logo

కొండపై లేఔట్‌

‘జగనన్న కాలనీకి ఇక్కడ స్థలం కేటాయించారు. కొండ ప్రాంతంగా ఎత్తుపల్లాలను సరిచేస్తున్నాం. అరకొర మట్టి ఉంటే బయట జగనన్న లేఔట్‌ కాలనీలకు తరలిస్తున్నాం.’ అని గన్నవరం మండలం గొల్లనపల్లిలో ఓ వైకాపా నాయకుడు స్థానికంగా చెబుతున్న మాటలివి.

Updated : 29 Feb 2024 05:52 IST

సమీపంలో మరో కొండ తవ్వుతున్న పొక్లెయిన్‌

‘జగనన్న కాలనీకి ఇక్కడ స్థలం కేటాయించారు. కొండ ప్రాంతంగా ఎత్తుపల్లాలను సరిచేస్తున్నాం. అరకొర మట్టి ఉంటే బయట జగనన్న లేఔట్‌ కాలనీలకు తరలిస్తున్నాం.’ అని గన్నవరం మండలం గొల్లనపల్లిలో ఓ వైకాపా నాయకుడు స్థానికంగా చెబుతున్న మాటలివి. ఇంతకీ ఆ గ్రావెల్‌ను తరలించిన లేఔట్‌ ఎక్కడ? అంటే ఆయన నోరు విప్పరు. పరిసరాల్లో యథేచ్ఛగా గ్రావెల్‌ తవ్వకాలు సాగిస్తున్నారు.

గొల్లనపల్లి(గన్నవరం గ్రామీణం), న్యూస్‌టుడే: గన్నవరం మండలం గొల్లనపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెం:88లో 491.16 ఎకరాల ప్రభుత్వ కొండ పోరంబోకు స్థలం ఉంది. స్థానిక ఆంజనేయస్వామి ఆలయానికి ఎడమ వైపు.. కొండ పోరంబోకు స్థలంలో కొన్నాళ్లుగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగుతున్నాయి. గ్రామానికి చెందిన ఓ వైకాపా నాయకుడు జగనన్న కాలనీ పేరుతో తవ్వకాలు సాగిస్తున్నారు. ‘జగనన్న కాలనీ గొల్లనపల్లి’ అని అక్కడ ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కానీ రెవెన్యూ యంత్రాంగం కనీసం సదరు లేఔట్‌ను గుర్తించలేదని ఆయా వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం. లేఔట్‌ గుర్తించకుండానే ఏకంగా ఆరు ఎకరాల్లోని మట్టి తరలించి రూ.కోట్లు సొమ్ము చేసుకున్నా.. అధికారులు కనీసం అటు చూడని పరిస్థితి. పగలంతా స్తబ్దుగా ఉంటూ.. రాత్రివేళల్లో జగనన్న కాలనీల మెరక చేస్తారా? అంటూ తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సర్వే నంబర్‌లో ఆలయానికి కుడి వైపు ఉన్న కొండను కూడా హనుమాన్‌జంక్షన్‌కు చెందిన మరో వ్యక్తి రాత్రి వేళల్లో తవ్వకాలు సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు యాభై ఎకరాల్లోని మట్టిని గత పది రోజులుగా విక్రయించి రూ.కోట్లు సొమ్ము చేసుకున్నట్లు నాయకులు ఆరోపించారు. అధికార వైకాపా ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో మైనింగ్‌, రెవెన్యూ అధికారులు కనీసం కన్నెత్తి చూడడం లేదంటున్నారు. పేదలకు స్థలాలివ్వడం మంచి విషయమే కానీ సరిచేసిన అనంతరం గ్రావెల్‌ ఎక్కడుందో నిర్వాహకులు, అధికారులు చూపించాలని తెదేపా శ్రేణులు డిమాండ్‌ చేస్తున్నారు. లేనిపక్షంలో అక్రమ తవ్వకాలపై కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని