. మొన్న వాలంటీర్లను కూడా ఇలాగే రప్పించి.. తాయిలాలు చేతిలో పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని