logo

ఇంటర్‌ విద్యార్థులకు సీఎం సభ పరీక్ష

ఇంటర్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి దాదాపుగా  60 వేల మంది మొదటి ఏడాది విద్యార్థులు ఆ రోజు పరీక్ష రాయనున్నారు. అదే రోజు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమం సభ పామర్రులో జరగనుంది.

Published : 29 Feb 2024 05:35 IST

కానూరు, న్యూస్‌టుడే: ఇంటర్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి దాదాపుగా  60 వేల మంది మొదటి ఏడాది విద్యార్థులు ఆ రోజు పరీక్ష రాయనున్నారు. అదే రోజు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమం సభ పామర్రులో జరగనుంది. ఇప్పటికే పోలీసుల ఆంక్షలు ఉయ్యూరు, పామర్రులో కొనసాగుతున్నాయి. బందరు రోడ్డు మీదుగా సభకు వైకాపా నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పిల్లలు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోగలరా అన్న అనుమానాన్ని తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. పరీక్షా కేంద్రాలకు మొదటి రోజు గంట ముందుగానే విద్యార్థులు చేరుకొని గదులు, నంబర్లు చూసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి సమయంలో సీఎం సభ పెట్టడంపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విజయవాడ నగరం నుంచి బందరు రోడ్డు, కంకిపాడు, ఉయ్యూరు వరకు శ్రీచైతన్య, నారాయణ, ఇతర విద్యా సంస్థల్లో కేటాయించిన పరీక్షా కేంద్రాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. వీటిలో నగరానికి చెందిన వందలాది మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇప్పుడు ఈ సభకు వెళ్లే జనాలు, వాహనాలు, పోలీసుల ఆంక్షలను దాటుకొని విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరాలంటే నరకమే. సకాలంలో చేరుకోకపోతే ఏడాది పాటు చదివిన చదువు వృథా అవుతుందని విద్యార్థులు భయపడుతున్నారు. తమ పిల్లలకు ఓవైపు ఇంటర్‌ పరీక్ష, మరోవైపు సీఎం సభ పెద్ద పరీక్షగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని