logo

నోటికి వెలకడుతూ.. నోటుతో జో కొడుతూ..!

Updated : 02 Mar 2024 05:24 IST

వైకాపా ద్వితీయశ్రేణికి తాయిలాల ఎర

ఈనాడు, అమరావతి: ‘ముఖ్య నేతలతో పాటు వైకాపా ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని వదిలి వెళ్లిపోకుండా ఉంచడం ఎలాగో తెలియక.. కొత్త ఇన్‌ఛార్జులు తలలు పట్టుకుంటున్నారు. చివరకు ఆర్థిక ప్రయోజనాలు ఎరవేస్తూ.. పార్టీలోనే ఉండాలని బతిమాలేే పరిస్థితి వచ్చింది. విజయవాడ శివార్లలోని ఓ నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి మొత్తం ఖాళీ అవుతుండగా పార్టీలోనే ఉండాలని సర్పంచులను సామాజిక వర్గాల వారీగా విభజించి మరీ తాయిలాలు పంచుతున్నారు. ఖర్చులుంటాయ్‌ కదా.. ఉంచండి అని ఓ సామాజిక వర్గానికి చెందిన ఒక్కో సర్పంచికి రూ.50వేలు, ఎంపీటీసీలకు రూ.25 వేల చొప్పున ఇస్తున్నట్లు తెలిసింది. పార్టీలోనే ఉంటే మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని మరీ నేతలు వెళ్లకుండా ఆపేందుకు ఆపసోపాలు పడుతున్నారు.’


విజయవాడ మధ్య నియోజకవర్గంలో సిటింగ్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆయన వర్గం నేతలు వెలంపల్లి శ్రీనివాస్‌కు ఏమాత్రం సహకరించడం లేదు. విష్ణుకు వైకాపా విజయవాడ నగరాధ్యక్ష బాధ్యతలు అప్పగించినా ఆయనలో అసంతృప్తి ఏమాత్రం పోలేదు. పార్టీ నగరాధ్యక్ష బాధ్యతల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని విష్ణు, ఆయన వర్గం నేతలు భావిస్తున్నారు. అందుకే వెలంపల్లికి ఇప్పటికీ సహాయ నిరాకరణ ఎదురవుతోంది. దీంతో ఎలాగైనా మధ్య నియోజకవర్గంలో పాగా వేయాలని వెలంపల్లి శ్రీనివాస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఇంటింటి ప్రచారాన్ని గత నెల రోజులుగా విస్తృతంగా చేపడుతున్నారు. ఏ ప్రాంతంలో ప్రచారం ఉంటే.. ఆ స్థానిక కార్పొరేటర్‌కే ఆ రోజు బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనికోసం రోజుకు రూ.25వేలను వెలంపల్లి ఇస్తున్నట్టు సమాచారం. కానీ.. దీనికి రెట్టింపు తమకు ఖర్చవుతోందని కార్పొరేటర్లు గగ్గోలు పెడుతున్నారు. అసలైన ప్రచారం ముందుంది కాబట్టి, అదనంగా పెట్టిన ఖర్చులు తాను ఇచ్చేస్తానని, ఎవరికీ ఇబ్బంది లేకుండా చూసుకుంటానంటూ వెలంపల్లి సర్ది చెబుతున్నట్లు తెలిసింది. ఎవరైనా బయట నుంచి వైకాపా ముఖ్య నేతలు వచ్చిన సమయంలో మాత్రమే.. మల్లాది విష్ణు, గౌతమ్‌రెడ్డి లాంటి వాళ్లు అయిష్టంగానే వస్తున్నారు. లేదంటే పూర్తిగా ముఖం చాటేస్తున్నారు. తాజాగా 31వ డివిజన్‌లో వెలంపల్లి, కేశినేని నాని కలిసి గురువారం ప్రచారం నిర్వహించగా.. విష్ణు, గౌతమ్‌రెడ్డి కూడా వచ్చారు. కానీ ఆరంభం నుంచి చివరి వరకూ వీళ్లిద్దరూ కనీసం ముఖాలు కూడా చూసుకోకుండా.. ఎవరిదారి వారిదే అన్నట్టుగా ఎవరి అనుచరులతో వాళ్లు దూరదూరంగానే ఉండడం గమనార్హం. సెంట్రల్‌ వైకాపాలో నేతల మధ్య సఖ్యత లేమికి నిదర్శనం.


జెండా మోస్తే రూ.200..

ప్రస్తుతం మధ్య నియోజకవర్గంలో వెలంపల్లి ప్రచారం ఏ ప్రాంతంలో ఉంటే అక్కడ బ్యానర్లతో నింపేస్తున్నారు. రోజువారీ బ్యానర్లకు రూ.15వేలు ఖర్చవుతోందని, వాటిని అన్నిచోట్లా కట్టేందుకు మరో రూ.7వేల వరకూ అవుతోందని వైకాపాకు చెందిన ఓ నాయకుడు వెల్లడించాడు. ఇలాగే ప్రచారంలో హడావుడి కోసం వాడే డప్పులకు రూ.5వేలు, రోజూ జెండాలు మోసేందుకు 20 మందిని పెడుతున్నారు. వీరికి రోజుకు రూ.200 చొప్పున రూ.4వేల వరకూ ఇస్తున్నారు. రోజూ అల్పాహారం 150 మందికి పెట్టేందుకు ఒక్కొక్కరికీ రూ.40 చొప్పున వెచ్చిస్తున్నారు. పూలు జల్లేందుకు రూ.వెయ్యి, కొన్నిచోట్ల మహిళలు హారతులు ఇచ్చేలా ఏర్పాటు చేశారు. హారతి పళ్లెంలో రూ.500 కచ్చితంగా పెట్టాలని నిర్ణయించారని వైకాపా నేతలు పేర్కొంటున్నారు. ఇలా.. రోజూ ముందే నిర్దేశించిన విధంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. కానీ మధ్య నియోజకవర్గంలో వెలంపల్లి వర్గం ఎంతగా ప్రయత్నిస్తున్నా కేవలం అదంతా ప్రచార ఆర్భాటమే తప్ప జనం నుంచి అనుకున్నంత స్పందన మాత్రం రావడం లేదని వైకాపా నేతలే బహిరంగంగా వెల్లడిస్తున్నారు. ప్రజల సంగతి సరే.. కనీసం వైకాపా నేతలూ ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి ఇక్కడ లేదు.


పెనమలూరులో విశ్వప్రయత్నాలు..

ఇటీవల ఉయ్యూరులో ప్రసంగిస్తున్న మంత్రి జోగి

ఎమ్మెల్యే పార్థసారథి, కమ్మ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ తుమ్మల చంద్రశేఖర్‌(బుడ్డీ)తో కలిసి భారీగా పెనమలూరులోని వైకాపా నేతలు పార్టీని వీడి వెళ్లిపోయారు. మిగిలిన వాళ్లలోనూ ఇంకా చాలా మంది సారథితోనే కలిసి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. వారిని ఎలాగైనా పార్టీలోనే ఉంచేందుకు పెనమలూరు ఇన్‌ఛార్జి జోగి రమేష్‌, అతని వర్గం ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే వారికి తాయిలాలను ఎరవేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పాస్టర్లు, వాలంటీర్లు, డ్వాక్రా గ్రూపులను నిర్వహించే ఆర్‌పీలు.. ఇలా ఏ వర్గాన్నీ వదలకుండా.. డబ్బులు, తాయిలాలు విచ్చలవిడిగా పంచుతున్నారు. ఆసరా అధికారిక సభలనూ.. ప్రచారానికి వాడుకున్నారు. ఇలా జోగి వర్గం ఎన్ని చేస్తున్నా.. పెనమలూరు స్థానిక వైకాపా నేతల్లో అత్యధికులు సారథి వర్గం వాళ్లే కావడంతో వారిని పార్టీలో ఉంచడం అసాధ్యంగా మారుతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో నేతలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఉన్నోళ్లను కాపాడుకునేందుకు తాయిలాలు ఎరవేస్తున్నట్టు తెలిసింది. అవికూడా ఎంపిక చేసిన కొందరికే ఇస్తుండడంతో మిగతా వాళ్లు గుర్రుగా ఉన్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని