logo

ఓట్లు తర్వాత.. పట్టాలెప్పుడో చెప్పండి..!

‘విజయవాడ మధ్య నియోజకవర్గ ప్రజలకు నాలుగేళ్లలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేయలేకపోయిన.. పనులన్నీ ఈ కొద్దిరోజుల్లోనే తాను చేసేస్తానని.. పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు హడావుడి ఆరంభించారు.

Updated : 29 Feb 2024 05:46 IST

వెలంపల్లిని గట్టిగా నిలదీసిన మహిళలు
సీఎం పేరు చెప్పి జారుకున్న ఎమ్మెల్యే

న్యూరాజరాజేశ్వరిపేటలో శ్రీనివాసరావును ప్రశ్నిస్తున్న మహిళలు

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - మధురానగర్‌: ‘విజయవాడ మధ్య నియోజకవర్గ ప్రజలకు నాలుగేళ్లలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేయలేకపోయిన.. పనులన్నీ ఈ కొద్దిరోజుల్లోనే తాను చేసేస్తానని.. పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు హడావుడి ఆరంభించారు. తన సొంత నియోజకవర్గం పశ్చిమలోనే అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. ఏనాడూ పట్టించుకోని ఎమ్మెల్యే వెలంపల్లి.. పక్కనున్న మధ్య నియోజకవర్గాన్ని సంస్కరిస్తానని.. అధికారులతో కలిసి.. తాజాగా అధికారిక పర్యటనలు చేస్తూ.. వరాల జల్లులు కురిపించడం.. హాస్యాస్పదంగా మారింది. మధ్య నియోజకవర్గం 57వ డివిజన్‌ న్యూరాజరాజేశ్వరీపేటలో వేల మందికి వెంటనే ఇళ్ల పట్టాలిచ్చేస్తానని ఇంటింటికీ తిరుగుతూ హడావుడి చేయడంతో.. ఇవన్నీ ఉత్తుత్తి హామీలేనని ప్రజలకూ అర్థమవడంతో.. కొందరు మహిళలు వెలంపల్లిని గట్టిగా నిలదీశారు. దీంతో ఏం చెప్పాలో తెలియక.. ఆయన బిక్కమొహం వేయాల్సి వచ్చింది. మార్చి 11న సీఎం జగన్‌తోనే పట్టాలు ఇప్పిస్తాననీ... లేకుంటే తనకు ఓటు వేయవద్దని చెప్పి అక్కడి నుంచి జారుకున్నారు.

’విజయవాడ మధ్య నియోజకవర్గం న్యూరాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీలో వేల మంది ఇళ్ల పట్టాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. గత నాలుగేళ్లలో వైకాపా ప్రభుత్వం ఇదిగో అదిగో అని నెట్టుకొచ్చిందే తప్ప.. ఏనాడూ వీళ్లను పట్టించుకోలేదు. రెండు ప్రాంతాల్లో కలిపి ఎనిమిది వేల ఇళ్ల వరకూ ఉంటాయి. గతంలో 2018లో నామమాత్ర డబ్బులు కట్టించుకుని కొందరికి పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం.. నాలుగేళ్లుగా వీళ్లను పట్టించుకోలేదు. ఎన్నోసార్లు.. ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసినా.. స్పందించలేదు. ఎట్టకేలకు.. ఆరు నెలల కిందట మధ్య ఎమ్మెల్యే మల్లాది విష్ణు పట్టాలు ఇస్తామని స్థానికంగా శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత ఆయన కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు.. మరికొద్ది రోజుల్లో ఎన్నికల కోడ్‌ వస్తున్న నేపథ్యంలో.. పట్టాలు ఇస్తానని.. వెలంపల్లి ఓట్ల వేటను మొదలెట్టారు.

పట్టాల కోసం పట్టుబట్టారు...

న్యూరాజరాజేశ్వరిపేటలో ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తాననీ, తనకు ఓట్లు వేయాలని వెలంపల్లి బుధవారం ప్రచారం చేపట్టారు. దీంతో ఇద్దరు మహిళలు వెలంపల్లిని గట్టిగా నిలదీశారు. ఓటు ఎవరికి వేయాలో మాకు తెలుసు. ఆ సంగతి తర్వాత, ముందు పట్టాల గురించి తేల్చమని గట్టిగా అడగడంతో ఏం చెప్పాలో వెలంపల్లికి అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని.. సీఎం చేతుల మీదుగా ఇప్పించాకే తనకు ఓటేయమని.. శపథం చేసి మరీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. రెండు దశాబ్దాలుగా పట్టాల కోసం ఎదురుచూస్తుంటే.. ఇవ్వకుండా ఎన్నికల వేళ ఓట్ల కోసం వచ్చి.. మళ్లీ తమను బురిడీ కొట్టించాలని చూస్తున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ఈ పట్టాలను తాను ఇప్పిస్తానని.. ఆరు నెలల కిందట హడావుడి చేశారు. ఆయన వల్ల కాకపోవడంతో.. ఇప్పుడు తాను లబ్ధిపొందాలని వెలంపల్లి ప్రయత్నాలు ఆరంభించారు. ఏకంగా పట్టణ ప్రణాళిక ఇంజినీరింగ్‌ విభాగం, సచివాలయ సిబ్బందిని వెంటపెట్టుకుని వెళ్లి మరీ హామీలు గుప్పిస్తున్నారు. ఇంజినీరింగ్‌ విభాగం ఈఈ శ్రీనివాస్‌, డీఈ గురునాథం, ఏఈ అరుణ్‌కుమార్‌, నార్త్‌ తహసీల్దారు శంకర్‌బాబు, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ మోహన్‌బాబు సహా అధికారులందరినీ తన ప్రచారంలో భాగంగా వెలంపల్లి వెంట తిప్పుకొంటూ.. హడావుడి చేస్తున్నా.. ఇదంతా ఓట్ల కోసమేనంటూ.. జనం మాత్రం నమ్మడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని