logo

పండు చిక్కాడు

ఓ వేడుకలో యువకుడిపై బీరుసీసాతో దాడి చేసి పరారైన గ్యాంగ్‌వార్‌ కేసు ప్రధాన నిందితుడు రౌడీషీటర్‌ కోడూరి మణికంఠ అలియాస్‌ కేటీఎం పండు ఎట్టకేలకు జిల్లా పోలీసులకు చిక్కాడు. ఉయ్యూరు పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ జయసూర్య బుధవారం పండుతో పాటు అతని అనుచరుల అరెస్టు చూపించి కేసు వివరాలు వెల్లడించారు.

Published : 29 Feb 2024 05:36 IST

యువకుడిపై దాడి కేసులో అరెస్టు
నిఘా కొరవడి పేట్రేగిన రౌడీషీటర్‌

విజయవాడ, ఉయ్యూరు, న్యూస్‌టుడే: ఓ వేడుకలో యువకుడిపై బీరుసీసాతో దాడి చేసి పరారైన గ్యాంగ్‌వార్‌ కేసు ప్రధాన నిందితుడు రౌడీషీటర్‌ కోడూరి మణికంఠ అలియాస్‌ కేటీఎం పండు ఎట్టకేలకు జిల్లా పోలీసులకు చిక్కాడు. ఉయ్యూరు పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ జయసూర్య బుధవారం పండుతో పాటు అతని అనుచరుల అరెస్టు చూపించి కేసు వివరాలు వెల్లడించారు. వీరమ్మతల్లి తిరునాళ్ల సందర్భంగా ఈ నెల 25న ఓ విందు కార్యక్రమంలో నిందితుడు పండు   బీరుసీసా పగులగొట్టి సంతోష్‌ని గాయపర్చాడు. అనంతరం పండుతో పాటు ఆయా వర్గాలు విజయవాడకు పారిపోయారన్నారు. దీనిపై ఉయ్యూరు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి బుధవారం కంకిపాడు సమీపంలో పండును అదుపులోకి తీసుకున్నామని జయసూర్య తెలిపారు. ఇతనిపై గ్యాంగ్‌వార్‌, దొమ్మి, హత్యా, హత్యాయత్నం, గంజాయి వంటి కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. కంకిపాడు, ఉయ్యూరు పట్టణ సీఐలు శ్రీనివాసరావు, హబీబ్‌ బాషా, పట్టణ ఎస్‌.ఐ గణేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

పోలీసుల నిఘా వైఫల్యం...

పండు పెనమలూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సనత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. జిల్లాలు విభజన కాకముందు పెనమలూరు పోలీస్‌స్టేషన్‌ కూడా నగర కమిషనరేట్‌ పరిధిలో ఉండేది. దీంతో పండు గ్యాంగ్‌పై పోలీసుల నిఘా ఉండేది. జిల్లా విభజన తర్వాత పెనమలూరు పోలీస్‌స్టేషన్‌ కృష్ణ జిల్లా ఎస్పీ పరిధిలోకి వెళ్లినప్పటి నుంచి పండు ఆగడాలు ఎక్కువయ్యాయి. పోలీసులు కనీసం నిఘా ఏర్పాటు చేయకపోవడంతో పండు తన ఇంట్లో అక్రమంగా తుపాకీ ఉంచినట్లు స్థానికులు చెబుతున్నారు. తన కారులో కూడా నిత్యం కత్తులు ఉంచుకుంటాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

రీల్స్‌ చేస్తూ....బెదిరిస్తూ..

పోలీసులను బెదిరిస్తూ, కత్తులు పట్టుకుని రీల్స్‌ చేయడం పండు నైజం. వాటిని తన అనుచరుల ద్వారా సామాజిక మాధ్యమాల్లో పెట్టిస్తాడు. తన కారుకు ముందు ద్విచక్ర వాహనాలతో యువకులు ఎస్కార్ట్‌గా ఉంటారు. స్థానికంగా ఉండే యువకులకు గంజాయి అలవాటు చేసి వారిని తన వెంట తిప్పుకుంటాడని పోలీసుల దర్యాప్తులో సైతం తేలింది.

ఏకు మేకయ్యాడు..

సాధారణంగా తరుచూ గొడవలు, అల్లర్లుకు పాల్పడుతున్న వారిపై పోలీసులు నిత్యం నిఘా పెడుతుంటారు. అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన గ్యాంగ్‌వార్‌ కేసులో పండు ప్రధాన నిందితుడు. ఇతనిపై పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌లో రౌడీ షీట్‌ ఉంది. హత్య, హత్యాయత్నం, దాడులు, దొమ్మీలు, గంజాయి, అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం లాంటి అనేక కేసులు నమోదు అయ్యాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే పోలీసులు హడావుడి చేసి అరెస్టు చేయడం.. జైలు నుంచి మళ్లీ బయటకు రాగానే అతను తన కార్యకాలాపాలను సాగిస్తూ పోలీసులకు ఏకు మేకు అవుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని