logo

బాధ్యత తప్పించుకొని.. పేద తల్లిదండ్రులపై భారం

విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రవేశాలు పొందిన పేద పిల్లల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేసే బాధ్యతను ప్రభుత్వం అధికారులకు అప్పగించింది. పేద పిల్లల ఫీజుల చెల్లింపు బాధ్యత నుంచి తప్పించుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు తల్లిదండ్రులపై ఒత్తిడి చేసి, ప్రైవేటు బడులకు డబ్బులు చెల్లించేందుకు చర్యలు చేపట్టింది.

Published : 29 Feb 2024 05:23 IST

ఆర్టీఈలో ప్రవేశాలు పొందిన పిల్లల ఫీజులు కట్టాలంటూ అధికారుల ఒత్తిడి
2023-24 అమ్మఒడి ఇవ్వకపోయినా డబ్బులు కట్టించాలని ప్రభుత్వం ఆదేశాలు

ఈనాడు, అమరావతి: విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రవేశాలు పొందిన పేద పిల్లల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేసే బాధ్యతను ప్రభుత్వం అధికారులకు అప్పగించింది. పేద పిల్లల ఫీజుల చెల్లింపు బాధ్యత నుంచి తప్పించుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు తల్లిదండ్రులపై ఒత్తిడి చేసి, ప్రైవేటు బడులకు డబ్బులు చెల్లించేందుకు చర్యలు చేపట్టింది. ఆర్టీఈ ద్వారా ప్రవేశాలు పొందిన పిల్లల ఫీజులను ప్రైవేటు బడులకు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలంటూ సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు ఆదేశాలు జారీచేశారు. జిల్లా విద్యాధికారులు, ఎస్‌ఎస్‌ఏ అదనపు ప్రాజెక్టు సమన్వయకర్తలు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజులను చెల్లించేందుకు మండల విద్యాధికారులకు గట్టిగా ఆదేశాలు ఇవ్వాలని హెచ్చరించారు. దీంతో వారు ఫీజులు కట్టాలంటూ తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు.

దేశంలో ఎక్కడా లేని దుస్థితి..

విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లను పేద పిల్లలకు కేటాయించాలి. ఇలా సీట్లు పొందినవారికి ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలి. దేశవ్యాప్తంగా ఆర్టీఈ అమలుచేస్తున్న అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలే ఫీజులు చెల్లిస్తున్నాయి. కానీ, జగన్‌ సర్కార్‌ మాత్రం అమ్మఒడి కింద ఇస్తున్న డబ్బుల్లోంచే ఫీజులు చెల్లించుకోవాలని గతేడాది ఉత్తర్వులు ఇచ్చింది. అమ్మఒడి డబ్బులు బ్యాంకు ఖాతాలో పడిన 60రోజుల తర్వాత కూడా  తల్లిదండ్రులు ఫీజులు చెల్లించకపోతే ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి, తర్వాత సంవత్సరం అమ్మఒడి నుంచి మినహాయించుకుంటుందని ఉత్తర్వుల్లో తెలిపింది.

  • 2023-24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం ఇంకా అమ్మఒడి డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు ఫీజులు చెల్లించాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తోంది. విద్యార్థుల 75% హాజరు తీసుకొని, విద్యా సంవత్సరం ముగింపులో అమ్మఒడి ఇస్తామని ప్రభుత్వమే చెబుతూనే మరోపక్క ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తోంది.
  • 2022-23 విద్యా సంవత్సరంలో ఫీజులు నిర్ణయించకుండా.. ఎవరు చెల్లించాలో స్పష్టత ఇవ్వకుండా ఆర్టీఈ కింద ప్రభుత్వం ప్రవేశాలు కల్పించింది. విద్యా సంవత్సరం ముగింపునకు వచ్చే సమయంలో ఫిబ్రవరిలో ఫీజులు నిర్ణయించి, అమ్మఒడి కింద వాటిని చెల్లించుకోవాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయం చాలామంది తల్లిదండ్రులకు తెలియలేదు. ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందనే ఉద్దేశంతో ఫీజులు చెల్లించలేదు.

కోత పెడుతూ.. భారం మోపుతూ..

అమ్మఒడి పథకం కింద ఇచ్చే రూ.15వేలను ప్రభుత్వం పూర్తిగా ఇవ్వడం లేదు. పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.2వేలు కోత వేస్తోంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్న ఒక్కరికే అమ్మఒడి ఇస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు బడులకు చెల్లించాల్సిన ఫీజులను అమ్మఒడి కిందనే చెల్లించుకోవాలంటూ తల్లిదండ్రులపై భారం పెట్టింది.

అమ్మఒడి రాకపోతే..

విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలు పొందుతున్న పేదల్లో కొందరికి అమ్మఒడి పథకం అందడం లేదు. ప్రభుత్వం సాంకేతిక కారణాలు చూపి, చాలామందిని అనర్హులుగా తేల్చింది. ఇలాంటివారూ ఆర్టీఈ కింద ప్రవేశాలు పొందారు. నిబంధనల ప్రకారం వీరి ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలి. అమ్మఒడి పథకం వర్తించేవారి వరకే ఆర్టీఈ గురించి ప్రభుత్వం ప్రస్తావించింది. మిగతావారి ఫీజుల భారం తల్లిదండ్రులపైనే వేసింది.

ఆర్టీఈ ఏం చెబుతోంది..

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టీఈ అమలుకు 2011 మార్చి 3న నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇందులోని నిబంధన-10లోని సబ్‌ రూల్‌-6 ప్రకారం ప్రైవేటు బడుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల తరపున ప్రభుత్వం రెండు విడతల్లో ఫీజులు చెల్లించాలి. ప్రైవేటు పాఠశాలల ప్రత్యేక బ్యాంకుఖాతాకు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ప్రతి ఏటా సెప్టెంబరులో 50% మొదటివిడత, జనవరిలో రెండోవిడత ఇవ్వాలి. కానీ, దీన్ని సవరించి.. ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తాన్ని అమ్మఒడి డబ్బుల నుంచి తల్లిదండ్రులు చెల్లించాలనే నిబంధనను ప్రభుత్వం చేర్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని