logo

ఇంటర్‌ విద్యార్థులకు ట్రాఫిక్‌ పరీక్ష

ఇంటర్‌ విద్యార్థులకు ట్రాఫిక్‌ పరీక్షలు తప్పడం లేదు. శుక్రవారం నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. కళాశాలల బస్సులు, ద్విచక్రవాహనాలపై పరీక్షలకు వెళ్లే వారితో రోడ్లన్నీ రద్దీగా మారాయి.

Published : 02 Mar 2024 04:22 IST

పరీక్ష ముగిసిన సమయంలో బెంజి సర్కిల్‌లో నిలిచిన వాహనాలు

పటమట, న్యూస్‌టుడే: ఇంటర్‌ విద్యార్థులకు ట్రాఫిక్‌ పరీక్షలు తప్పడం లేదు. శుక్రవారం నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. కళాశాలల బస్సులు, ద్విచక్రవాహనాలపై పరీక్షలకు వెళ్లే వారితో రోడ్లన్నీ రద్దీగా మారాయి. ప్రధానంగా నగర శివారు ప్రాంతాలైన నిడమానూరు, గూడవల్లి వైపు ఎక్కువగా పరీక్ష కేంద్రాలు ఉండడంతో తల్లిదండ్రులతో కలిసి ఉదయం 8 గంటల నుంచి ఆయా కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు. ఆ సమయానికి కేంద్రాల గేట్లు తెరవకపోవడంతో నిడమానూరు నుంచి కేసరపల్లి వరకు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఇందులో వందలాది మంది విద్యార్థులు చిక్కుకున్నారు. ఓ వైపు పరీక్ష సమయం దగ్గర పడుతుండటం, మరోవైపు ట్రాఫిక్‌ కదలకపోవడంతో పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆందోళన చెందారు. కొంతమంది వాహనాలను రోడ్డు పక్కనే నిలిపివేసి నడుచుకుంటూ పరీక్ష కేంద్రాలకు వెళ్లారు. కొన్ని చోట్ల వివిధ కారణాలతో పరీక్ష 20 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమవడంతో మధ్యాహ్నం 12.20 నిమిషాల వరకు పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చారు. బెంజ్‌సర్కిల్‌ జంక్షన్‌, రామవరప్పాడు రింగ్‌, మహానాడు కూడలి, పీబీ సిద్ధార్థ కళాశాల జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్‌ రద్దీ నెలకొంది. కాగా, నగరంలోని బిషప్‌ అజరయ్య జూనియర్‌ కళాశాల, శారద కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తనిఖీ చేశారు.

నియంత్రణ చర్యలేవీ..?

ముందుగానే ట్రాఫిక్‌ రద్దీని అంచనా వేసి క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. నిడమానూరు, గూడవల్లి పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను తీసుకువచ్చిన బస్సులు, కార్లకు పార్కింగ్‌ స్థలం కేటాయించకపోవడంతో వాహనాలను రోడ్డు మీద నిలిపివేశారు. ఫలితంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది. మరోవైపు కళాశాల నిర్వాహకులతో సైతం పోలీసులకు సమన్వయం కొరవడింది. కనీసం శనివారం రోజు నుంచైనా ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

శారద ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ వద్ద తనిఖీ చేస్తున్న సిబ్బంది

గంగూరులో బస్సుల కోసం నిరీక్షణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని