logo

రైల్వే ఆస్తులపై వెలంపల్లి కన్ను

నగరంలో ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు కనిపించినా.. వైకాపా నాయకులు హస్తగతం చేసుకుంటున్నారు. వెలంపల్లి శ్రీనివాస్‌ రాకతో సెంట్రల్‌ నియోజకవర్గంలో మరింత ఊపందుకున్నాయి

Published : 03 Apr 2024 04:55 IST

క్రమబద్ధీకరణ పేరిట  వ్యాపారులకు గాలం

బీఆర్‌టీఎస్‌ రోడ్డు

 విజయవాడ, న్యూస్‌టుడే: నగరంలో ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు కనిపించినా.. వైకాపా నాయకులు హస్తగతం చేసుకుంటున్నారు. వెలంపల్లి శ్రీనివాస్‌ రాకతో సెంట్రల్‌ నియోజకవర్గంలో మరింత ఊపందుకున్నాయి. బుడమేరు కట్ట, ఇరిగేషన్‌ స్థలాలు మొత్తం ఆక్రమించగా.. ఇప్పుడు వారి కళ్లు రైల్వే స్థలాలపై పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే.. కబ్జా స్థలాలను రెగ్యులరైజ్‌ చేయిస్తామంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. బీఆర్‌టీఎస్‌ రోడ్డు నుంచి ఫుడ్‌ జంక్షన్‌ వరకు పాత సత్యనారాయణపురం రైల్వేస్టేషన్‌ ఉన్న సమయంలో.. దారి పొడవునా భారీగా రైల్వే శాఖకు చెందిన స్థలాలు ఉన్నాయి. ప్రధాన రహదారి రోడ్డు పక్కనే.. కోట్లాది రూపాయిల విలువైన ఈ స్థలాలను కొందరు వ్యాపారులు నగరపాలక సంస్థ అధికారులను మేనేజ్‌ చేసి.. రైల్వే స్థలం అని తెలిసినా యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. ఇళ్లతో పాటు వ్యాపార సముదాయాలు నిర్మించారు. కోట్లా రూపాయిల విలువ చేసే స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. ఎట్టకేలకు ఆరు నెలల క్రితం.. రైల్వే అధికారులు ఆక్రమణలకు గురైన స్థలాలను గుర్తించి మార్కింగ్‌ చేశారు. దారి పొడవునా పొక్లెయిన్‌తో తవ్వి అడ్డంగా ఫెన్సింగ్‌ నిర్మించారు. ఆయా స్థలాల్లో ఎలాంటి కట్టడాలు చేసినా రైల్వే నిబంధనల ప్రకారం శిక్షార్హులని బోర్డులు ఏర్పాటు చేశారు. రైల్వే స్థలాలను రెగ్యులరైజ్‌ చేయాలంటే.. రైల్వే బోర్డు నుంచి అనుమతులు ఉండాలి. అది చాలా పెద్ద వ్యవహారం కావడంతో నగరపాలక సంస్థ అధికారుల సహకారంతో వ్యాపారులు ఫెన్సింగ్‌ తొలగించి.. తిరిగి వ్యాపారాలు చేసుకుంటున్నారు.

 భారీగా నిధుల చెల్లింపు

తనను గెలిపిస్తే బీఆర్‌టీఎస్‌ రోడ్డు పొడవునా ఉన్న ఆక్రమిత రైల్వే స్థలాలను అధికారులతో మాట్లాడి రెగ్యులరైజ్‌ చేయిస్తానని వైకాపా సెంట్రల్‌ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌ స్థానిక వ్యాపారులకు హామీ ఇచ్చారు. ఇందుకు పార్టీ ఫండ్‌తో పాటు పరిసర ప్రాంతాల వారితో వైకాపాకే ఓట్లు వేయించాలని షరతు పెట్టారు. దీనికి ఆమోదం తెలిపిన వ్యాపారులు.. భారీగానే కొంత పార్టీ ఫండ్‌ ఇచ్చారు. ఒక్కో వ్యాపారి రూ.2 లక్షల నుంచి రూ.5లక్షల వరకు చెల్లించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పనుల బాధ్యతలు వెలంపల్లి సామాజికవర్గానికే చెందిన లోటస్‌ ల్యాండ్‌ మార్కులో ఉండే నేతకు అప్పగించారు. ఇప్పటికే ఈ విషయాన్ని వెలంపల్లి శ్రీనివాస్‌.. రైల్వే అధికారులతో మాట్లాడారని, పని తప్పకుండా అవుతుందని సదరు నేత వ్యాపారుకుల హామీ ఇచ్చారు.

25 ఎకరాల స్థలంపైనా కన్ను

అజిత్‌సింగనగర్‌లో ఉన్న సుమారు 25 ఎకరాల రైల్వే భూములపైనా వైకాపా నేతల కళ్లుపడ్డాయి. గతంలో వాటిని ఆక్రమించేందుకు ప్రయత్నించగా.. రైల్వే అధికారులు అడ్డుకున్నారు. చుట్టూ ఫెన్సింగ్‌ నిర్మించారు. వైకాపా ప్రభుత్వం రావడంతో.. తిరిగి కబ్జా చేసేందుకు స్థానిక వైకాపా నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. తాజాగా ఆ స్థలంపైనా వెలంపల్లి శ్రీనివాస్‌ కళ్లుపడ్డాయి. కోట్లాది రూపాయిల విలువ చేసే రైల్వే స్థలాల ఆక్రమణలకు గురికాకుండా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని