logo

నమ్మకం లేకనే అమ్మకం..!

జి.కొండూరు మండలంలో జాతీయ రహదారి సమీపంలో జగనన్న లే ఔట్‌ వేశారు. అక్కడ సెంటు స్థలాల వ్యాపారం జోరుగా సాగుతోంది. సెంటు స్థలం రూ.2.5 లక్షలకు కొంటున్నారు. లబ్ధిదారుల పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేశాక ఆ డాక్యుమెంట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు తీసుకుని ఒప్పందాలు రాసుకుంటున్నారు.

Updated : 29 Feb 2024 10:05 IST

ఇదే అదనుగా రంగంలోకి దళారులు
స్థిరాస్తి కేంద్రాలుగా జగనన్న కాలనీలు
ప్లాటుకు 10% కమీషన్‌...

వెలగలేరు లేఔట్‌ ఇలా..

జి.కొండూరు మండలంలో జాతీయ రహదారి సమీపంలో జగనన్న లే ఔట్‌ వేశారు. అక్కడ సెంటు స్థలాల వ్యాపారం జోరుగా సాగుతోంది. సెంటు స్థలం రూ.2.5 లక్షలకు కొంటున్నారు. లబ్ధిదారుల పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేశాక ఆ డాక్యుమెంట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు తీసుకుని ఒప్పందాలు రాసుకుంటున్నారు.

  • విజయవాడ తూర్పు నియోజకవర్గవాసి లక్ష్మి.. ఇళ్లలో పనులు చేసి జీవిస్తోంది. భర్తకు అనారోగ్యం. కుటుంబభారం ఆమెదే. తనకు జగనన్న కాలనీ కింద సెంటు స్థలం పెనమలూరు మండలం వణుకూరులో కేటాయించారు. అంతదూరాన ఇల్లు కట్టే పరిస్థితి లేదు. ప్రభుత్వం కట్టించి ఇవ్వడం లేదు. ఇచ్చినా.. అక్కడ ఉంటే ఉపాధి లభించదు. దీంతో తనకు కేటాయించిన స్థలాన్ని రూ.3.5 లక్షలకు వేరే వారికి అమ్మేసింది.
  • విజయవాడకు సమీప నున్నలో గన్నవరం పరిధి గ్రామీణ పేదల కోసం లే ఔట్‌ వేశారు. దాదాపు 4,500 స్థలాలుగా విభజించారు. ఇక్కడ ఒక సెంటు చొప్పునే ఇచ్చారు. ఇక్కడ స్థలాల విక్రయానికి దళారులు పుట్టుకొచ్చారు. ఒక్కో స్థలం ఇప్పటికే రెండు మూడు చేతులు మారింది. లింకు డాక్యుమెంట్లు స్థానే ఒప్పంద పత్రాలు (స్టాంపు పత్రాలు) చేతులు మారుతున్నాయి.

ఈనాడు, అమరావతి: నిరుపేదలకు గూడు కల్పిస్తున్నామనీ.. ఇళ్లు కాదు.. ఊళ్లకు ఊళ్లే కడుతున్నామని వైకాపా నాయకులు మొదలు సీఎం వరకు ఊదరగొడుతున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన నిధులతో నిర్మిస్తున్న ఈ కాలనీలకు జగనన్న పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ లేఔట్‌లు స్థిరాస్తి దళారుల పాలవుతున్నాయి. రూ.కోట్ల వెచ్చించి కొన్న స్థలాల్లో పేదల స్థానంలో పెద్దలు చొరబడుతున్నారు. ఎక్కువ శాతం అనర్హులకు స్థలాలు అందగా వారు వీటిని అమ్మేస్తున్నారు. కొందరు దూరాభారం భరించలేక, ఉపాధి లేక, ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే సొమ్ము చాలక అమ్ముతున్నారు. ఇప్పటికే 50 శాతం చేతులు మారాయి. ఎక్కువ శాతం అర్బన్‌, సెమీ అర్బన్‌ ప్రాంతాలకు సమీప లే ఔట్లలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. పక్కపక్కనే ఉన్న స్థలాలను కొని సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం లబ్ధిదారుల పేరుమీద రిజిస్ట్రేషన్‌లు జరిగినా తర్వాత హక్కులు వస్తాయని ఆశ కల్పిస్తున్నారు. వాస్తవానికి చేతులు మారిన స్థలాలను రద్దు చేయాలి. అధికారులకు తెలిసినా మౌనంగా ఉంటున్నారు.

  • విజయవాడ, మచిలీపట్నం నగరపాలికలు, పలు పురపాలక సంఘాల పరిధిలో భారీ లే ఔట్లు వేశారు. రెండు జిల్లాల్లో 303 లే ఔట్లు ఉన్నాయి. బందరులో 10 వేల గృహాలతో అతిపెద్ద లే ఔట్‌ వేశారు. వెలగలేరులోనూ ఎనిమిది వేల గృహాలతో వేస్తున్నారు. నున్నలో 4,500 గృహాలకు లే ఔట్‌ వేశారు. కొండపావులూరు,. వణుకూరు, గొడవర్రు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలం ముత్యాలంపాడు, కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు, గుడివాడ, పెడన, అవనిగడ్డ, ఉయ్యూరులోనూ పెద్ద లేఔట్లు ఉన్నాయి.
  • విజయవాడకు సమీప నున్న, వణుకూరు లే ఔట్‌లో రూ.3.5 నుంచి 4 లక్షల వరకు, గన్నవరం మండలం కొండపావులూరు, వెదురుపావులూరులో రూ.3 లక్షల వరకు, ఇబ్రహీంపట్నం వద్ద రూ.5 లక్షల ధర పలుకుతోంది.
  • దళారులు బేరసారాలు చేసి వారు ఒక ప్లాట్‌కు పది శాతం కమీషన్‌ తీసుకుంటున్నారు. ఎక్కువ డిమాండ్‌ ఉంటే రూ.50 వేలు బాదేస్తున్నారు.
  • నున్న లే ఔట్‌లో 4,500 గృహాలకు.. 500 వరకు విక్రయాలు జరిగాయి. కొండపల్లి లే ఔట్‌లో 1,200 గృహాలు కడుతున్నారు. ర¢ూ.5 లక్షలకు విక్రయిస్తున్నారు.
  • కొందరు ఇళ్లు కట్టుకున్నా.. ఆవాసానికి అనువుగా లేవు. తాగునీరు, దారులు, కాలువలు, విద్యుత్తు వసతులు లేక తాళాలు వేస్తున్నారు. వీటిని చూసి ఇతర లబ్ధిదారులు వ్యయ ప్రయాసలు భరించడం కట్టడం కంటే విక్రయించడం మేలని భావిస్తున్నారు.
  • పెనమలూరు వణుకూరులో ఎకరం రూ.80 లక్షలకు కొని పేదలకు పంచితే.. ఇప్పుడవి స్థిరాస్తి వ్యాపారుల చేతుల్లోకి వెళుతున్నాయి. సెంటు రూ.3 లక్షలకు అమ్మడం గమనార్హం. నివేశన స్థలాల విక్రయం నేరమని భారీ ఫ్లెక్సీలు పెట్టిన రెండో రోజే వాటిని తొలగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు