logo

తెలుగుదేశానికి..జై

మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌ తెలుగుదేశం కండువా కప్పుకోనున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో శనివారం హైదరాబాద్‌లో ఆ పార్టీలో చేరికకు ఏర్పాట్లు చేసుకున్నారు.

Published : 02 Mar 2024 04:28 IST

చంద్రబాబు సమక్షంలో వసంత చేరిక నేడు
వైకాపాను వీడిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌ వెళ్తూ.. అంబారుపేట సత్యమ్మతల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌, శిరీష దంపతులు

ఈనాడు, అమరావతి: మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌ తెలుగుదేశం కండువా కప్పుకోనున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో శనివారం హైదరాబాద్‌లో ఆ పార్టీలో చేరికకు ఏర్పాట్లు చేసుకున్నారు. తర్వాత మరోసారి మంగళగిరి తెదేపా కార్యాలయంలో అనుచరులతో చేరికకు భారీ కార్యక్రమం చేపట్టనున్నట్లు వసంత అనుచరులు చెబుతున్నారు. బాబు సమక్షంలో చేరేందుకు శనివారం 15 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. ఈనేపథ్యంలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే వసంత స్వగ్రామం ఐతవరం నుంచి .. ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ, జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం ముఖ్యనాయకులు హైదరాబాద్‌ తరలివెళ్లారు.

  • బందరు ఎంపీ బాలశౌరి ఇప్పటికే వైకాపాను వీడి జనసేనలో చేరారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కూడా తెదేపాలో చేరగా నూజివీడు టికెట్‌ కేటాయించారు. విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్‌, పెనమలూరు నాయకులు వైకాపాకు గుడ్‌బై చెప్పారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి ఆ పార్టీకి దూరం కాగా.. ఏ పార్టీలో చేరేదీ స్పష్టత ఇవ్వలేదు. సిటింగ్‌ ఎమ్మెల్యేను కాదని తెదేపా నుంచి చేరిన మాజీ ఎమ్మెల్యే స్వామిదాసుకు వైకాపా టికెట్‌ కేటాయించారు. రెండుసార్లు గెలిచిన రక్షణనిధి.. సీఎం జగన్‌ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే విష్ణును పక్కన పెట్టి.. పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లికి.. సెంట్రల్‌ టికెట్‌ కేటాయించారు. ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వెలంపల్లికీ సహకరించడం లేదు. పశ్చిమ అభ్యర్థిగా ఆసిఫ్‌ను ప్రకటించడంతో పైలా స్వామినాయుడు, మరికొందరు సీనియర్లు దూరంగా ఉన్నారు. మైలవరంలోనూ తిరుపతిరావును ప్రకటించడంపై ఓ వర్గం అసంతృప్తితో ఉంది.

మార్పులపై కసరత్తు..

మార్పులపై కసరత్తు చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అవనిగడ్డకు సింహాద్రి చంద్రశేఖర్‌కు టికెట్‌ కేటాయిస్తే.. ఆయన పోటీ చేయనని తేల్చి చెప్పారు. తనయుడు రామ్‌చరణ్‌కు అవకాశం ఇవ్వాలని కోరగా పెండింగ్‌ పెట్టారు. సింహాద్రి రమేష్‌ను లోక్‌సభకు పంపాలని నిర్ణయించి ఇప్పుడు పునరాలోచన చేస్తున్నారు. పార్టీలో చేరిన నూజివీడుకు చెందిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు మైలవరం లేదా గన్నవరం ఇవ్వాలనే చర్చ సాగుతోంది. విజయవాడ ఎంపీ బరిలో వల్లభనేని వంశీని లేదా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ను దింపాలనే ప్రతిపాదన ఉంది. సమన్వయకర్తలుగా నియమించిన వారు అభ్యర్థులుగా ఉండరేమోననే అనుమానంతో క్రియాశీలకంగా లేరనే చర్చ పార్టీలో జరుగుతోంది.


ఎవరు ఎక్కడో...?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెదేపా.. 10 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి జోరు మీదుంది. వైకాపా కేవలం రెండు పార్లమెంటు స్థానాలు.. 8 అసెంబ్లీ సెగ్మెంట్లకు సమన్వయకర్తలనే నియమించింది. వీరిని మార్చే అవకాశాలు లేకపోలేదని చెబుతోంది. జగ్గయ్యపేటకు విప్‌ ఉదయభాను, నందిగామకు ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్నా వారిపేర్లు ప్రకటించలేదు. విజయవాడ తూర్పు ఇన్‌ఛార్జిగా అవినాష్‌ ప్రచారం చేస్తున్నా.. అక్కడా ప్రకటించలేదు. సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడపైనా తాత్సారమే. గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ పోటీ చేస్తారా లేదా అనే అనుమానం నెలకొంది. పామర్రు ఎమ్మెల్యే కైలే అభ్యర్థిత్వాన్ని తాజాగా సీఎం జగన్‌ ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు