logo

ఓటుతోనే ప్రజాస్వామ్యానికి ఊపిరి

గతి తప్పిన వ్యవస్థలతో ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఓటరు విజ్ఞతతో ఆలోచించాలని ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి, సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఉపాధ్యక్షుడు ఎల్వీ సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు.

Published : 02 Mar 2024 04:14 IST

మాట్లాడుతున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం, వేదికపై ఫోరం సంయుక్త కార్యదర్శి లక్ష్మణరెడ్డి తదితరులు

కలెక్టరేట్‌(మచిలీపట్నం): గతి తప్పిన వ్యవస్థలతో ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఓటరు విజ్ఞతతో ఆలోచించాలని ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి, సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఉపాధ్యక్షుడు ఎల్వీ సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కళాజాతాలో భాగంగా శుక్రవారం మచిలీపట్నం పద్మావతి మహిళా కళాశాలలో  నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం చట్ట సభలకు ఎన్నికవుతున్న వారిలో అధికశాతం మంది వాటి హుందాతనాన్ని దిగజార్చేలా చేయడం దురదృష్టకరమన్నారు. ప్రస్తుత సమాజంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ లేదని, తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని ప్రశ్నించే పరిస్థితులు లేకుండా పోయాయని వాపోయారు. ప్రజలకు సమాన హక్కులు లేవని, ఇసుక దోపిడీ, మద్యం మాఫియా, సహజ వనరులను కొల్లగొట్టడం, చెట్లు నరికివేయడం వంటి అకృత్యాలు నిత్యకృత్యంగా మారిపోవడం బాధాకరమన్నారు. చట్టసభల్లో చట్టాల రూపకల్పన విషయంలో ఏమాత్రం అవగాహన లేని నాయకులు ప్రజలు తమకిచ్చిన అధికారాన్ని వ్యక్తిగత ధనార్జన, తమకు అనుకూలంగా వ్యవహరించని అధికారులను బెదిరించడం, బదిలీ చేయించడం వంటి చర్యలకు పరిమితం అవుతున్నారన్నారు. రాష్ట్రంలో ఓటు దొంగలున్నారని, ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును పరిశీలించుకోవడంతో పాటు ఏ బూత్‌లో తాము ఓటు వేయాలన్న విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలన్నారు. ఏదైనా తేడా గుర్తిస్తే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుదిజాబితా విడుదల వరకూ తమ అభ్యంతరాలను జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి సరిచేయించుకోవచ్చని తెలిపారు. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రే స్వయంగా వాలంటీర్లను ఎన్నికల సైన్యంగా, పోలింగ్‌ ఏజెంట్లుగా వాడుకోవాలని భావించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడవడమేనన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని