logo

కల్తీ మద్యం కేసులో మల్లాది విష్ణుకు విముక్తి

విజయవాడలో 2015లో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసులో నగర సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు విముక్తి లభించింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఈ కేసును కొట్టేసింది.

Updated : 29 Feb 2024 05:48 IST

కేసు కొట్టేసిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం

ఈనాడు - అమరావతి: విజయవాడలో 2015లో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసులో నగర సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు విముక్తి లభించింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఈ కేసును కొట్టేసింది. ఇందులో నిందితులు నిర్దోషులుగా బయటపడ్డారు. ఈమేరకు బుధవారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయాధికారి గాయత్రీదేవి తీర్పు ఇచ్చారు. ఈ ఘటనపై అప్పట్లో కృష్ణలంక పోలీసులు ఐపీసీ సెక్షన్లు 328, 304 రెడ్‌ విత్‌ 34తో పాటు ఎక్సైజ్‌ చట్టంలోని సెక్షన్‌ 37 కింద కేసు నమోదు చేశారు. ఆతర్వాత ఈ కేసును మహేష్‌చంద్ర లడ్హా నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌ దర్యాప్తు చేసింది. ఛార్జిషీట్‌లో ఐపీసీ 420, 272, 273, 284, 337, 120 (బి), 304 (ఏ) రెడ్‌ విత్‌ 304తో పాటు ఏపీ ఎక్సైజ్‌ చట్టంలోని సెక్షన్లు 36, 37 (ఏ), బినామీ లావాదేవీలు (నిరోధక) చట్టంలోని సెక్షన్‌ 3 (3) జోడించారు. ఈ కేసులో సిట్‌ 15 మందిని నిందితులుగా పేర్కొంది. 155 మందిని సాక్షులుగా అభియోగపత్రంలో చేర్చారు.

మద్యం తాగి ఆరుగురి మృతి: కృష్ణలంకలో స్వర్ణ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో 2015, డిసెంబరు 7న ఉదయం.. అదే ప్రాంతానికి చెందిన 29 మంది మద్యం తాగారు. వెంటనే వీరంతా పడిపోయారు. హుటాహుటిన వీరిని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. ఆరుగురు మరణించారు. వీరంతా కూలినాలి చేసుకుని జీవనం సాగించే వారే. మిగిలిన వారు తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొంది ఆ తర్వాత డిశ్ఛార్జి అయ్యారు. ఈ బార్‌ వైకాపాకు చెందిన విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే విష్ణుది కావడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి బార్‌లో భాగస్వాములుగా ఉన్న భగవంతుల శరత్‌చంద్ర, కావూరి పూర్ణచంద్ర శర్మ, కావూరి లక్ష్మీ సరస్వతి, మల్లాది బాల త్రిపుర సుందరమ్మలను ఏ1 నుంచి ఏ4గా చేర్చారు. విష్ణు తల్లి బాల త్రిపుర సుందరమ్మను ఏ4గా చేర్చారు. విష్ణును ఏ9గా, సోదరుడు మల్లాది శ్రీనివాస్‌ను ఏ10గా ఛార్జిషీట్‌లో చేర్చారు. మొత్తం నిందితుల్లో బాలా త్రిపురసుందరమ్మ, పొలాకి శ్రీనివాసరావు, పి.వెంకటరాజు, బి. శ్రీనులు మరణించారు. మద్యం నమూనాల్లో సైనేడ్‌ అవశేషాలు ఉన్నాయని హైదరాబాద్‌లోని ఏపీఎఫ్‌ఎస్‌ఎల్‌, మిథైల్‌ ఆల్కహాల్‌తోపాటు సోడియం సైనేడ్‌ ఉందని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ తమ నివేదికల్లో పేర్కొన్నాయి. ఈ కేసుల్లో అప్పట్లో మల్లాది విష్ణు అరెస్టు అయి జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు. సాక్షుల సంఖ్య భారీగా ఉన్నా.. నిరూపణ విషయంలో ప్రాసిక్యూషన్‌ విఫలమవడంతో న్యాయాధికారి కేసును కొట్టేశారు. దీంతో విష్ణుతో పాటు మరో పది మందికి విముక్తి లభించినట్లైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని