logo

సాఫ్ట్‌వేర్‌ రంగం.. భవితకు మార్గం

 ప్రపంచ సాంకేతిక పురోగతికి అనుగుణంగా విద్యార్థులు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావాలని, అప్పుడే మెరుగైన అవకాశాలు అందుకుంటారని మైక్రోసాఫ్ట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ బొల్లేపల్లి మాధవి అన్నారు. బుధవారం వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన ఎఫోసెక్‌-2024 జాతీయ స్థాయి టెక్నో ఫెస్టివల్‌లో ఆమె పాల్గొని పలు సూచనలు చేశారు.

Published : 29 Feb 2024 05:26 IST

ప్రసంగిస్తున్న మాధవి బొల్లేపల్లి

కానూరు, న్యూస్‌టుడే:  ప్రపంచ సాంకేతిక పురోగతికి అనుగుణంగా విద్యార్థులు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావాలని, అప్పుడే మెరుగైన అవకాశాలు అందుకుంటారని మైక్రోసాఫ్ట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ బొల్లేపల్లి మాధవి అన్నారు. బుధవారం వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన ఎఫోసెక్‌-2024 జాతీయ స్థాయి టెక్నో ఫెస్టివల్‌లో ఆమె పాల్గొని పలు సూచనలు చేశారు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ రంగం మన జీవితాలకు కేంద్రంగా మారిందన్నారు. ఇందులో రాణించాలంటే అవసరమైన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగు పరచుకోవాలన్నారు. కాగ్నిజెంట్‌ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ జితేందర్‌సింగ్‌ ప్రసంగిస్తూ ఏఐ నుంచి బ్లాక్‌చైన్‌ వరకు, పునరుత్పాదక శక్తి నుంచి అంతరిక్షం వరకు సాంకేతికత పరుగులు తీస్తోందని, దానికి తగిన పరిజ్ఞానం పొందాలన్నారు. ప్రిన్సిపల్‌ ఏవీ రత్నప్రసాద్‌ మాట్లాడుతూ వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యంగా దేశ ఆర్థికాభివృద్ధి, సాంకేతిక, సామాజిక పురోగతి, పర్యావరణ స్థిరత్వం తదితర అంశాలపై ఫెస్ట్‌లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన 1,500 మంది విద్యార్థులు పత్ర సమర్పణ, పోస్టర్‌ ప్రెజంటేషన్‌, ప్రాజెక్టు ఎక్స్‌పో తదితర 50 అంశాల్లో పోటీపడ్డారు. విజేతలకు నగదు బహుమతులు ప్రకటించారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన ఫ్లాష్‌ మ్యాబ్‌, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సీఎస్‌ఈ విభాగాధిపతి సీహెచ్‌ రాజేశ్వర రావు, సిద్ధార్థ అకాడమీ సెక్రటరీ పాలడుగు లక్ష్మణరావు, కన్వీనర్‌ మలినేని రాజయ్య, డీన్‌లు బావినేని పాండురంగారావు, ఎంవీఎస్‌రాజు, నర్రా రవికుమార్‌, ఆలపాటి వెంకటేశ్వర్లు, నాగరాజు, ప్రవీణ్‌, ఏవో సాయిబాబు తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.

మాట్లాడే స్మార్ట్‌ బాట్‌

రాజకీయ పార్టీ జెండాలతో అత్యుత్సాహం

ఎఫోసెక్‌-2024లో భాగంగా కళాశాల ప్రాంగణంలో జరిగిన ఫ్లాష్‌ మాబ్‌లో కొందరు విద్యార్థులు తెదేపా, వైకాపా, జనసేన జెండాలు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ, పోటాపోటీగా కేకలు వేస్తూ కవ్వించుకున్నారు. సమాచారం అందుకున్న ప్రిన్సిపల్‌ రత్నప్రసాదు వెంటనే స్పందించి అక్కడికి చేరుకొని వారిని మందలించారు. పార్టీల పతాకాలను సిబ్బంది లాగేసి పంపేశారు. అంతకుముందు మైదానంలో వైకాపా మద్దతుదారులు కార్లతో హల్‌చల్‌చేశారు. పైవంతైన నుంచి పార్టీ జెండాలు చూపుతూ రెచ్చగొట్టేందుకు యత్నించారు. కళాశాల అధ్యాపకులు రంగంలోకి దిగి వారిని తీవ్రంగా మందలించి పంపించేశారు.

రామాయణం ఘట్టాన్ని ప్రదర్శిస్తూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని