logo

ఓట్ల దొంగలున్నారు.. జాగ్రత్త!

‘రాష్ట్రంలో ఓట్ల దొంగలున్నారు.. ప్రతి ఒక్కరూ చైతన్యులవాలి. మీరు ఓటేయకపోతే తిరుపతిలో జరిగినట్లు మీ ఓటూ చోరీ అయ్యే ప్రమాదముంది..’ అని రాష్ట్ర పూర్వ ఎన్నికలఅధికారి, సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 29 Feb 2024 05:20 IST

సీఎఫ్‌డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌

 కాకినాడ సదస్సులో మాట్లాడుతున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌.. చిత్రంలో అబ్బయ్య, వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ఐవీ రావు, ఉప్పలపాటి మాచిరాజు

ఈనాడు, కాకినాడ: ‘రాష్ట్రంలో ఓట్ల దొంగలున్నారు.. ప్రతి ఒక్కరూ చైతన్యులవాలి. మీరు ఓటేయకపోతే తిరుపతిలో జరిగినట్లు మీ ఓటూ చోరీ అయ్యే ప్రమాదముంది..’ అని రాష్ట్ర పూర్వ ఎన్నికలఅధికారి, సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కాకినాడలలో సీఎఫ్‌డీ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రస్థాయి కళాజాతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఓటు వేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం’ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా రమేశ్‌కుమార్‌ హాజరై ప్రసంగించారు. తిరుపతిలో 35 వేల దొంగ ఓట్లు సృష్టించడాన్ని చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. ఒక ఐఏఎస్‌ అధికారి, ఈఆర్వోను సస్పెండ్‌ చేస్తే సరిపోదని.. రాష్ట్రవ్యాప్తంగానూ దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికల కమిషన్‌ చర్యలు సంతృప్తికరంగా లేవని, దీని వెనుక ఎవరున్నారో విచారించి ఉక్కుపాదంతో అణచివేయకపోతే ఈ వైరస్‌ ఇతర రాష్ట్రాలకు పాకే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఓటర్ల వ్యక్తిగత సమాచారం ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించినప్పటికీ వారే తమకు అవసరమని, వారు క్రియాశీలంగా ఉండాలని ముఖ్యమంత్రి చెప్పడం తమ దృష్టికి వచ్చిందని రమేశ్‌కుమార్‌ చెప్పారు. వాలంటీర్లు బూత్‌ ఏజెంట్లుగానూ కూర్చోవచ్చని రెవెన్యూ మంత్రి పేర్కొనడం కమిషన్‌ ఆదేశాలు ధిక్కరించడమేనని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో  ప్రభుత్వ మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ప్రజా సంబంధమైన ప్రభుత్వం అధికారంలోకిరావడానికి ప్రజలు కృషి చేయాల్సి ఉందని అన్నారు. ఇక్కడి కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర గౌరవఅధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు, ఆదికవి నన్నయ్య వర్సిటీ మాజీ వైస్‌ఛాన్స్‌లర్‌ నిరూపరాణి, కంటిపూడి స్టీల్స్‌ అధినేత కంటిపూడి సర్వారాయుడు తదితరులు ఓటు హక్కు ఆవశ్యకతపై వివరించారు. కాకినాడ సమావేశంలో ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పూర్వ వీసీ ఐ.వి.రావు, సీఎఫ్‌డీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, సామాజిక ఉద్యమకారుడు ఉప్పలపాటి మాచిరాజు, జేఎన్‌టీయూకే విశ్రాంత ఆచార్యుడు జి.అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని