logo

త్వరలో అందుబాటులోకి కార్గో సేవలు

మరో రెండు నెలల్లో విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు అందుబాటులోకి తెస్తామని విమానాశ్రయ డైరెక్టర్‌ ఎం.లక్ష్మీకాంతరెడ్డి పేర్కొన్నారు.

Published : 02 Mar 2024 04:18 IST

సమావేశంలో చర్చిస్తున్న డైరెక్టర్‌ లక్ష్మీకాంతరెడ్డి, హాజరైన ప్రతినిధులు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మరో రెండు నెలల్లో విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు అందుబాటులోకి తెస్తామని విమానాశ్రయ డైరెక్టర్‌ ఎం.లక్ష్మీకాంతరెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని ఏపీ ఛాంబర్స్‌ సమావేశ మందిరంలో వ్యాపార, వర్తక సంస్థల ప్రతినిధులతో ‘పరస్పర చర్చ’ (ఇంటరాక్టివ్‌ మీటింగ్‌) సమావేశం శుక్రవారం జరిగింది. లక్ష్మీకాంతరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అతి వేగంగా విజయవాడ విమానాశ్రయం అభివృద్ధి చెందుతోందన్నారు. ‘ఈ విమానాశ్రయానికి విశాలమైన భూమి, అతి పెద్ద రన్‌వే ఉంది. ఇక్కడ 22 విమానాలు పార్కింగ్‌ చేసుకోవచ్చు. ఎంత అభివృద్ధి చెందినా.. సరిపడా వనరులు ఇక్కడ ఉన్నాయి. రూ.500 కోట్లతో బిల్డింగ్‌ నిర్మాణాలు జరుగుతున్నాయి. నిర్మాణంలో ఉన్న భవనాలు నవంబరు నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తాం. విజయవాడ విమానాశ్రయం నుంచి రోజూ 18 విమానాలు దేశవాళీగా, వారానికి రెండుసార్లు షార్జాకు ఎయిర్‌లైన్‌ సదుపాయం ఉంది. విజయవాడ నుంచి సింగపూర్‌, దుబాయి, శ్రీలంక, థాయిలాండ్‌ పర్యటనకు వెళ్లేందుకు వీలుగా ఎయిర్‌లైన్స్‌ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందుకు పలు ఎయిర్‌లైన్సుకు ఇది వరకే వినతులు అందించామన్నారు. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి విజయవాడకు కార్గో సదుపాయం ఉన్నా.. ఇక్కడ నుంచి కార్గో సదుపాయం లేదు.. మన వద్ద కూడా కల్పిస్తే విజయవాడ నుంచి వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసుకునే వీలుందని ట్రావెలర్‌ యాజమాన్య సంఘ ప్రతినిధి సూచించగా.. మరో రెండు నెలల్లో కార్గో సేవలు అందుబాటులోకి తెస్తామనీ.. తద్వారా విమానాశ్రయానికి కూడా ఆదాయం పెరుగుతుందన్నారు. అలాగే.. విజయవాడ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించేవారికి ప్రయాణికులకు సౌకర్యాలు అంతంతగానే ఉన్నాయని ఓ వ్యక్తి విన్నవించగా.. ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా వసతులు, ఏర్పాట్లకు కృషి చేస్తున్నామన్నారు. సమావేశానికి హాజరైన హోటల్స్‌, ట్రావెల్స్‌, బిల్డర్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని