logo

సామాన్యులకు చేరువగా మహాశతావధానం

సామాన్యులకు చేరువైన శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం అందరి మన్ననలు పొందిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు అన్నారు.

Published : 02 Mar 2024 04:16 IST

నాగఫణిశర్మను సత్కరించి అమ్మవారి చిత్రపటం ఇస్తున్న జస్టిస్‌ దుర్గాప్రసాదరావు, పక్కన ఈవో రామారావు, రాంబాబు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే : సామాన్యులకు చేరువైన శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం అందరి మన్ననలు పొందిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఐదు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం శుక్రవారంతో ముగిసింది. 126 మంది పండితులు జగన్మాత దుర్గమ్మకు సంబంధించి ఇంద్రకీలాద్రి వైభవం, దసరా ఉత్సవాల్లో ఉగ్రరూపం, శాంత రూపం విశిష్టత, అమ్మను నమ్ముకొంటిని వంటి అంశాలపై ప్రశ్నలు సంధించగా సహస్రావధాని నాగఫణిశర్మ అలవోకగా గేయ, పద్య రూపంలో సమాధానాలు ఇచ్చి సాహితీప్రియులను, సామాన్యులను అలరించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ ఐదు రోజులపాటు తెలుగు సాహితీ ప్రియులు, పండితులు, అమ్మవారి భక్తులు, విద్యార్థులు ఆవధాన ప్రక్రియలో పాల్గొనడం స్వర్ణయుగంగా భావించాలన్నారు. సహస్రావధాని నాగఫణి శర్మ మాట్లాడుతూ ఐదు రోజుల్లో 30 దత్తపదులు, 30 వర్ణనలు, 30 సమస్యలు ఆశువులతో శతావధానం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిందన్నారు. సాంస్కృతిక రాజధాని పేరును సార్ధకం చేస్తూ శతావధానాన్ని ఆదరించడం పూర్వజన్మ సుకృతం అన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ, దుర్గగుడి ట్రస్టుబోర్డు, అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పుట్టపర్తి వారి శివ తాండవగానం చేయాలని న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు కోరగా నాగఫణి శర్మ జనరంజకంగా ఆలపించారు. అవధాన ప్రక్రిలో పాల్గొన్న పృచ్ఛకులను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో దుర్గగుడి ఈవో రామారావు, ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ రామారావు, ఈఈ కోటేశ్వరరావు, రమాదేవి, స్థానాచార్య శివప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు శంకరశాండిల్య, యజ్ఞనారాయణశర్మ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని