logo

సర్కిల్‌ దాటని విభజన

ప్రజల సౌకర్యార్థం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. పూర్తి స్థాయిలో సమస్యలను నేటికీ పరిష్కరించలేదు. విద్యుత్తు శాఖను ఇంకా విభజించకపోవడంతో వినియోగదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

Updated : 29 Feb 2024 05:47 IST

కొత్త జిల్లాలు వచ్చినా అతీగతీ లేదు

ఈనాడు, అమరావతి: ప్రజల సౌకర్యార్థం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. పూర్తి స్థాయిలో సమస్యలను నేటికీ పరిష్కరించలేదు. విద్యుత్తు శాఖను ఇంకా విభజించకపోవడంతో వినియోగదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు సంగతి అటుంచితే.. ప్రజల ఇబ్బందులు మాత్రం పెరిగాయి. వీరితోపాటు అధికారులు కూడా కొత్త కష్టాలను ఎదుర్కొంటున్నారు. పలు సేవలకు సంబంధించి జిల్లా కేంద్రం, సర్కిల్‌ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. సర్కిల్‌ పరిధి మూడు జిల్లాల్లో విస్తరించి ఉండడం గందరగోళానికి తెరతీస్తోంది. అదనపు వ్యయం, ఉద్యోగాల భర్తీని తప్పించుకునేందుకే ప్రభుత్వం సర్కిళ్లను జిల్లాలు యూనిట్‌గా విభజించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇంకా గందరగోళమే.. 2022 ఏప్రిల్‌లో పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలను పునర్‌ వ్యవస్థీకరించారు. ఈమేరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రాంతాలు మూడు జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. మచిలీపట్నం పార్లమెంటు పరిధిని కృష్ణా జిల్లాగా, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్‌ జిల్లాగా మార్చారు. ఏలూరు పార్లమెంటు పరిధిలోని నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలను విడదీసి ఏలూరు జిల్లాలో విలీనం చేశారు. గతంలో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే విద్యుత్తు సర్కిళ్లు ఏర్పాటయ్యాయి. చిన్న జిల్లాల ఏర్పాటుకు తగ్గట్లుగా అన్ని శాఖలను విభజించినా.. కీలకమైన విద్యుత్తు శాఖ విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. విజయవాడ సర్కిల్‌ సెంట్రల్‌ డిస్కమ్‌ పరిధిలో ఉంది. ఏలూరు జిల్లాలో విలీనమైన నూజివీడు, కైకలూరు పరిధి మాత్రమే సీపీడీసీఎల్‌ అజమాయిషీలో ఉంటుంది. ఆ జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలు ఈపీడీసీఎల్‌ పర్యవేక్షణలో ఉంటాయి. దీని వల్ల ఒకే జిల్లా రెండు డిస్కమ్‌ల పరిధిలోకి వెళ్లినట్లు అయింది. ఇది మరింత గందరగోళానికి తావిస్తోంది.

అన్నింటికీ ఇబ్బందులే..

కొత్త జిల్లాలు ఏర్పాటై రెండేళ్లు అవుతున్నా.. సర్కిల్‌ కేంద్రంగానే విద్యుత్తు శాఖలో పర్యవేక్షణ సాగుతోంది. జిల్లాల పరిధి ప్రకారం మూడు సర్కిళ్లుగా ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే.. ప్రజలకు మరింత ప్రయోజనం కలిగేది. కానీ.. ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఈ ఊసే ఎత్తడం లేదు. ఆయా జిల్లాల వినియోగదారులు, వారి అవసరాలకు తగ్గట్లు ఉద్యోగుల సంఖ్యను పెంచాల్సి ఉంది. కొత్త ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం పక్కనపెట్టేసింది. దీన్ని తప్పించుకునేందుకే విభజన జోలికి వెళ్లడం లేదు.  

  • కొన్ని రకాల విద్యుత్తు కనెక్షన్ల కేటగిరీ మార్చుకునేందుకు ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత కలెక్టర్‌ నుంచి తీసుకుని, ఆతర్వాత.. సర్కిల్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. ఇది వినియోగదారులకు ప్రయాసతో కూడిన పని. ప్రతి సోమవారం కలెక్టరేట్లలో జరిగే స్పందనలో ఫిర్యాదులు ఇస్తే.. అవి పరిష్కారానికి ఎస్‌ఈ కార్యాలయానికి వస్తున్నాయి. అక్కడి నుంచి సంబంధిత డివిజన్‌ కార్యాలయాలకు పంపడంతో సమయం వృథా అవుతోంది. ఆయా జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలకు ఎస్‌ఈ బదులు డివిజన్‌ అధికారులే వస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని