logo

పేదల కాలనీల్లో.. పెద్దలు చేరారు!

వెలగలేరులో దారీ తెన్నూ లేని ప్రాంతంలో లేఔట్‌ వేశారు. అక్కడ  పేదలు ఇల్లు కట్టుకోలేక సతమతమవుతున్నారు. కొంతమంది స్థలాలను తక్కువ ధరకే విక్రయించుకుంటున్నారు. కొండపావులూరు, వెదురుపావులూరు లేఔట్లు దూరంగా ఉన్నాయి.

Updated : 01 Mar 2024 05:06 IST

అనర్హుల చేతుల్లో జగనన్న ఇళ్లు
ఈనాడు, అమరావతి

గుడివాడ జగనన్న కాలనీలో ఇలా

వెలగలేరులో దారీ తెన్నూ లేని ప్రాంతంలో లేఔట్‌ వేశారు. అక్కడ  పేదలు ఇల్లు కట్టుకోలేక సతమతమవుతున్నారు. కొంతమంది స్థలాలను తక్కువ ధరకే విక్రయించుకుంటున్నారు. కొండపావులూరు, వెదురుపావులూరు లేఔట్లు దూరంగా ఉన్నాయి.

ఈ చిత్రం పరిశీలించారా..? ఇది ఏదో స్థిరాస్తి వ్యాపారులు నిర్మాణం చేస్తున్న డూప్లెక్సు ఇళ్లనుకుంటే పొరపాటే. నిరుపేదలకు కేటాయించిన జగనన్న కాలనీనే. కాకపోతే వీరు పేదలా కాదా..? అనేది ఈ కట్టడాలు చూస్తే తెలుస్తుంది. గుడివాడలో అర్బన్‌ లేఔట్‌ స్థలంలో ఎక్కువ శాతం రెండు మూడు అంతస్తులు నిర్మిస్తున్నారు. కనీసం రూ.20లక్షలు తక్కువ కాకుండా వెచ్చిస్తున్నారు. ఒకరా ఇద్దరా.. పదుల సంఖ్యలో ఇలా నిర్మాణాలు చేస్తున్నారు.

చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూరినట్లు జగనన్న కాలనీల్లోకి శ్రీమంతులు దూరారు. జిల్లాలో పేదలకు గూడు కల్పించామని చెబుతున్న వైకాపా నేతల మాటలకు, నిర్మాణాలకు పొంతన లేకుండా పోయింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే పేదల స్థలాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానంగా అయిదు సూత్రాల కిందకు రావాల్సి ఉంది. సొంత నివాస భవనం ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ అయి ఉండకూడదు. ఆదాయ పన్ను పరిధిలో ఉండకూడదు. నెలకు 300 యూనిట్ల విద్యుత్తు వినియోగం పరిధిలో ఉండకూడదు. కారు, ఇతర పెద్ద వాహనాలు ఉండకూడదు. అలాంటి పేదలే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు అర్హులు. వీటి పరిధిలో ఉన్న వారికి సంక్షేమ పథకాల వడపోత కార్యక్రమాలు చేపట్టారు. దీని ఆధారంగా జగనన్న కాలనీ పేరుతో నివేశన స్థలాలు పంచారు. అర్హులకు పట్టణ పరిధిలో వారికి సెంటు, గ్రామీణ పరిధిలో వారికి సెంటున్నర చొప్పున కేటాయించారు. వాటిలో అత్యధికంగా అనర్హుల చేతుల్లోకి వెళ్లాయి. కొన్ని తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో దక్కించుకోగా కొన్ని పేదల పేరుతో స్వాధీనం చేసుకున్నారు. వందల ఎకరాలు రూ.కోట్లు వెచ్చించి సేకరించి అనర్హులకు కట్టబెట్టారు. కొన్ని లేఔట్లలో నిర్మాణం చేస్తున్న ఇళ్లే దీనికి సాక్ష్యం. ఒకవైపు పేదల ఇళ్లు పునాదులకే పరిమితం కాగా.. స్థితిమంతులు తమ ఇళ్లపై రెండు మూడు అంతస్తులు నిర్మాణం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే సాయం సరిపోక అప్పులు చేస్తున్నారు. మరోవైపు ధనవంతులు ఆకర్షణీయంగా అదనపు హంగులతో నిర్మాణం చేస్తున్నారు. కాలనీల్లో మౌలిక వసతులు లేక ఎవరూ నివాసాలు మాత్రం ఉండడం లేదు.

వణుకూరు లేఔట్‌లో..

  • పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలో వ్యవసాయ భూములను ఎకరం రూ.80లక్షలకు కొనుగోలు చేసి లేఔట్‌ వేశారు. ఇక్కడ దాదాపు 300 ఎకరాలు సేకరించారు. ఎకరానికి రూ.15 లక్షల వరకు నేతలకే కమీషన్లు అందాయనేది బహిరంగ రహస్యం. ఇక్కడ కొంత మంది సెంటు స్థలంతో పాటు పక్క స్థలాలు కొనుగోలు చేసి రెండు అంతస్తులు నిర్మాణం చేశారు. ఒక వీధి మొత్తం ఇలా కనిపిస్తోంది.
  • విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని మూడు నియోజకవర్గాల వారికి వివిధ ప్రాంతాల్లో లేఔట్లను వేశారు. నిజమైన నిరుపేదలు అక్కడ ఇంటిని కట్టుకోలేక అమ్ముకున్నారు. వాటి స్థానంలో పెద్దపెద్ద భవంతులు నిర్మాణం చేస్తున్నారు.
  • ఇబ్రహీంపట్నంలో పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పేదలకు ఇళ్లను కేటాయించారు. జాతీయ రహదారి సమీపంలో ఉండడంతో దాదాపు 50 శాతం నిర్మాణాలు రెండు అంతస్తులు వేస్తున్నారు. అనర్హుల చేతుల్లోకి ప్లాట్లు వెళ్లాయి. కేవలం అమ్మకాలు సాగించవద్దని నామమాత్రపు హెచ్చరిక బోర్డులు పెట్టి అధికారులు మౌనంగా ఉంటున్నారు.

ఈ చిత్రం చూశారా..! నిర్మాణంలో ఉన్న ఈ ఇంటికి యజమాని వాలంటీరు. నున్న జగనన్న కాలనీలో కేటాయించిన సెంటు స్థలంలో ఏకంగా రెండు అంతస్తుల నిర్మాణం చేస్తున్నారు. కింద దుకాణం పెట్టేందుకు వీలుగా షట్లర్లు ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా సెంటు స్థలంలో ఇంటి నిర్మాణానికి రూ.8లక్షలు వ్యయం అవుతోంది. రెండు అంతస్తులకు దాదాపు రూ.15లక్షలు హీనపక్షం కావాల్సి ఉంది. జగనన్న కాలనీలో ప్రభుత్వం ఇచ్చిన ఇంటి ఆకృతికి ఈ నిర్మాణం భిన్నం. ఇదే కాదు ఇలా చాలా మంది నిర్మాణం చేస్తున్నారు. పేదల ముసుగులో స్థలాలను దక్కించుకున్న పలువురు నేతలు ఇలా నిర్మాణాలు చేస్తున్నారు.

ధనవంతులే..

  • పట్టణాలకు సమీపంలో వేసిన లేఔట్లలో స్థితిమంతులకు ఎక్కువగా దక్కాయి. అనర్హులకు నివేశన స్థలాలు కేటాయించారు. విచారణ జరిపితే.. సగô మంది అనర్హుల జాబితాలో ఉంటారని చెబుతున్నారు.
  • ఎన్టీఆర్‌ జిల్లాలో 183, కృష్ణా జిల్లాలో 280 వరకు లేఔట్లు ఏర్పాటు చేశారు. బందరులో ప్రారంభించిన కరగ్రహారం అతిపెద్ద లేఔట్‌గా ఉంది. దాదాపు 8వేల మందికి కేటాయించారు. ఇక్కడ ప్రభుత్వ భూమి కొంత, ప్రైవేటు భూమి కొంత సేకరించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని