logo

మాడినా..మూడినా..మొక్కాల్సిందే!

పామర్రులో విద్యాదీవెన నిధుల విడుదల సభ కోసం.. భారీగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, చిన్నారులను తరలించడంతో ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Updated : 02 Mar 2024 05:23 IST

సీఎంకు స్వాగతం పేరిట మండుటెండలో యాతన
అల్పాహారం, వసతులు లేక అల్లాడిన విద్యార్థులు

ఎండ వేడికి మగువల అవస్థలు

ఈనాడు డిజిటల్‌, మచిలీపట్నం, న్యూస్‌టుడే, పామర్రు గ్రామీణం, పామర్రు: పామర్రులో విద్యాదీవెన నిధుల విడుదల సభ కోసం.. భారీగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, చిన్నారులను తరలించడంతో ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌ ఉదయం 11 గంటల సమయంలో హెలీకాప్ట్టర్‌ దిగి సభా ప్రాంగణానికి వచ్చే సమయంలో.. ఎండ మండిపోతుంటే.. రహదారికి ఇరువైపులా వందల మంది మహిళలను నిలబెట్టి.. అవస్థలకు గురిచేశారు. అసలే ఎండ వేడి తట్టుకోలేక.. చిన్నారులు కూడా సొమ్మసిల్లి పడిపోతుంటే.. ముఖ్యమంత్రికి జేజేలు పలకాలి.. ముఖ్యమంత్రికి దండాలు పెట్టాలని.. రహదారికి ఇరువైపులా నిలబెట్టడంపై.. మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కనీసం అల్పాహారం కూడా ఇవ్వలేదని.. విద్యార్థినులు మండిపడ్డారు. ఎస్తేరు రాణి అనే చిన్నారి.. ఎండ వేడికి సొమ్మసిల్లగా ఆమె తాత కన్నీటి పర్యంతమవడం చూపరులను కంటతడి పెట్టించింది.

విద్యార్థినిని ఆశీర్వదిస్తున్న సీఎం జగన్‌. పక్కనే ఎమ్మెల్యే కైలే

ప్రసంగాల్లోనే ప్రాధాన్యం..

సీఎం సభ జరిగే ప్రాంతానికి దగ్గరలోనే ఇంటర్‌ పరీక్ష కేంద్రం ఉంది. అయినా.. ఉదయం 8 గంటల నుంచి.. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పెద్దగా డీజేలు పెట్టి మరీ జగన్‌ స్మరణ పాటలు వేస్తూ.. పరీక్ష రాసే విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. సభా ప్రాంగణానికి పక్కనే కంచెర్ల రామారావు జడ్పీ ఉన్నత పాఠశాలలో.. పదో తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్‌ పరీక్ష జరగాల్సి ఉండగా.. మధ్యలో ఆపేసి.. పిల్లలను ఇంటికి పంపారు. ఆ పాఠశాలలో వాహనాల పార్కింగ్‌, సభలో డీజేల గోలకు పరీక్షను ఆపేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. విద్యకు తాను ఇచ్చే ప్రాధాన్యం.. అమోఘమని ముఖ్యమంత్రి సుదీర్ఘ ఉపన్యాసం ఇస్తుంటే.. ఆ సభ కోసం.. పరీక్షల వేళ ఇలా ఇబ్బంది ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

మండుటెండలో నిలబడి సీఎం రాకను వీక్షిస్తున్న ప్రజలు

అవస్థలు వర్ణనాతీతం..

  • సభ కోసం తీసుకొచ్చిన కొన్ని కళాశాలల విద్యార్థినులు బస్సుల్లోనే పార్కింగ్‌ ప్రాంతాల్లో ఉండిపోయారు. మరికొందరు సభా వేదిక వద్దకు వచ్చి.. స్థలం లేక వెనుదిరిగి ఎక్కడో నీడన రెండు మూడు గంటలు కూర్చుని ఉన్నారు.
  • ఐదేళ్ల చిన్నారుల నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకూ ఎవరు దొరికితే వాళ్లను చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆటోలు, బస్సుల్లో తీసుకొచ్చారు. చాలాచోట్ల వృద్ధులు నీరసంగా కూలబడి కనిపించారు.
  • సభా ప్రాంగణంలో ఫిర్యాదులు తీసుకొనే డెస్క్‌ పెట్టినా వారిని పట్టించుకోలేదు.
  • కైకలూరు నుంచి వచ్చిన ఓ మహిళ తన కాలు శస్త్రచికిత్స కోసం సహాయం కోరదామని వస్తే.. ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఉసూరుమంటూ వెనుదిరిగింది.
  • సభ కోసం వచ్చిన వారు ఎండ తాకిడి భరించలేక రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన జెండాలు, ఫ్లెక్సీలను పీకి.. వాటి నీడలో నిలబడ్డారు.
  • ఆర్టీసీ బస్సులు లేక జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. పామర్రుకు వచ్చే బస్సులను రాకుండా.. బారికేడ్లు పెట్టడంతో ప్రయాణికులు అవస్థలు పడాల్సి వచ్చింది.

పామర్రు అభ్యర్థిపై స్పష్టత

పామర్రు వైకాపా అభ్యర్థి ఎవరనే సందేహానికి.. ముఖ్యమంత్రి జగన్‌ తెరదించేశారు. జగన్‌ మాట్లాడుతూ.. అనిల్‌ను మీ ముందుకు పంపిస్తున్నాను. మీరంతా అతన్ని మనసారా ఆశీర్వదించాలని కోరుతున్నానని పేర్కొన్నారు.

  • సభ తర్వాత సీఎం వైకాపా నాయకులతో రెండుగంటలకుపైగా భేటీ అయ్యారు. వివిధ అంశాలపై మాట్లాడి స్థానిక పరిస్థితులు తెలుసుకున్నారు.

నిరీక్షించి.. నీరసించి.. కూలబడి

మూసేసిన దుకాణాల వద్ద పిల్లలతో మహిళల పడిగాపులు


అటు ప్రసంగం.. ఇటు పలాయనం

సీఎం ప్రసంగిస్తుండగానే.. సభాస్థలి, ప్రాంగణం నుంచి వెనుదిరుగుతూ..

 

సొమ్మసిల్లి పడిపోయిన విద్యార్థినికి చికిత్స

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని