logo

తెదేపా-జనసేనతోనే రాష్ట్రాభివృద్ధి

తెదేపా-జనసేన కూటమి అధికారంలోకి రావడం రాష్ట్రానికి ఎంతో అవసరమని గన్నవరం నియోజకవర్గ కూటమి ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు.

Published : 02 Mar 2024 04:09 IST

యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి దంపతులతో ఐక్యత చాటుతున్న మహిళా నాయకులు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: తెదేపా-జనసేన కూటమి అధికారంలోకి రావడం రాష్ట్రానికి ఎంతో అవసరమని గన్నవరం నియోజకవర్గ కూటమి ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం గన్నవరంలోని ఏబీ కనెక్షన్‌లో తెలుగు మహిళల ఆధ్వర్యంలో తెలుగు మహిళలు-జనసేన వీరమహిళలతో ‘మీతో మీ నాయకుడు’ కార్యక్రమం నిర్వహించారు. వెంకట్రావు మాట్లాడుతూ..  ఎక్కడ చూసినా అరాచకాలు.. దాడులు.. కవ్వింపు చర్యలు తప్ప.. మరేమీ లేవన్నారు. యువత ఉద్యోగం, మహిళలకు రక్షణ, వ్యవసాయం, వాణిజ్యం ఇతర అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. వైకాపా మరోమారు గద్దెనెక్కడం కోసం దొంగ ఓట్లు, ఇతరత్రా ఎన్నో విధాలుగా ఓటర్లను ప్రలోభ పెడుతోందన్నారు. గన్నవరం నియోజకవర్గంలో కూడా నకిలీ ఇళ్ల పట్టాలు, దుస్తులతో మరోమారు ప్రజలను తప్పుదోవ పెట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నాలు మొదలు పెట్టారన్నారు. తల్లి లాంటి తెదేపా అధినేత సతీమణిపై అసభ్యకరంగా మాట్లాడిన శాసన సభ్యుడికి ఓటుతోనే బుద్ధి చెప్పాలన్నారు. యార్లగడ్డకు ఓట్లేసి గెలిపించాలని వెంకట్రావు సతీమణి జ్ఞానేశ్వరీ కోరారు. విశ్రాంత అధ్యాపకులు మద్దుకూరి విజయకుమార్‌, స్వర్ణకుమారిల పాట ఎంతో ఆకట్టుకోగా.. సీబీఎన్‌ ఫోరం సుమిత, ప్రసన్న, ఫణి, తెలుగుమహిళా నాయకులు తలశిల స్వర్ణలత,  మేడేపల్లి రమాదేవి, చిక్కవరపు నాగమణి, మండవ రమ్యకృష్ణ, తుపాకుల శివలీల, పొదిలి లలిత, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, పెద్దసంఖ్యలో వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.


విజయాన్ని కానుకగా ఇస్తాం..

వైకాపా పాలనలో ప్రతిఒక్కరూ అసంతృప్తితో ఉన్నారు. ఓట్లు వేసి గెలిపించిన మమ్మల్నే ప్రస్తుత అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యే వంశీమోహన్‌ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. పార్టీ కార్యాలయం, నాయకుల ఇళ్లపై, భౌతిక దాడులకు పాల్పడ్డారు. అసెంబ్లీ సాక్షిగా అధినేత చంద్రబాబు సతీమణిని అవమానించిన అతడిని వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమాధి చేసేందుకు మహిళలంతా సిద్ధంగా ఉన్నారు. గన్నవరంలో తెదేపా జెండా ఎగురవేసి విజయాన్ని చంద్రబాబుకు కానుకగా సమర్పిస్తాం.

మూల్పూరి సాయికల్యాణి, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


చంద్రబాబు కోసం ఎదురు చూస్తున్నాం..

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారా? అని మహిళలంతా ఎదురుచూస్తున్నారు. వైకాపా ప్రభుత్వంలో రోడ్లు లేవు.. ఉద్యోగాలు రావు.. పనులు దొరకవు.. ఇలా ఏమిచేయాలో అర్థంకాక వ్యాపారులు, వ్యవసాయ రైతులు, ప్రతిఒక్కరూ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈ సర్కారు ఎంత త్వరగా మారుతుందా అని వేచిచూస్తున్నారు. యార్లగడ్డ వెంకట్రావును గన్నవరంలో అఖండ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపుతాం.

మండవ లక్ష్మి, తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు